
శాసనమండలి ఎన్నికల్లో ఎలాగౖైెనా గెలిచి ప్రజలు, ఉద్యోగులు తమ వెంటే వున్నారనిపించుకునేందుకు అధికార పార్టీ నాయకులు, అనుయాయులు అడ్డదార్లు తొక్కడం, అక్రమాలకు పాల్పడడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. గ్రామ/ వార్డు సచివాలయ వాలంటీర్లను ఎన్నికల ప్రక్రియలో వినియోగించరాదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి స్పష్టమైన ఉత్తర్వులిచ్చినా, ఓటు దరఖాస్తులను వారి ద్వారానే సేకరించడం ద్వారా అధికార పార్టీ చట్ట ఉల్లంఘన ఓటు నమోదు ప్రక్రియతోనే మొదలయింది. గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో ఐదవ తరగతి చదివిన వారిని, మాంసం దుకాణంలో పని చేసే వ్యక్తులను ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో ఓటర్లుగా నమోదు చేయించడం వంటి ఎన్నో అంశాలు మీడియాలో పుంఖానుపుంఖాలుగా వెలువడ్డాయి. అనర్హుల ఓట్లు నమోదు చేయాలంటూ డిఇఓలపై అధికార పార్టీ పెద్దలు ఒత్తిడి తేవడం, అందుకు అంగీకరించని వారిపై బదిలీ అస్త్రం ప్రయోగించడం అందరికీ తెలిసిందే. పెద్దల అండ ఉందికదా అని కొందరు డిఇఓల సంతకాలు ఫోర్జరీ చేసి మరీ ఓట్లు పొందిన వైనం ఆశ్చర్యం గొలుపుతోంది. (శ్రీసత్యసాయి జిల్లాలో అందుకు పాల్పడిన ముగ్గురు ప్రైవేటు స్కూల్ టీచర్లపై ఇటీవల కేసు కూడా నమోదయింది.) ఏ విద్యాసంస్థలోనూ పని చెయ్యనివారికి సైతం నకిలీ ఐడెంటిటీ కార్డులను తయారుచేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. లంచ్ బాక్సుల మొదలు వెండి భరిణెలు, ఖరీదైన సెల్‌ఫోన్‌ల వంటి ప్రలోభాల సంగతి చెప్పనక్కరలేదు.
స్థానిక సంస్థల నియోజకవర్గాల నుండి శాసన మండలి సభ్యుల ఎన్నిక సందర్భంగానూ ప్రలోభాలు, ఒత్తిళ్లు, బెదిరింపులకూ పాల్పడుతున్నట్లు ఆరోపణలు కోకొల్లలుగా వస్తున్నాయి. స్థానిక సంస్థలకు నిధులు కేటాయించకపోవడం, కేటాయించినా వాటిని మళ్లించడం తదితర కారణాల్తో ఆ ప్రజా ప్రతినిధులు తీవ్ర అసంతృప్తితో ఉన్న విషయం అందరికీ తెలిసిందే! ఈ నేపథ్యంలోనే కొందరు స్థానిక సంస్థల ప్రతినిధులు నామినేషన్లు దాఖలు చేయగా కేసులు బనాయిస్తామని పోలీసులను ఉసిగొల్పి బలవంతంగా వారిని ఉపసంహరింపజేస్తున్నారు. అధికార పార్టీ వారు సైతం ప్రతిపక్షాలకు ఓటు వేస్తారన్న అనుమానం ఏలినవారికి కలిగిందనీ, అందుకే ఏకగ్రీవాల కోసం సకల యత్నాలూ చేశారన్నది జనవాక్యం. అభ్యర్థులను బలవంతంగా ఉపసంహరింపజేయడం ప్రజాస్వామ్యానికి తీవ్ర హాని కలిగిస్తుంది. మరోవైపున అధికార ప్రధాన ప్రతిపక్ష పార్టీలు, కొన్నిచోట్ల శక్తివంతులైన ఇండిపెండెంట్లు క్యాంపు రాజకీయాలకు తెరలేపడం జుగుప్సాకరం.
రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో వుండగానే మార్చి 1నుండి 3వతేదీ దాకా జరిగే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో వైసిపి పార్టీ మండల ఇన్‌ఛార్జిలు, వలంటీర్లు, సచివాలయ కన్వీనర్లు, గహ సారథులు పాల్గొనాలని ఆదేశించడం దారుణం. పింఛను పంపిణీ చేసేటప్పుడు పార్టీ నాయకులు ప్రతి లబ్ధిదారుతో ఫోటో తీసుకుని మండల వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేయాలని పేర్కొనడం ఎన్నికల కోడ్ ఉల్లంఘనే! ఓటర్ల జాబితా తయారీ నుండి నామినేషన్‌ల బలవంతపు ఉపసంహరణల వరకు అధికారపార్టీ అక్రమాలను, చట్ట ఉల్లంఘనలను రాతమూలకంగా, మౌఖికంగా పలు ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు ఎన్నికల కమిషన్‌కు నివేదించినా వాటి తీవ్రతకు తగిన విధంగా స్పందించకపోవడం తగదు. ఆ ఫిర్యాదులపై వెనువెంటనే తగు చర్యలు తీసుకోకపోవడంతో క్షేత్రస్థాయిలో అధికారపార్టీ శ్రేణులు మరింత బరి తెగించే పరిస్థితి ఏర్పడుతోంది. ఇప్పటికైనా ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకుని ఎన్నికల్లో అధికార దుర్వినియోగాన్ని అడ్డుకోవాలి. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలను నివారించాలి. శాసన మండలి ఎన్నికలు స్వేచ్ఛగా జరిగేందుకు చర్యలు తీసుకోవాలి. మండలి ఎన్నికల్లో ఓటర్లయిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగ పట్టభద్రులు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులూ అప్రమత్తంగా ఉండాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం ప్రజలందరి కర్తవ్యం.