Oct 22,2023 06:58

'ఎన్ని పువ్వులెన్ని రంగులెన్ని సొగసులిచ్చాడు/ అన్నిటిలో నిన్నే చూడమన్నాడు' అంటాడో సినీ కవి. సృష్టిలో ఎన్నో రంగులు, ఎన్నో రూపాలు, ఎన్నెన్నో భావాలు, ఉద్వేగాలు... ఆ రంగుల్లో రూపు కడతాయి. ఎరుపు, పసుపు, నీలాలే కాదు... వాటి నుంచి ఎన్నో వందల, వేల వర్ణాలు ఇంద్రధనుస్సు విరబూసినట్లుగా రూపుదిద్దుకుంటాయి. ఆయా రంగు, రూపాలకి వున్న ఆకర్షణ వీక్షించే దృష్టిని బట్టి, యోచించే మనసును బట్టి వాటిలోని జీవకళ, భావుకత, ఆర్ద్రత మనసును, కళ్ళను కట్టిపడేస్తుంది. అదే... చిత్రకళ. కళ ఏ రూపంలో వున్నా... అది నిత్యజీవన స్రవంతి. ప్రజలను చైతన్యపరుస్తూనే వుంటుంది. సమకాలీన సమాజ స్థితిగతులకు నిలువెత్తు దర్పణం చిత్రకళ. కళా ప్రయోజనం కేవలం ఆనందానికి, సౌందర్యానికే పరిమితం కాదు. హృదయాలను కదిలించి, సమస్యలను ప్రతిబింబించి, ఆలోచనలను రేకెత్తించి... పోరాడే ప్రేరణనిస్తుంది. సమస్యలను చూపడమే కాదు... పరిష్కారాల బాటలు కూడా వేయగలదు. చరిత్రలోని వాస్తవాలను కనుల ముందుకు తీసుకురాగలదు. మానవ అనుభవంలో కళకు చాలా ముఖ్యమైన పాత్ర వుంది. ప్రపంచంలోని మొదటి రికార్డులన్నీ పుస్తకాలలో రాయలేదు. చిత్రాలు, శిల్పాలు, సంగీతం రూపంలోనే నిక్షిప్తం చేయబడ్డాయి. ఇవి గతానికి సంబంధించిన ప్రపంచ చిత్రాన్ని చిత్రించడానికి సహాయపడ్డాయి. మనిషిలో ఆవేశం, ఆర్ద్రత వున్నంతకాలం రసాలూరే భావాలకు కొరత వుండదు.
చిత్రకళ ప్రాచీన నాగరికతకు... ప్రస్తుత కాలానికి మధ్యగల వైరుధ్యాన్ని ప్రతిబింబించే ఒక అందమైన కళాస్రవంతి. వివిధ సంస్కృతులు, సంప్రదాయాల కలయికకు నిలువుటద్దం. ఇతిహాసపు చీకటికోణం అట్టడుగున పడి కనిపించని కథలన్నిటికీ రూపాన్నిచ్చిన ఘనత కళది. తాజ్‌మహల్‌ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు, ప్రభువెక్కిన పల్లకితో పాటు, అది మోసిన బోయీలు, గనిలో, వనిలో పోరాటాల్లో చిందించిన స్వేదం, పారించిన రుధిరం, హరప్పా, మొహంజొదారో గుహల్లోని చారిత్రక విభాగ సంధ్యల మానవ కథా వికాసాన్ని రూపుకట్టినది- చిత్రం, శిల్పం, సాహిత్యం. మనిషి తన భావాలను, భావనలను వ్యక్తీకరించగలిగిన నాటి నుంచి కళ ఉనికిలోకి వచ్చింది. మట్టిలో లేదా గోడలపై చెక్కబడిన, కళ మానవ నాగరికత ప్రధాన అంశం. ఇది సామాజిక, రాజకీయ ప్రభావాలను తెలియజేయడానికి, వర్ణించడానికి ఉపయోగించిన ప్రధాన మాధ్యమం. బల్బ్‌ నుంచి వరల్డ్‌ వైడ్‌ వెబ్‌ ఆవిష్కరణ వరకు ప్రపంచ చరిత్రను మలుపు తిప్పి, భవిష్యత్‌ తరాలకు స్ఫూర్తినిచ్చినట్లే... పదివేల సంవత్సరాల ఉనికిలో కళ కూడా దాని ఔన్నత్యాన్ని, ఔచిత్యాన్ని ప్రదర్శిస్తూనే వచ్చింది. చరిత్రలోని అనేక ముఖ్యమైన ఘట్టాలు చిత్రం, శిల్పం, ఆట, పాట, మాట ఆవిష్కృతమయ్యాయి.
జీవితపు విలువల్లో మార్పులొస్తున్నా, జీవన విధానాల్లో వైరుధ్యాలు పెరుగుతున్నా... ఆలోచించే మనసు చుట్టూ మాత్రం ఎవ్వరూ అడ్డుగోడలు కట్టలేరు. కళ అంటేనే చైతన్యం. అది నవనవోన్మేషం. స్తబ్దత కళను నిర్వీర్యం చేస్తుంది. ఎప్పటికప్పుడు కళలో కొత్తనీరు వచ్చి చేరుతుండాలి. లేకపోతే, పాత నీరు పాచికట్టి అనారోగ్యానికి దారితీస్తుంది. కళకు ఆ పరిస్థితి రాకుండా ముందుగానే గుర్తించి, కళలో కొత్తదనాన్ని, ప్రజాకోణాన్ని ప్రవేశపెట్టాలి. రూపం ఏదైనా కావొచ్చు. కళ కళ కోసం, కాసుల కోసం కాదు, కళ ప్రజల కోసం, వారి అభ్యున్నతి కోసం అన్న సాంస్కృతికోద్యమ ఆశయాన్ని మరింత ముందుకు తీసుకుపోయి, సమ సమాజ స్థాపన కోసం జరిగే పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించేది కళ. ఈ కళ ప్రపంచంపై చూపిన అద్భుత ప్రభావాన్ని భవిష్యత్తరాలకూ అందించాలి. అనేకానేక సృజనశీలురు తయారయ్యేందుకు ఊతమివ్వాలి. ఆ ఉద్దేశంతోనే అక్టోబర్‌ 25ను 'అంతర్జాతీయ కళాకారుల దినోత్సవం'గా పాటించాలని నిర్ణయించారు. సమాజ క్రమాన్ని ప్రజాకోణంలో రంగులద్దగల ప్రతి స్రష్టా వైతాళికుడవుతాడు. 'కాదేదీ కవితకనర్హం' అన్నట్లు- పల్లె సంస్కృతి, రైతు జీవనం, ప్రజా ఉద్యమం, అణచివేత...ఏదైతేనేం, ఈ భావనలకు రూపుదిద్ది, రంగులద్ది చైతన్యాన్ని రగిలిస్తాడు చిత్రకారుడు. కవి, రచయిత, గాయకుడు, శిల్పి... కళ ఏదైనా అది ప్రజా ప్రయోజనం అయినప్పుడు ఆ కళకొక పరమార్థం దక్కుతుంది.