
ఎన్నికల వేళ కర్ణాటకలో ముస్లిం రిజర్వేషన్ల చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకున్న బిజెపి ఎత్తుగడలను దేశ సర్వోన్నత న్యాయస్థానం నిలువరించి న్యాయ వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం నిలిపింది. సుప్రీం కోర్టు విచారణలో ఉన్న అంశంపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా బహిరంగంగా చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వెలిబుచ్చి రాజ్యాంగ ధర్మాన్ని కాపాడింది. రాజకీయాలు చేయడం మానుకోవాలని, వ్యవస్థలపై గౌరవ మర్యాదలు ఉంచాలని గడ్డి పెట్టింది. తరచు ఉద్రేక, విద్వేష, వివాద ప్రసంగాలు చేయడానికి పోటీలు పడుతున్న బిజెపి, పరివార ముఠాలకు 'సుప్రీం' ధర్మాగ్రహం చెంప పెట్టు వంటింది. అవినీతి, అక్రమాలు, పాలనా వైఫల్యాలతో కర్ణాటక బిజెపి ప్రభుత్వ అడుగు జారింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న తలంపుతో తన అసలు సిసలు మెజారిటీ వాద ఆయుధాన్ని బయటికి తీసింది. ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా వెనకబడ్డ ముస్లింలకు ఉద్యోగాలు, విద్యా సంస్థల ప్రవేశాల్లో ఇప్పటికే ఉన్న నాలుగు శాతం రిజర్వేషన్లను మొన్న మార్చిలో బిజెపి సర్కారు రద్దు చేసింది. రాజకీయంగా ప్రాబల్యం కలిగిన లింగాయత్, వొక్కలిగ కులాలకు చెరో రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఈ చర్యను కొందరు సుప్రీంలో సవాల్ చేయగా, ప్రభుత్వ నిర్ణయ అమలును తాత్కాలికంగా సుప్రీం నిలిపివేసింది. విచారణ జరుగుతోంది.
ఒక వైపు సుప్రీంలో విచారణ జరుగుతుండగా, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా కర్ణాటక ఎన్నికల ప్రచారంలో మత ప్రాతిపదికన ముస్లింలకు రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని మెజారిటీ ఓట్ల సమీకరణ లక్ష్యంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కోర్టు విచారణలో ఉన్న అంశంపై బహిరంగ వ్యాఖ్యలు చేయడం కోర్టు ధిక్కరణ అవుతుంది. ఈ చిన్న విషయం కేంద్ర హోం మంత్రి స్థాయి వ్యక్తికి తెలియక కాదు. ఉద్దేశపూర్వకంగానే షా ఆ విధంగా మాట్లాడారన్నది సుస్పష్టం. న్యాయస్థానాలను ప్రభావితం చేసేలా వ్యాఖ్యానించడం, బెదిరింపులకు దిగడం బిజెపి, సంఘ పరివారానికి అలవాటైన విద్యే. కేంద్రంలో మోడీ ప్రభుత్వం వచ్చాక ఈ ధోరణి మితిమీరిపోయింది. వివాదాస్పద బాబ్రీ మసీదు- అయోధ్య తీర్పు వెలువడక ముందే అమిత్‌షా ఇలానే మాట్లాడారు. శబరిమల కేసు విషయంలోనూ బెదిరింపులకు పాల్పడ్డారు. ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తమ అధికార పత్రిక 'ఆర్గనైజర్'లో న్యాయ వ్యవస్థ పాశ్చాత్య దేశాలకు అనుకూలంగా పని చేస్తోందని తెగనాడారు. స్థానిక మెజారిటీ హిందువులకు వ్యతిరేకంగా తీర్పులు చెబుతోందని, వ్యవస్థ మారాలని హుకుం జారీ చేశారు. న్యాయ వ్యవస్థను ఈ విధంగా బ్లాక్ మెయిల్ చేసేందుకు సాహసిస్తున్నారంటే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ అండ చూసుకునే.
కేంద్రంలో మోడీ సర్కారు వచ్చాక అన్ని వ్యవస్థల్లోకి హిందూత్వ శక్తుల చొరబాటు కొనసాగుతోంది. న్యాయ వ్యవస్థ అతిక్రమణకూ తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మోడీ కార్పొరేట్-మతోన్మాద విధానాల అమలుకు న్యాయ వ్యవస్థ చాలా సందర్భాల్లో అడ్డుగా నిలుస్తోంది. రాజ్యాంగం, చట్టాల పరిరక్షణ కర్తవ్య నిర్వహణలో భాగంగా కోర్టులు ఆ విధంగా స్పందిస్తున్నాయి. అది గిట్టని మోడీ ప్రభుత్వం న్యాయ వ్యవస్థలో రాజకీయ జోక్యానికి దారులు వెతుకుతోంది. జడ్జిల నియామకాలపై నిర్ణయం తీసుకునే కొలీజియంలో ప్రభుత్వ ప్రతినిధిని చేర్చాలంటోంది. న్యాయ వ్యవస్థ స్వతంత్రత దెబ్బతింటుందని సుప్రీంకోర్టు అందుకు నిరాకరిస్తోంది. ఈ మధ్య కాలంలో జడ్జిల నియామకాలపై కొలీజియం చేసిన సిఫారసులను కేంద్రం తొక్కిపట్టిన ఉదంతాలున్నాయి. తరచు న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు న్యాయస్థానాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. న్యాయ, శాసన, కార్యనిర్వాహక వ్యవస్థల అధికారాలకు రాజ్యాంగం కొన్ని పరిధులు గీసింది. ఏ వ్యవస్థా ఆ గీతలను దాటరాదు. ఈ రాజ్యాంగ నిర్దేశాన్ని వ్యవస్థలు తప్పక పాటించాలి. అతిక్రమిస్తే రాజ్యాంగ సంక్షోభం ఏర్పడుతుంది. ఈ సూక్ష్మం ఎల్లవేళలా వ్యవస్థల మననంలో ఉండాలని కేశవానంద భారతి కేసు సహా పలు సందర్భాల్లో సుప్రీం నొక్కివక్కాణించింది. తాజాగా సుప్రీం వ్యక్త పరిచిన ధర్మాగ్రహంతోనైనా బిజెపి, పరివారం బుద్ధి తెచ్చుకోవాలి.