Aug 03,2023 11:10

న్యూఢిల్లీ  :    జ్ఞానవాపి మసీదులో శాస్త్రీయ సర్వే చేపట్టాలన్న వారణాసి జిల్లా కోర్టు ఇచ్చిన ఆదేశాలను గురువారం అలహాబాద్‌ హైకోర్టు సమర్థించింది. న్యాయ ప్రయోజనాల రిత్యా శాస్త్రీయ సర్వే (ఎఎస్‌ఐ) చేపట్టడం అత్యవసరమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. జ్ఞానవాపికి సంబంధించి (పూజించే హక్కులు) అన్ని కేసులను త్వరలో పరిష్కరించాలని ఆదేశించింది. మసీదు ఆవరణలోని హిందూ విగ్రహాలు, చిహ్నాలకు హిందూయేతర వ్యక్తులు ధ్వంసం చేయకుండా ఆ ప్రాంతమంతా సీల్‌ వేయాలంటూ ఉత్తప్రదేశ్‌ ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ హిందూ పిటిషనర్‌తో పాటు మితవాద కార్యకర్తల బృందం అలహాబాద్‌ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌)ను దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

వారణాసి కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ  (అంజుమాన్‌ ఇంతియాజ్‌ ) మసీద్‌ కమిటీ దాఖలు చేసిన  పిటిషన్‌ను కొట్టివేసింది. శాస్త్రీయ సర్వేకు అనుమతిస్తూ వారణాసి కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ మసీదు కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గత నెల 21న ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఎఎస్‌ఐ సర్వేపై స్టే విధించింది. అలహాబాద్‌ హైకోర్టు కూడా మొదట ఆగస్ట్‌ 3 వరకు సర్వేను నిలిపివేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే.