కార్గిల్ లోని 'లడఖ్ అటానమస్ హిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్' (ఎల్‌ఎహెచ్‌డిసి-కె)కు జరిగిన ఎన్నికల ఫలితాలు నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర బిజెపి ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటివి. 2019 ఆగస్టు 5న ఒక్క కలంపోటుతో 370వ అధికరణాన్ని, ఆర్టికల్ 36ఎ ను రద్దు చేసి, జమ్మూకాశ్మీర్ రాష్ట్రాన్ని ముక్కలు చేసిన తరువాత జరిగిన మొట్టమొదటి ఎన్నికలు కావడంతో ఈ తీర్పునకు ఎనలేని ప్రాధాన్యత ఉంది. 26 స్థానాల హిల్ డెవలప్ మెంట్ కౌన్సిల్‌కు జరిగిన ఎన్నికల్లో కేవలం 2 స్థానాలు మాత్రమే బిజెపికి దక్కాయి. నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్ కూటమి (ఇండియా ఫోరమ్) ఏకంగా 22 సీట్లను కైవసం చేసుకుంది. దీనిని బట్టే బిజెపి పై ప్రజానీకంలో ఏ స్థాయిలో వ్యతిరేకత నెలకొందో అర్ధం చేసుకోవచ్చు. నేషనల్ కాన్ఫరెన్స్ 12 స్థానాల్లో గెలుపొందగా, కాంగ్రెస్ 10 సీట్లలో విజయం సాధించింది. ఈ రెండు పార్టీలు పరస్పరం తలపడ్డ ఒక స్థానంలో నామమాత్రపు ఆధిక్యతతో బిజెపి గెలుపొందింది. అంటే, సొంత బలంతో ఆ పార్టీ గెలుపొందింది ఒక్క స్థానంలోనే! మరో రెండు స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. గతంలో ఈ హిల్ కౌన్సిల్ ఎన్నికలు పూర్తిగా స్థానికాంశాలకే పరిమితమయ్యేవి. స్థానిక ప్రజానీకం కూడా పెద్దగా ఆసక్తి చూపించేవారు కాదు. కానీ, ఈ సారి భిన్నం. మోడీ ప్రభుత్వపు ఏకపక్ష విధానాలతో విసిగిన ప్రజానీకం సత్తా చూపించడానికి నిర్ణయించుకున్నారు. బతకడం కోసం పొట్ట చేత పట్టుకుని వివిధ ప్రాంతాలకు వెళ్లినవారు, ఇతర రాష్ట్రాల్లో చదువుకుంటున్న యువజనులు ఈ ఎన్నికల్లో బిజెపిని ఓడించడమే లక్ష్యంగా ఓటువేయడానికి తమ సొంత గ్రామాలకు భారీగా తరలివచ్చారు. ఫలితంగా ఓటింగ్ శాతం 77.61కి చేరింది. బిజెపి పట్ల ప్రజల్లో ఉన్న ఆగ్రహానికి ఈ ఓటింగ్ శాతం నిదర్శనం.
ఈ ఫలితాలతో 2019 ఆగస్టు 5నాటి జమ్మూకాశ్మీర్ విభజనకు ప్రజామోదం లేదని స్పష్టమైపోయింది. దానితో పాటు ఈ నాలుగేళ్లలో లడఖ్‌తో సహా జమ్మూకాశ్మీర్‌ను తాము నిజమైన భూతల స్వర్గంగా మారుస్తున్నట్లు బిజెపి ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ప్రచారం చేసుకుంది. అక్కడి ప్రజలకు నిజమైన అభివృద్ధిని రుచిచూపిస్తున్నట్లు ఆ పార్టీ నేతలు చెప్పుకున్నారు. ప్రజల మద్దతు తమకే ఉందంటూ ప్రచారం చేసుకున్నారు. తిమ్మిని బమ్మిని చేసే ఈ ప్రచార ఆర్భాటపు డొల్లతనాన్ని తాజా ఎన్నికల ఫలితాలు బట్టబయలు చేశాయి. బిజెపిని ఘోరంగా ఓడించడం ద్వారా క్షేత్రస్థాయిలో జరుగుతున్నదేమిటో కార్గిల్-లడఖ్ ప్రజానీకం దేశ ప్రజానీకానికి స్పష్టం చేశారు. బిజెపి ప్రచారం చేసుకున్న దానికి భిన్నంగా స్థానికులకు కనీస హక్కులు కూడా మృగ్యమైనాయి. ఒకవైపు ఉపాధి లేక యువత పెద్దసంఖ్యలో వలసబాట పడుతుంటే, మరోవైపు ఆ ప్రాంతంలో కొత్తగా అడుగుపెట్టిన కార్పొరేట్ సంస్థలు భూమిని కబళించనారంభించాయి. టూరిజం, ఖనిజాల వెలికితీత పేరుతో ఈ ప్రక్రియ సాగుతోంది. దీంతో భూ యాజమాన్య హక్కు కోసం స్థానికులు ఆందోళనలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. గిరిజనులు అత్యధికంగా నివసించే ఈ ప్రాంతంలో ఆరవ షెడ్యూల్‌ను స్థానికంగా అమలు చేయాలన్న డిమాండ్‌నూ కేంద్ర బిజెపి ప్రభుత్వం పట్టించుకోకపోగా, నిరసనల పట్ల కఠినంగా వ్యవహరించింది. బ్యూరోక్రాట్ల కేంద్రంగా పాలన సాగుతుండడం, ప్రజల అభిప్రాయాలను ఏమాత్రం పట్టించుకోకపోవడమూ సహజంగానే స్థానికుల్లో నెలకొన్న వ్యతిరేకత ఎన్నికల ఫలితాల్లో ప్రతిఫలించింది.
ఈ ఫలితాలు ప్రతిపక్ష శిబిరంలో ఉత్సాహాన్ని నింపగా, బిజెపిని ఆత్మరక్షణలో పడేశాయి. కొద్దిరోజుల క్రితం వరకు గెలుపు తమదేనంటూ ఆర్భాటంగా తిరిగిన బిజెపి నాయకులు ప్రస్తుతం ముఖం చాటేశారు. మరోవైపు లడఖ్ గెలుపు ఇచ్చిన స్ఫూర్తితో జమ్మూ, కాశ్మీర్‌లోనూ తక్షణం ఎన్నికలు జరపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో అక్కడ తక్షణ ఎన్నికల నిర్వహణకు మోడీ సర్కారు సిద్ధపడటం అనుమానమే! ఇప్పటికే ఐదు రాష్ట్రాల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. దేశ వ్యాప్తంగా సాధారణ ఎన్నికలకూ రంగం సిద్ధమౌతోంది. ఈ నేపథ్యంలో ఐక్యంగా పోటీ చేసిన దాదాపు అన్ని స్థానాల్లోనూ ప్రతిపక్ష అభ్యర్థులకు పట్టం కట్టడం ద్వారా లడఖ్ ప్రజానీకం ఇచ్చిన సందేశ సారాంశం సుస్పష్టం!