
కేంద్ర ప్రభుత్వం దేశ విదేశీ కార్పొరేట్లకు వివిధ రకాల రాయితీలు, కానుకలు సమర్పిస్తూ వారిని మరింత సంపన్నవంతం చేయడం దారుణం. మంగళవారం నాడు రాజ్యసభలో సిపిఎం ఎంపి జాన్ బ్రిట్టాస్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరాద్ లిఖితపూర్వక సమాధానం ఇస్తూ భారత రిజర్వు బ్యాంకు గణాంకాల ప్రకారం గడచిన ఐదేళ్లలో షెడ్యూల్డు వాణిజ్య బ్యాంకులు రూ.10,09,510 కోట్ల రుణాలను మాఫీ చేశాయని తెలిపారు. అంటే సగటున ఏడాదికి రెండు లక్షల కోట్ల రూపాయల రుణాలు సంపన్నులకు రద్దయాయన్నమాట. ఇందులో దాదాపు సగం సార్వత్రిక ఎన్నికల సమయంలో అంటే 2018-19, 2019-20 సంవత్సరాల్లోనే 4,70,435 కోట్లు రద్దు చేశారు. ఆ సమయంలోనే ఎన్నికల బాండ్లు భారీగా అమ్ముడు పోవడం, అందులో 90 శాతానికి పైగా కమలం పార్టీ ఖాతాలో పడిన విషయాలను కలిపి చూస్తే ఎవరికైనా అసలు కిటుకు బోధపడుతుంది. అయితే మాఫీ అంశం సాంకేతిక పరమైనదేనని బ్యాంకులు తమ బ్యాలెన్స్ షీట్లను పరిశుభ్రం (క్లీన్) చేసే ప్రక్రియ లో భాగమేనని మంత్రి సమర్ధించుకోవడం విడ్డూరం. కేవలం మాఫీ ప్రకటించడమే తప్ప రుణ వసూలు ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుందని నమ్మబలికారు. ఐదేళ్లలో ఇటువంటి మాఫీ చేసిన రుణాల్లో రూ.1,32,036 కోట్లు వసూలు చేసినట్లు గొప్పగా చెప్పుకొచ్చారు. అంటే మాఫీ చేసిన మొత్తంలో దాదాపు పదో వంతు మాత్రమే బ్యాంకులకు వసూలయిందన్నమాట. అది కూడా ఎన్నేళ్ల క్రితం నాటి బకాయో ఎవరికీ తెలియదు. ఇటువంటి మాఫీ మాత్రమేగాక కార్పొరేట్లు తీసుకున్న రూ.4.5 లక్షల కోట్ల బ్యాంకు రుణాల్లో కేవలం రూ. 1.61 లక్షల కోట్లు మాత్రమే వన్‌టైమ్ సెటిల్‌మెంట్ పేరుతో వసూలు చేశారు. అంటే బ్యాంకులు రూ.2.85 లక్షల కోట్లు కోల్పోయాయి. కాబట్టి రాజుల సొమ్ము రాళ్లపాలన్న ఒకప్పటి సామెత బ్యాంకుల సొమ్ము కార్పొరేట్ల పాలు అన్నది ఇప్పటి నానుడిగా మారుతోంది. బ్యాంకుల్లోని సొమ్ము అంటే అది ఎవరిదో కాదు సుమా, సాక్షాత్తూ ఈ దేశ ప్రజలదే!
మోడీ ప్రభుత్వం వచ్చాక పరోక్ష పన్నులను, సెస్సులను పెంచి జనంపై భారాలు పెంచి, ప్రత్యక్ష పన్నుల్లో కార్పొరేట్లకు వివిధ రూపాల్లో రాయితీలు కల్పిస్తోంది. బడ్జెట్లో దాదాపు 8% కార్పొరేట్ పన్ను రాయితీల ద్వారా వారికి లక్షల కోట్ల రూపాయల లబ్ధి చేకూర్చింది. అంటే ఆ మేరకు ఖజానాకు కన్నం పడిందన్న మాట. మరోవైపు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించి వాటిని కార్పొరేట్లకు కట్టబెడుతున్నారు. ప్రతి ఏటా డిజిన్వెస్ట్‌మెంట్ పేరుతో ప్రజల సొత్తు అప్పనంగా కుబేరులకు అప్పగిస్తున్నారు. గత ఏడాది భారీ ప్రచారంతో తీసుకొచ్చిన మానిటైజేషన్ పైప్ లైన్ పథకం కూడా ఆ కార్పొరేట్లకే లబ్ధి చేకూరుస్తుంది. ఇలా అన్ని విధాలుగా సంపన్నులకు ప్రజల సంపదను దోచిపెడుతున్న సర్కారు సామాన్య రైతులు, సాధారణ ప్రజలపట్ల మాత్రం కర్కశంగా వ్యవహరించడం దాని నైజాన్ని విశదపరుస్తోంది. కరువు కాటకాల వలన, వరదలు, తుపాను వలన నష్టపోయి లేదా పంటకు న్యాయమైన ధర దక్కక తీవ్రంగా నష్టపోయిన కారణంగా బ్యాంకులో తీసుకున్న రుణం తిరిగి తీర్చలేని రైతుల నుండి మాత్రం ఎటువంటి మినహాయింపు లేకుండా గోళ్లూడగొట్టి వసూలు చేయాలని బ్యాంకులను సర్కారు ఆదేశిస్తుంది. మధ్యతరగతి ప్రజానీకం తమ గృహ రుణాలు లేదా వినిమయ రుణాలను తీసుకొని కోవిడ్ సమయంలో తిరిగి కిస్తీలు కట్టలేని పరిస్థితిలో వాటిని మాఫీ చేయాలని గగ్గోలు పెట్టినా బ్యాంకుల ఆర్థిక క్రమశిక్షణ దెబ్బతింటుందనీ, అలా చేయడం సాధ్యం కాదనీ మోడీ సర్కారు సుప్రీం కోర్టులో సుద్దులు చెప్పింది. మరి ఈ ఐదేళ్లలోనే పది లక్షల కోట్ల రూపాయలకు పైగా కార్పొరేట్లకు మాఫీ చేస్తే ఆర్థిక క్రమశిక్షణ పటిష్టమవుతుందా? సమాధానం మోడీ సర్కారే చెప్పాలి. కార్పొరేట్ల కోసం, క్రోనీల కోసం ఏర్పడిందే మా ప్రభుత్వమనీ, వారి దోపిడీకి వ్యతిరేకంగా ప్రజలు ప్రతిఘటించకుండా ఉండేందుకు మతం పేరిట, కులం పేరిట, ప్రాంతం పేరిట విద్వేషాలు సష్టించి జనాన్ని చీల్చడమే మా విధానమని చెబుతారా! కాకుల్ని కొట్టి గద్దలకు వేసిన చందంగా ప్రజల సొత్తును కార్పొరేట్లకు కట్టబెడుతున్న కేంద్ర ప్రభుత్వ దుష్ట విధానాలను ప్రజలు అర్థం చేసుకోవాలి. వాటిని తిప్పి కొట్టాలి. విశాల ఐక్య ప్రజా ఉద్యమాలే అందుకు మార్గం.