నెల్లూరు జిల్లాలో వెలుగు చూసిన మైనింగ్ కుంభకోణం కలకలం రేపుతోంది. వేల కోట్ల రూపాయల విలువ చేసే తెల్లరాయిని నిబంధనలకు విరుద్ధంగా విదేశాలకు తరలిస్తున్న వ్యవహారం ఇక్కడ ఏళ్ల తరబడి సాగుతున్నా, అధికార యంత్రాంగంలో నామమాత్రపు చలనం కూడా లేకపోవడం దిగ్భ్రాంతికరం. అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి నేతల కుమ్మక్కుతో ఏళ్ళ తరబడి గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ వ్యవహారం ఇప్పుడు బట్టబయలు కావడంతో పరస్పరం ఆరోపణలకు దిగుతున్నారు. అక్రమ మైనింగ్‌కు కారణం మీరంటే, మీరంటూ విమర్శలు గుప్పించుకోవడం విస్మయం కలిగిస్తోంది. నెల్లూరు జిల్లాలోనే కాదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. ప్రస్తుత ప్రభుత్వ హయంలోనే కాదు, గత ప్రభుత్వ కాలంలోనూ వనరుల దోపిడి ఇదే మాదిరి కొనసాగింది. అధికారంలో ఎవరున్నా మైనింగ్ మాఫియా రాష్ట్రంలో చక్రం తిప్పుతోంది. ప్రధాన పార్టీల్లోని పెద్ద నాయకుల నుండి చోటామోటా నాయకుల వరకు ఈ వ్యవహారంలో భాగస్వాములవుతున్నారు. ఓబుళాపురం గనుల వ్యవహారం నుండి, గత, ప్రస్తుత ప్రభుత్వ హయంలో కొనసాగుతున్న ఇసుక అక్రమాల వరకూ వీటికి ఉదాహరణలే! నిధుల కొరత రాష్ట్రాన్ని వెంటాడుతున్నా, అక్రమ మైనింగ్ వ్యవహారానికి అడ్డుకట్ట వేస్తే రాష్ట్ర ఖజానా పరిస్థితి మెరుగయ్యే అవకాశం ఉన్నా ప్రభుత్వాలు పట్టించుకోకపోవడానికి అక్రమార్కుల్లో అధికశాతం మంది అస్మదీయులు కావడం, ఎన్నికల అవసరాలు ముడిపడి ఉండటమే కారణం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్నో విలువైన ఖనిజాలకు నిలయం. సమైక్య రాష్ట్ర విభజన తరువాత కూడా ఈ ప్రత్యేకతను ఆంధ్రప్రదేశ్ నిలుపుకుంది. వినియోగ విలువ గల ఖనిజం ఏదో ఒకటి రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ లభిస్తోంది. 2020వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన జాతీయ ఖనిజ వనరుల నివేదిక (నేషనల్ మినరల్ ఇన్వెంటరీ) ప్రకారం రాష్ట్రంలో 48 రకాల ఖనిజాలు లభిస్తున్నాయి. అత్యంత విలువైన బంగారం, వజ్రాలు, బాక్సైట్, బీచ్‌శాండ్, పెట్రోలియం, సహజ వాయువు నుండి అత్యంత అరుదైన యురేనియం వరకు వివిధ రకాల ఖనిజాలు వీటిలో ఉన్నాయి. బాక్సైట్, బెరైటీస్, బీచ్‌శాండ్ నుండి లభించే హెవీ మినరల్స్. లైమ్ స్టోన్ వంటి ఖనిజాలు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యధికంగా లభిస్తున్నాయి. వీటిని సక్రమంగా వినియోగిస్తే రాష్ట్రాభివృద్ధికి ఎంతగానో దోహదపడతాయి. కానీ, జరుగుతున్నది వేరు! కేంద్ర ప్రభుత్వ గనుల శాఖకు చెందిన 'ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్' విడుదల చేసిన 'ఇండియన్ మినరల్స్ ఇయర్ బుక్-2020'లో జిల్లాల వారీగా రాష్ట్రంలో లభించే ఖనిజాలు, వాటి వెలికితీతకు ఉన్న అవకాశాలను సవివరంగా తెలిపారు. ఈ దిశలో అధికారికంగా ప్రయత్నాలు దాదాపు శూన్యమే! ఆ గణాంకాల ప్రకారం 2017-18లో రాష్ట్రంలో మొత్తంమీద 135 గనులు (ఆటమిక్ మినరల్స్‌ను మినహాయించి) ఉండగా, 2018-19లో 133కు, 2019-20లో 123కు తగ్గాయి. వీటిలో కూడా అధికభాగం నిబంధనలు పాటించడం లేదని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నోటీసులు ఇచ్చింది. ఉత్పత్తి విలువ కూడా సుమారుగా 17 వేల కోట్ల రూపాయల నుండి 14 వేల కోట్లకు పడిపోయింది. సిమెంటు పరిశ్రమలు మినహా మిగిలిన రంగాల్లో ఖనిజాధారిత పరిశ్రమలు కూడా పెద్దగా ఏర్పాటు కాలేదని నివేదిక పేర్కొంది. 2019-20 తరువాత రాష్ట్రంలో కొత్త గనులు ఏర్పడలేదు కాని, అక్రమ తవ్వకాలు విచ్చలవిడిగా పెరిగాయి.
అమెరికా, చైనా వంటి దేశాల్లో విస్తారంగా సహజ వనరులు ఉన్నప్పటికీ, వాటిని వెలికితీయడానికి బదులుగా విదేశాల నుండి దిగుమతి చేసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. భావి తరాలకు సహజ వనరులను అందచేయడం, భవిష్యత్తులో తమపై ఇతర దేశాలు ఆధారపడేలా చేసుకోవాలనే వ్యూహం దీని వెనుక ఉంది. మన దేశంలో దీనికి భిన్నం. ఖనిజాల తవ్వకాల వల్ల దేశ, విదేశీ కార్పొరేట్లు లబ్ధి పొందుతున్నారు. కార్పొరేట్ బేహారులు, రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు కూటమిగా ఏర్పడి ప్రజల సొత్తును కొల్లగొడుతున్నారు. మన రాష్ట్రంలో ఈ దోపిడి మరింత పక్కాగా అమలు జరుగుతోంది. దీనిని అడ్డుకోవాలి. సహజ వనరులన్నీ ప్రజల సంపదే! వాటి ఫలాలు కూడా ప్రజలకే అందాలి. మైనింగ్ మాఫియాను అణచివేయాలి. నిబంధనలను ఉల్లంఘించి, చట్టవిరుద్ధంగా జరుగుతున్న గనుల తవ్వకాన్ని, ఖనిజాల రవాణాను తక్షణమే నిలిపివేయాలి. అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలి.