
వద్దు వద్దంటున్నా స్మార్ట్ ప్రీ పెయిడ్ మీటర్ల ఏర్పాటు పేరిట పెద్దమొత్తంలో ప్రజల సొత్తును లూటీ చేసి కార్పొరేట్లకు పందేరం చేయడానికి రాష్ట్రంలో జరుగుతున్న ప్రయత్నాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రాష్ట్రంలో 1.92 కోట్ల మంది విద్యుత్ వినియోగదారులకు ఈ స్మార్ట్ మీటర్లు అందచేయడానికి 4 వేల కోట్ల రూపాయల నుండి 4,500 కోట్ల రూపాయల దాకా ఖర్చు కానుంది. ఈ మేరకు రూపొందించిన అంచనాలను పంపిణీ సంస్థలు (డిస్కామ్‌లు) విద్యుత్ నియంత్రణ మండలి (ఇఆర్‌సి)కి అందచేశాయి. ఈ మొత్తంలో కేంద్ర ప్రభుత్వం 15 శాతం మాత్రమే గ్రాంటు రూపంలో ఇవ్వనుంది. నిర్దేశించిన సమయంలోగా నూరు శాతం లక్ష్యాన్ని సాధిస్తే మరో 7.5 శాతం మొత్తాన్ని ఇవ్వవచ్చు. ఈ అరకొర గ్రాంటన్నా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుందన్న గ్యారంటీ ఏమీలేదు. వినియోగదారుడు కనీసం ఒక్కసారన్నా రీ ఛార్జీ చేస్తేనే గ్రాంటు ఇస్తామని కేంద్రం పేర్కొంది. అంటే ఈ భారం ఎవరిమీద పడనుంది? ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రజల పైనే కదా! ఒక్కో స్మార్ట్‌మీటర్ కోసం 35 వేల రూపాయలు ఖర్చు అవుతుందని చెబుతున్నారు. అంతపెద్ద మొత్తంలో ఇప్పటికిప్పుడు ఖర్చు చేయించాల్సిన అవసరం ఉందా? పోనీ, వీటి ఏర్పాటుతో సాధారణ ప్రజలకు భారీ ప్రయోజనాలు ఏమన్నా లభిస్తాయా అంటే ఎంతమాత్రమూ లేదు.
విద్యుత్ రంగ ప్రైవేటీకరణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ (ఆర్‌డిఎస్‌ఎస్)లో డిస్కామ్‌ల పరిధిలో ఫ్రాంచైజీల ఏర్పాటుకు కార్పొరేట్ సంస్థలకు అనుమతిచ్చింది. ప్రభుత్వ పంపిణీ సంస్థలకు సమాంతరంగా ఇవి ఏర్పాటు కానున్నాయి. వీటికి ఆదాయం గ్యారంటీ చేయడానికే స్మార్ట్ మీటర్ల అంశాన్ని కేంద్ర ప్రభుత్వం తెరమీదకు తీసుకువచ్చింది. మరోవైపు విద్యుత్ మౌలిక వసతుల రంగంలో అదానీ, ఎల్ అండ్ టి, జిఎంఆర్‌తో పాటు మరో మూడు నాలుగు కంపెనీలే దేశంలో కీలకంగా ఉన్నాయి. అంబానీ కూడా ఈ రంగంలో అడుగుపెడుతున్నారు. అనేక రాష్ట్రాల్లో స్మార్ట్ మీటర్ల ఏర్పాటును దక్కించుకునేందుకు ఈ సంస్థలే పోటీపడుతున్నాయి. ఒక్క ఉత్తరప్రదేశ్‌లోనే 23 వేల కోట్ల రూపాయల స్మార్ట్ మీటర్ల ప్రాజెక్టుకు ఈ సంస్థలు కొద్దిరోజుల క్రితమే టెండర్లు దాఖలు చేశాయి. మన రాష్ట్రంలోనూ పరిస్థితి భిన్నంగా ఉండే అవకాశం లేదు. అనుబంధ పనులను పాలకులు అస్మదీయులకు అప్పనంగా అప్పచెప్పుకునే ప్రయత్నమిది. వీటి ఏర్పాటుతో ఎవరికి లబ్ధి జరగనుందో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు. సామాన్యులను కొట్టి సంపన్నులకు పంచడానికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమౌతున్నాయి.
పెద్ద ఎత్తున స్మార్ట్‌మీటర్ల తయారీ చేయాల్సిరావడంతో ఉపాధి రంగం పరుగులు పెడుతుందంటూ కొందరు చేస్తున్న వాదన కూడా అర్ధరహితమే! సాఫ్ట్‌వేర్ ఆధారిత ఉపాధి రంగం పరిమితంగానే అవకాశాలు కల్పించే అంశం తెలిసిందే. అదే సమయంలో ప్రస్తుత మీటర్ల తయారీ రంగంలో ఉన్న లక్షలాది మంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ప్రశ్నార్థకంగా మారుతాయి. మీటర్ రీడర్లకు ఇప్పటికే ఇస్తున్న పీస్ రేటును డిస్కామ్‌లు రూ.3.80 నుండి రూ.3.62కు తగ్గించాయి. పని దినాలనూ కుదించారు. అనేక ప్రాంతాల్లో కాంట్రాక్టర్లు ఆ మొత్తాన్ని కూడా వారికి చెల్లించడం లేదు. కరోనా సమయంలోనూ ఇంటింటికి వెళ్లి బిల్లులు ఇచ్చిన వేలాదిమంది మీటర్ రీడర్ల పరిస్థితి ఇప్పటికే అగమ్యగోచరంగా మారింది. స్మార్ట్ మీటర్ల ఏర్పాటుతో వీరి కుటుంబాలు నడిరోడ్డున పడనున్నాయి. వినియోగ దారులకు సంబంధించిన పూర్తి వివరాలను నమోదు చేయాల్సి ఉండటంతో డేటా భద్రతకు సంబంధించిన అనేక సమస్యలు తలెత్తుతున్నాయన్నది వీటిని ఇప్పటికే వినియోగిస్తున్న దేశాల అనుభవం. నిజానికి రోజురోజుకి పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యులను బెంబేలెత్తిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లోనూ వారి కష్టార్జితాన్ని కార్పొరేట్లకు దోచిపెట్టడానికి సిద్ధపడితే ప్రజాగ్రహానికి గురికాక తప్పదు. తొలివిడత విద్యుత్ సంస్కరణలపై జరిగిన పోరులో రాష్ట్ర ప్రజలు ఇచ్చిన సందేశం అదే!