Sep 15,2022 05:59

జ్ఞానవాపి మసీదు కేసులో వారణాసి కోర్టు సోమవారం తీసుకున్న నిర్ణయం ప్రార్థనా స్థలాల చట్టం-1991 వెనుక గల ఉద్దేశాన్ని స్పష్టంగా అతిక్రమించడమే! మసీదు ప్రహరీ వద్ద వున్న హిందువుల దేవతా విగ్రహాలకు రోజూ పూజలు చేసుకునేందుకు అనుమతించాలని కోరుతూ ఐదుగురు హిందూ మహిళలు దాఖలు చేసిన పిటిషన్లు విచారణా యోగ్యమైనవని కోర్టు అంగీకరించడం కొత్త వివాదాలకు సైతం అవకాశం కల్పిస్తుంది. ఈ మసీదు వక్ఫ్‌ ఆస్తి అని, అందువల్ల ఈ పిటిషన్‌ను విచారించరాదన్న అంజుమన్‌ ఇంతెజామియా మసీద్‌ కమిటీ ఆ విషయాన్ని రుజువు చేయలేనందున వారి పిటిషన్‌ను తోసిపుచ్చిన కోర్టు 22 నుండి విచారణ చేపడతానంది. ఆ మసీదు వక్ఫ్‌ ఆస్తి అవునా కాదా అన్నదానిపై రుజువులు, సాక్ష్యాల కంటే ఈ వివాదాన్ని ఇలా పొడిగించడంవల్ల కలిగే నష్టాన్ని గురించి కోర్టు ఆలోచించినట్టు లేదు. అంతేగాక మసీదు వక్ఫ్‌ ఆస్తిగా ఆ కమిటీ నిరూపించలేదని కోర్టు చెప్పడం దాన్ని ముస్లిములు దురాక్రమణ చేశారంటూ హిందుత్వ వాదులు చేస్తున్న వాదనను ఎగదొయ్యడమే అవుతుంది. ప్రార్ధనా స్థలాన్ని ఒక ఆస్తి వివాదంలా మార్చాలనుకోవడమూ హ్రస్వ దృష్టి అవుతుంది.
మసీదు ప్రహరీ వద్ద వున్న హిందువుల దేవతా విగ్రహాలకు నిత్య పూజలు చేసుకోవడాన్ని ప్రార్ధనా స్థలాల చట్టం నిషేధించడం లేదని కోర్టు వ్యాఖ్యానించడం తగదు. ఇలా న్యాయ వ్యవస్థలోని కొన్ని విభాగాలు చట్టానికి తప్పుడు భాష్యం చెప్పడం వల్ల చట్టం వేటినైతే నివారించాలనుకుందో ఆ రకమైన తీవ్ర పర్యవసానాలకు దారి తీయగలదు. భారత రాజ్యాంగం చట్ట, న్యాయ, పాలనా విభాగాలను మూడు మూల స్తంభాలుగా పేర్కొంటూనే వాటి మధ్య లక్ష్మణ రేఖ గీసింది. వారణాసి కోర్టు నిర్ణయం దాన్ని ఉల్లంఘించడమేనన్న పరిశీలకుల విమర్శను కాదనడం కష్టమే! మత విద్వేషాలు సృష్టించడానికి, మైనారిటీ కమ్యూనిటీలను లక్ష్యంగా చేసుకోవడానికే చరిత్రను వక్రీకరిస్తూ పరివార్‌ శక్తులు చరిత్రకు వక్ర భాష్యం చెబుతున్నాయన్నది జగమెరిగిన సత్యం. ఆలయాలను ధ్వంసం చేసి వాటి స్థానంలో మసీదులను నిర్మించారని ఈనాడు చెబుతున్న వాదన కొత్తదేమీ కాదు. మతపరమైన భావాలను రెచ్చగొట్టడానికి, మతోన్మాద ఎజెండాను అమలు చేయడానికి కొన్ని దశాబ్దాలుగా ఈ వాదనను ఉపయోగించుకుంటూనే వున్నారు. అయోధ్య వివాదంలో సుప్రీం తీర్పు అనంతరం మందిర నిర్మాణాన్ని చేపట్టిన హిందుత్వ శక్తులు వారణాసి వివాదాన్ని తీవ్రతరం చేసి మత విద్వేషాలను పెంచాలని ప్రయత్నిస్తున్నాయి. వారణాసి కోర్టు అలాంటి శక్తులకు దోహదం చేసేలా నిర్ణయం తీసుకోవడం విచారకరం.
దేశమంతటా మత విద్వేష వాతావరణాన్ని పెంచిన నేపథ్యంలో మథుర, వారణాసి ఆలయాల విషయంలో మాదిరిగా న్యాయస్థానాల్లో ఉద్దేశపూర్వకమైన పిటిషన్లు పెద్ద సంఖ్యలో వెల్లువెత్తకుండా నివారించేందుకు, ప్రధాన జాతీయ ప్రయోజనమైన మత సామరస్యాన్ని పరిరక్షించేందుకు ప్రార్థనా స్థలాల చట్టం-1991 తీసుకువచ్చారు. దేశంలోని ప్రార్థనా స్థలాలన్నిటినీ 1947 ఆగస్టు 15 నాడున్న స్థితి నుండి వాటి మత స్వభావాన్ని మార్చడాన్ని నిషేధిస్తూ ఆ చట్టం చేశారు. అయితే, అయోధ్య వివాదాస్పద కట్టడాన్ని మాత్రం ఆ చట్టం నుండి మినహాయించారు. ప్రార్థనా స్థలాల చట్టం-1991 ఉద్దేశాన్ని, దీని వెనుక గల స్ఫూర్తిని అవగతం చేసుకొని దాన్ని కఠినంగా అమలు చేయాలి. లేకపోతే దేశమంతటా మతోన్మాదులు ప్రార్థనా స్థలాల కేంద్రంగా మత విద్వేషాలను రెచ్చగొట్టి, ప్రజల మధ్య చీలికలను సృష్టిస్తారు. వేష భాషలు, ఆహారపుటలవాట్ల ప్రాతిపదికగా విద్వేషాలను సృష్టిస్తున్న శక్తులకు సాక్షాత్తూ ప్రార్థనా స్థలమే అందుకు కేంద్ర బిందువైతే మరింతగా రెచ్చిపోతాయి. యథేచ్ఛగా సాగుతున్న కార్పొరేట్‌ దోపిడీకి వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడాల్సిన ప్రజల మధ్య చీలికలు తెచ్చే కుట్ర ఇది. ఆ కుట్రలను వమ్ము చేసి ప్రజలంతా ఐక్యంగా నేడున్న కార్పొరేట్‌ మతతత్వ కూటమి పాలనను, దాని దుర్విధానాలను తిప్పిగొట్టాలి.