
ఈ మారు తొలకరి పలకరింపు ఆలస్యమైంది. జూన్ మూడవ వారానికీ వర్షాల్లేక ఏరువాక కదల్లేదు. ఖరీఫ్ సేద్యానికి అదను పదును తప్పేలా ఉంది. తుపాన్లు, వరదలు, అకాల వానలు, వర్షాభావం నిరుడు ఖరీఫ్ రైతుల ఉసురు తీశాయి. పంటలకు ధర సమస్య తిష్ట వేసింది. ప్రభుత్వ నిర్లిప్తత, నిర్లక్ష్యం ఉండనే ఉన్నాయి. ఈ తడవైనా ఖరీఫ్ పంటలు వేయబోతే ఆదిలో హంసపాదులా నైరుతి రుతుపవనాలు ఆలస్యమయ్యాయి. సీజన్‌లో 21 రోజులు గడిచినా మబ్బు జాడ లేదు. ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని లేకుండా అధిక ఉష్ణోగ్రతలు, వడగాలులు, ఉక్కపోతలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికి పడాల్సిన సాధారణ వర్షంలో 61 శాతానికిపైన తక్కువ పడింది. చిత్తూరు మినహా అన్ని జిల్లాలూ 50-80 శాతం వర్షపు లోటు ఎదుర్కొంటున్నాయి. ఎ.పి.లో 679 మండలాలుండగా 527 చోట్ల తక్కువ వర్షం పడింది. 11 మండలాల్లో చినుకు లేదు. 91 మండలాల్లో మాత్రమే నార్మల్, అంతకంటే కొంచెం వర్షం కురిసింది. ఈ గణాంకాలు ప్రభుత్వానివి. క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి.
వ్యవసాయ రాష్ట్రం ఎ.పి.కి ఖరీఫ్ కీలకమైనది కాగా రానురాను రైతులకు సీజన్ భారంగా కష్టంగా తయారైందని సాగు లెక్కలు తెలుపుతున్నాయి. గతేడాది నిర్ణయించుకున్న సాధారణ సాగు విస్తీర్ణంలో ఐదున్నర లక్షల ఎకరాల్లో విత్తనం పడక బీడు పడ్డాయి. రబీలోనూ పది లక్షల ఎకరాల్లో పంటల్లేక ఖాళీ పడ్డాయి. క్రమేపి సాగు తగ్గుతుండటంతో నిర్ణయించుకునే నార్మల్ సాగు అంచనాలూ తగ్గిపోతున్నాయి. ఉదాహరణకు నిరుడు ఖరీఫ్ కంటే ఈ సారి ఖరీఫ్‌లో సాధారణ సాగు విస్తీర్ణం ఆరు లక్షల ఎకరాలు పడిపోయింది. ఒక్క సంవత్సరంలో అన్నేసి లక్షల ఎకరాల తగ్గుదల ఆందోళన కలిగిస్తుంది. రాయలసీమలో వేరుశనగ విస్తీర్ణం తగ్గి పత్తి, ఇతర వాణిజ్య పంటలు పెరుగుతున్నాయి. ధాన్యాగారాలైన గోదావరి, కృష్ణా, పెన్నా డెల్టాలలో వరి కుదించుకుపోయి ఆక్వా, ఇతర కమర్షియల్ క్రాప్స్ వేస్తున్నారు. ఈ ధోరణులు ప్రభుత్వాల విధానాల పర్యవసానాలు. ఏ పంట వేసినా పెట్టుబడులకు కనీస గ్యారంటీ లేనందున సేద్యం రైతులకు జూదాన్ని తలపిస్తోంది. అందుకే తలో దిక్కు పోయి చేతులు కాల్చుకొని నష్టపోతున్నారు. చివరికి చిన్న, సన్నకారు, మధ్యతరగతి రైతులతో స్వంత వ్యవసాయం మాన్పించి కార్పొరేట్ల చెప్పుచేతల్లోకి చేర్చే కుట్ర జరుగుతోంది. ఇది రైతాంగానికి ప్రజల ఆహార భద్రతకు ప్రమాదం.
ఖరీఫ్ సన్నద్ధతకు రాష్ట్ర ప్రభుత్వం అంతగా ప్రాధాన్యత ఇవ్వనట్లే కనిపిస్తోంది. పంటలేయాలంటే రైతులకు కావాల్సినవి అదనకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పరపతి, సాగునీరు. వర్షాలు పడలేదు కాబట్టికానీ, లేకపోతే విత్తనాల కోసం వెదుకులాటే. రాయితీ వేరుశనగ విత్తన పంపిణీని మమ అనిపించారు. ఇండెంట్ బాగా తగ్గించారు. వరి, ఇతర పంటలదీ అదే తీరు. నిరుడు నకిలీ, కల్తీ మిర్చి విత్తనాలు, నారుతో రైతులు భారీగా నష్టపోయారు. పత్తి విత్తనాలూ అంతే. ఇప్పటి వరకు రైతులకు నష్ట పరిహారం అందలేదు. కాగా ఈ ఏడాది ఖరీఫ్ మొదలుకాకముందే చాలా చోట్ల నకిలీ విత్తనాలను సీజ్ చేశారు. పట్టుకున్నది గోరంత, పట్టుకోకుండా చెలామణి అవుతున్నది కొండంత. పురుగు మందుల అక్రమాలు చెప్పనలవికావు. నాణ్యత విషయంలో రాజీ లేదని ప్రభుత్వం హూంకరిస్తుండగా జరిగేది జరిగి పోతోంది. నిరుడు ఎరువుల సరఫరాలో అస్తవ్యస్తత వలన అదనుకు ఎరువులు దొరక్క రైతులు ఇబ్బందులు పడ్డారు. బ్యాంక్ రుణాల లక్ష్యాలు వందకు వంద శాతం చేరాయంటున్నా కౌలు రైతుల పరపతి అధమస్తంగా ఉంది. కేంద్ర బీమా పథకంలో చేరడంతో ఖరీఫ్ బీమా ఇంకా అందలేదు. అకాల వర్షాల బారిన పడ్డ రైతుల్లో చాలా మందికి పరిహారం దక్కలేదు. రైతు భరోసా చాలా మందికి పడలేదు. పి.ఎం కిసాన్ జాడ లేదు. కేలండర్ ప్రకారం కాల్వలకు నీళ్లొదులుతున్నామంటున్నా చివరి భూములకు అందట్లేదు. మరమ్మతుల్లేక కాల్వల్లో తగినంత నీరు పారట్లేదు. రిపేర్లు లేక చిన్న వానలకే డ్రైన్లు పొంగి పొలాలపై పడుతున్నాయి. శ్రీశైలం దగ్గరే రిపేర్లు లేవు. ప్రభుత్వం మాత్రం ఆర్‌బికెల జపం చేస్తోంది. ఏర్పాట్లు లేకుండా ఖరీఫ్ సజావుగా సాగదు. ప్రభుత్వం ఖరీఫ్ సన్నద్ధతపై దృష్టి నిలపాలి.