Jul 12,2022 06:39

వైసిపి శుక్ర, శని రెండు రోజులపాటు గుంటూరు జిల్లాలో అత్యంత కోలాహలంగా నిర్వహించిన ప్లీనరీ సమావేశాలు ఆద్యంతం వచ్చే ఎన్నికల్లో అధికారం సాధించే లక్ష్యాన్ని ఏకరువు పెట్టాయి. పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రసంగం యావత్తూ 'టార్గెట్‌ 2024' దిశగానే సాగింది. స్వీయ భుజకీర్తులు, ప్రతిపక్షాలపై దుమ్మెత్తిపోయడాలతో ఆత్మస్తుతి పరనింద ఫార్మూలాను అమలు చేశారు. రాష్ట్రంలో గల 175 సీట్లకు 175 సీట్లు సాధించాలని పార్టీ శ్రేణులకు నిర్దేశించారు. నూటికి నూరు శాతం ఫలితాలు సాధించాలంటే అధికారానికి ముందు ప్రజలకేం చెప్పాం వచ్చాక ఏం చేశామన్న వీక్షణం తప్పనిసరి. గద్దెనెక్కాక మూడేళ్లకు జరిగిన ఈ ప్లీనరీ చర్చల్లో అటువంటి ఆత్మపరిశీలన మచ్చుకైనా కనిపించలేదు. తప్పొప్పులపై సమీక్షించుకునే బాధ్యతను విస్మరించారు. 2019లో ప్రజలకు ఇచ్చిన హామీలు, సంక్షేమ పథకాల గురించి వల్లె వేశారు మినహా అధికారంలోకొచ్చాక 2022లో తలెత్తిన సమస్యలను కనీసం గుర్తించే ప్రయత్నం చేయలేదు. తాము చేసిందే రైట్‌ వేరెవరి నుండి తెలుసుకోవాల్సిన అవసరం లేదన్న ధోరణి వన్‌ మ్యాన్‌ ఆర్మీ, వన్‌ సైడ్‌ బ్యాటింగ్‌ తప్ప ప్రజాస్వామ్యం అనిపించుకోదు. పార్టీకి శాశ్వత అధ్యక్షునిగా జగన్‌ ఎన్నికా అంతే.
హామీల్లో 95 శాతం నెరవేర్చామని ఘనత చాటారు జగన్‌, ఆయన పార్టీ గణం. వాగ్దాన భంగంపై మాత్రం నోరు మెదపలేదు. గత ఎన్నికల ఎజెండాలో అత్యంత చర్చనీయాంశమైనది ప్రత్యేక హోదా. ప్లీనరీ తీర్మానాల్లో ఈ అంశం ప్రస్తావనే లేదు. హోదా వస్తే ఇక్కడ హైదరాబాద్‌ వంటి నగరాలు ఎన్నో తయారవుతాయనగా, హోదా లేక చదువుకున్న యువత ఉపాధి కోసం చెన్నరు, బెంగళూరు, హైదరాబాద్‌, ముంబయి, పూణె దారి పట్టాల్సి రావడంపై కించిత్తయినా ఆత్మావలోనకం ఉండనక్కర్లేదా? రాష్ట్రానికి జీవనాడిగా అభివర్ణించిన పోలవరం ఊసేది? విభజన హామీల సాధనపై పార్టీ వైఖరేంటో చెప్పరా? ఆంధ్రుల ఆత్మగౌరవానికి చిహ్నమైన, పోరాటంతో సాధించుకున్న ఒకే ఒక్క ప్రభుత్వరంగ సంస్థ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై తమ విధానమేంటో తెలపరా? ఇవన్నీ ప్రస్తుతం రగులుతున్న అంశాలు. పైగా కేంద్రం నిర్ణయించాల్సినవి. కేంద్రం మెడలు వంచి మరీ హోదా, విభజన హామీలు సాధిస్తామని చెప్పి, ఇప్పుడేమో అవి ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతూ పార్టీ ప్లీనంలో తీర్మానం చేసే ధైర్యం ఎందుకు చేయలేకపోతున్నారు? రాష్ట్రానికి విద్రోహం తలపెట్టిన కేంద్ర బిజెపిని నిలదీయడానికి నోరెందుకు పెగలట్లేదు? కేంద్రాన్ని నొప్పించకుండా ఎల్లకాలం అడుగుతూ...నే ఉంటారా? ఈ సందేహాలు ప్రజల మెదళ్లను తొలుస్తున్నాయి. మూడేళ్లకైనా ఏమైనా చెబుతారేమోనని ప్రజలు ఎదురు చూడగా సమాధానాల్లేకుండానే ప్లీనరీని ముగించడం ప్రజల ఆకాంక్షలను గాలికొదిలేయడమే.
ఈ కాలంలో వివిధ వర్గాల ప్రజలెదుర్కొంటున్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. కేంద్ర ఆదేశాలతో చెత్తపన్ను, ఆస్తి పన్ను, విద్యుత్‌, ఆర్టీసి ఛార్జీలు బాది ప్రజలపై అదనపు భారాలు వేసింది వైసిపి సర్కార్‌. రైతులకు సబ్సిడీలు అందట్లేదు. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు అమర్చి ఉచిత విద్యుత్‌కు ముప్పు తెచ్చింది. అమ్మఒడిలో రూ.2 వేలు కోత పెట్టింది. లక్షల మంది ఉద్యోగులు, స్కీం వర్కర్స్‌, కాంట్రాక్టు, ఔట్‌సోర్స్‌ సిబ్బంది, మున్సిపల్‌ కార్మికుల వేతనాలు, ఆరోగ్యశ్రీ, భూపంపిణీ ఎన్నో సమస్యలు పేరబడగా వాటికి ప్లీనరీలో పరిష్కారం చూపించలేదు. స్థానిక సంస్థల హక్కులు, విధులు, నిధుల సంగతి సరేసరి. స్థానిక నిధులతో కరెంట్‌ బిల్లులు కట్టామని ఆర్థిక మంత్రి ప్లీనరీ వేదికపై అంగీకరించారు. రాజధానిపై అదే అయోమయం. కేంద్రం మోదిన గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు జనం ఉసురు తీస్తున్నాయి. ధరల పెరుగుదలకు కేంద్రమే కారణమని, బాధ్యత తమది కాదన్న మంత్రి బుగ్గన, ధరల తగ్గింపునకు కేంద్రంపై నిర్వహించిన పోరాటమేమిటో, తాముగా ప్రజలకు కలిగించిన ఉపశమనమేంటో చెప్పకుండా దాటవేయడం పలాయనవాదమే. అధికారపార్టీ ప్లీనం అంటే రాష్ట్ర ప్రజల సమస్యలపై ఏం చర్చిస్తారు కేంద్రాన్ని ఏం అడుగుతారు అనే ఆశ, ఆసక్తి జనంలో ఉంటుంది. వైసిపి ప్లీనరీ ప్రజల ఆశలను వమ్ము చేసింది. ప్రజలను విస్మరిస్తే వారి ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది.