Oct 27,2023 16:00
  •  విజయవంతం చేయండి : విద్యార్థి యువజన సంఘాల నాయకుల పిలుపు 

ప్రజాశక్తి-రాయదుర్గం : కడపలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలి, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని కోరుతూ నవంబర్ 8న రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థల బందును చేపడుతున్నట్లు విద్యార్థి యువజన సంఘాల నాయకులు తెలిపారు. శుక్రవారం రాయదుర్గంలోని ఎన్జీవో భవన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, ఏ ఐ వై ఎఫ్, పి డి ఎఫ్, యు బి సి ఎస్ సి ఎస్ టి మైనారిటీ విద్యార్థి సమాఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వానికి వత్తాసుగా పని చేస్తూ రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలను తాకట్టు పెడుతున్నట్లు ఆరోపించారు. ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఏఐవైఎఫ్, పిడిఎస్యు టీఎన్ఎస్ఎఫ్, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ విద్యార్థి సమైక్య కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు, విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కోసం నవంబర్ 8న రాష్ట్రవ్యాప్తoగా తలపెట్టిన విద్యాసంస్థల బంద్ జయప్రదం చేయాలని విద్యార్థి యువజన సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ.కుల్లాయస్వామి ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి పరమేష్, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు ఆనంద్ కుమార్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థి సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి సురేష్ యాదవ్, పిడిఎస్యు జిల్లా ఉపాధ్యక్షులు ప్రసాద్, టిఎన్ఎస్ఎఫ్ పార్లమెంట్ ఉపాధ్యక్షులు భరత్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు శివ మాట్లాడుతూ అనేక త్యాగాలతో విద్యార్థి యువజన నాయకుల 32 మంది ప్రాణ త్యాగాలతో ఏర్పాటైన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని మోడీ ప్రభుత్వం ప్రైవేటీకరణకు పూనుకోవడాన్ని నిరసిస్తూ జరుగుతున్న పోరాటం నవంబర్ 8 నాటికి వెయ్యి రోజులు అవుతున్న సందర్భంగా వామపక్ష విద్యార్థి యువజన సంఘాల ప్రత్యక్ష ఆందోళనలో పాల్గొనడంతో పాటు నవంబర్ 8వ తేదీ రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ కి పిలుపునిచ్చారు. లాభాలు వస్తున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలని ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఫ్యాక్టరీ అనుబంధంగా ఇనుప గనులు కేటాయించకపోవడం సిగ్గుచేటన్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మందికి ఉపయోగపడుతున్న విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. 'విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు' అంటూ పోరాడిన అమరవీరుల త్యాగాలు స్ఫూర్తితో విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా పోరాటం చేస్తామన్నారు. రాయలసీమ ప్రాంతం కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని విభజన చట్టంలో పేర్కొన్న హామీ ఇంతవరకు ఏ మాత్రం అమలు చేయలేదని తెలిపారు. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు అయితే లక్షలాదిమంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని తెలిపారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం రాష్ట్ర విభజన హామీలు అమలు చేయకుండా వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధికి నిధులు ఇవ్వకపోయినా నూతన పరిశ్రమలు ఏర్పాటు వంటి విభజన హామీలు అన్నిటిపై నిర్లక్ష్యం చేస్తూ రాష్ట్రంలోని బిజెపి నేతలు మోడీని ఎందుకు అడగడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వ పెద్దలు నిద్ర నటిస్తున్నారని రాష్ట్ర ప్రయోజనాల కంటే ముఖ్యమంత్రికి వ్యక్తిగత ప్రయోజనాలు ఎక్కువ అయ్యాయని ఆరోపించారు. కేసుల భయంతో మోడీ ముందు మోకరిల్లుతున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన హామీలలో ప్రధానమైన కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం కేంద్రం ఒక్క పైసా కూడా నిధులు కేటాయించకపోవడం సిగ్గుచేటు అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం రెండు సార్లు శంకుస్థాపన చేసిన ఆచరణలో పురోగతి లేదన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి స్థానిక యువతకి ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణ కడప ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమాలు నిర్వహిస్తామని తెలిపారు. నవంబర్ 8వ తేదీ వరకు జిల్లాలో అన్ని మండలా నియోజకవర్గ కేంద్రాలలో రౌండ్ టేబుల్ సమావేశాలు, పత్రిక సమావేశాలు సదస్సులు ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. నవంబర్ 8వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా కేజీ టు పేజీ వరకు జరిగే విద్యాసంస్థల బంద్ కు ప్రతి ఒక్కరూ మద్దతు తెలిపే సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కోశాధికారి హనుమంత రాయడు, నియోజకవర్గ కార్యదర్శి ఆంజనేయులు, జిల్లా ఉపాధ్యక్షులు వంశీ, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు శివ, ఏఐవైఎఫ్ నియోజకవర్గ అధ్యక్షులు కుమార్ నాయక్, పిడిఎస్ యు నియోజకవర్గ నాయకులు మహేంద్ర, ఏఐఎస్ఎఫ్ నాయకులు నవనీత్ రెడ్డి, మల్లికార్జున, చిరంజీవి, సుదీప్, జగన్, ఎస్ఎఫ్ఐ నాయకులు ప్రేమ్, వివేక్, అనిల్, లోకి, జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు.