Aug 23,2022 06:20

బిజెపి రాజకీయ క్రీడకు, అధికార దాహానికి, హిందూత్వ సిద్ధాంత అమలుకు జమ్మూ కాశ్మీర్‌ ఎప్పుడూ కథా వస్తువే! రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 370, 35ఎ రద్దు, రాష్ట్ర విభజన, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన వివాదాలు సృష్టించి నిత్య ఉద్రిక్తతలకు కారణమైన కేంద్ర బిజెపి, అవి చాలవన్నట్లు అసెంబ్లీ ఎన్నికల నిమిత్తం సిద్ధం చేసే ఓటర్ల జాబితానూ వివాదాస్పదం చేసింది. అందుకు కేంద్ర ఎన్నికల సంఘాన్ని వాడుకుంటోంది. జమ్మూ కాశ్మీర్‌లో సాధారణంగా నివాసముంటున్న 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఎలాంటి ధ్రువీకరణ పత్రాల అవసరం లేకుండానే ఓటరుగా నమోదు కావొచ్చని ఎన్నికల ప్రధానాధికారి ఈ నెల 17న ప్రకటించారు. ఆ ప్రకారం కొత్తగా 25 లక్షల మంది ఓటర్లు రావొచ్చని అంచనా వేశారు. జమ్మూ కాశ్మీర్‌లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చి పని చేసే భద్రతా బలగాలు ఇక్కడ ఓటర్లుగా నమోదు కావొచ్చన్నారు. స్థానికేతరులను తరలించి వారి ఓట్ల ద్వారా రాజకీయ లబ్ధి పొందాలన్న బిజెపి కుట్ర ఈ నిబంధన వెనుక దాగుంది. సదరు నిబంధనను బిజెపి మినహా అన్ని రాజకీయ పార్టీలూ ముక్తకంఠంతో ఖండించాయి. వివాదాస్పద నిబంధనపై కోర్టుకెళ్లేందుకు యోచిస్తున్నట్లు వెల్లడించాయి.
జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక హోదా, స్వయంప్రతిపత్తి కొనసాగిన 2019 ఆగస్టు వరకు ఆ రాష్ట్రానికి ప్రత్యేక రాజ్యాంగ హక్కులు,1957 ప్రజా ప్రాతినిధ్య చట్టం నిబంధనలు అమల్లో ఉన్నాయి. అక్కడ ఓటరుగా నమోదు కావాలంటే శాశ్వత నివాస ధ్రువీకరణ పత్రం, ప్రస్తుత నివాస ధ్రువీకరణ పత్రాలను తప్పనిసరిగా చూపించాలి. కొత్త నిబంధన ప్రకారం అవేమీ లేకుండానే ఓటర్లుగా చేరవచ్చు. 35ఎ రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో దేశంలో ఎక్కడి వారైనా భూములు కొనచ్చన్నారు. ఇప్పుడేమో ఏకంగా ఎక్కడి వారైనా ఓటర్లుగా చేరొచ్చంటున్నారు. అప్పుడేం జరుగుతుంది? స్థానికేతరులు ఎంచక్కా అడ్డూ అదుపు లేకుండా చొరబడతారు. స్థానిక ప్రజలను సంఖ్య రీత్యా మైనార్టీ కింద మార్చేస్తారు. చివరికి ఆ ప్రాంత ఓటర్ల సంఖ్యలోనూ భారీ మార్పులు తీసుకొస్తారు. జమ్మూ కాశ్మీర్‌లో స్థానికేతరుల జనాభా పెరుగుదల స్థానిక ప్రజలను మరింతగా నిరాదరణకు గురి చేస్తుంది. వారి ఆకాంక్షలను చిదిమేస్తుంది. బిజెపి అసలు లక్ష్యం అదే. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ఆ దిశగానే జరిగింది. 2011 జనాభా లెక్కల ప్రకారం కాశ్మీర్‌ జనాభా 68.8 లక్షలు కాగా జమ్మూ జనాభా 53.5 లక్షలు. డీ-లిమిటేషన్‌లో మాత్రం జమ్మూలో ఆరు సీట్లు, కాశ్మీర్‌ లోయలో ఒక సీటు పెంచారు. న్యాయబద్ధమైన పునర్విభజన జరిగితే కాశ్మీర్‌కు 51, జమ్మూకు 39 సీట్లు కేటాయించాలి. కానీ కాశ్మీర్‌కు 47, జమ్మూకు 43 కేటాయించారు. ఇక్కడే వ్యవస్థల మేనేజ్‌మెంట్‌ ఏ స్థాయిలో జరిగిందో తెలుస్తుంది.
ఏనాడూ జమ్మూకాశ్మీర్‌ను బిజెపి ప్రశాంతంగా ఉండనీయలేదు. కేంద్రంలో మోడీ సర్కారు వచ్చాక ఎంతకైనా బరి తెగిస్తోంది. ప్రభుత్వాల రద్దు, గవర్నర్‌ పాలన తెలిసిందే. 2018 జూన్‌ నుంచి ఆ రాష్ట్రంలో అసెంబ్లీ లేదు. 2019లో లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించలేదు. ఒకానొక చారిత్రక నేపథ్యంతో దేశంలో విలీనమైన సందర్భంలో ప్రత్యేక హోదా సంతరించుకున్న రాష్ట్రాన్ని, బిజెపి 2019లో రెండవ తడవ అధికారంలోకి రాగానే స్వయం ప్రతిపత్తి కల్పించే 370, 35ఎ ఆర్టికల్స్‌ను రద్దు చేసింది. కేంద్ర పాలిత ప్రాంతాలు జమ్మూకాశ్మీర్‌, లఢక్‌గా రెండు ముక్కలు చేసింది. విలీన ఒప్పందంలో భాగంగా ఆ రాష్ట్రానికి లభించిన ప్రత్యేక హోదాను రద్దు చేయాలన్న ఆర్‌ఎస్‌ఎస్‌ దీర్ఘకాలిక డిమాండ్‌ను మోడీ సర్కార్‌ నెరవేర్చింది. రాష్ట్రాల సరిహద్దుల్లో మార్పులకు ఆ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం ఉండాలన్న రాజ్యాంగ నిర్దేశం నుంచి తప్పించుకునేందుకు ఎన్నికైన ప్రభుత్వాన్ని రద్దు చేసి గవర్నర్‌ రూల్‌ పెట్టి గవర్నర్‌ ఆమోదమే రాష్ట్ర ఆమోదంగా పరిగణించింది. కేంద్రం నేరుగా బ్యూరోక్రటిక్‌ నిర్మాణంలో అపరిమితమైన నియంత్రణను అమలు చేస్తోంది. బిజెపి చర్యలు ప్రజాస్వామ్యానికి ప్రమాదం. సున్నితమైన సరిహద్దు రాష్ట్రంలో నిరంకుశత్వం అల్లకల్లోలాలకు, ఉద్రిక్తతలకు కారణమవుతుంది. మోడీ ప్రభుత్వం ఇటువంటి కుట్రలు మానుకోవాలి.