Dec 06,2020 09:34

నిషి ఎలాగైనా శ్రమచేసి జీవనం సాగించాలి. ఆ క్రమంలో జీవితం హాయిగా.. స్వేచ్ఛగా.. భద్రంగా సాగాలి.. అసలు బతకడమే కష్టంగా మారితే.. రకరకాల పేర్లతో ముద్రలు వేస్తూ చాలా తేలికగా ప్రాణాలు తీసేస్తుంటే.. ప్రశ్నించినా.. ప్రతిఘటించినా.. అణిచేస్తుంటే ఏం చేయాలి? ఒక్కోసారి మనం నాగరిక ప్రపంచంలోనే ఉన్నామా? అన్న అనుమానమూ రాకమానదు. ఇది ఒక్క మన దేశంలోనే కాదు.. ప్రపంచంలోని అనేక దేశాల్లోనూ ఇదే దుస్థితి. మానవ హక్కుల్ని యధేచ్ఛగా ఉల్లంఘిస్తున్నాయి పాలకపక్షాలు. మన హక్కుల గురించి రాజ్యాంగంలో రాసుకున్నాం.. కానీ ఆ రాజ్యాంగాన్నే కాపాడుకోవాల్సిన పరిస్థితి నేడు ఏర్పడింది. అణచివేత, దోపిడీలపై పోరాడటం, ప్రశ్నించడం మానవహక్కులే అంటూ ఐక్యరాజ్యసమితిలో ప్రతిధ్వనించినా.. అవీ కాగితాలకే పరిమితమై భవిష్యత్తరాన్ని వెక్కిరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నేడు ప్రపంచంలోని అనేక గొంతుకలు హక్కుల కోసం నినదిస్తున్నాయి. నినదించే హక్కును సైతం కాలరాస్తోంది పాలకపక్షం. మరోవైపు బలహీనులకు, బాధితులకు అండగా ఉండాల్సిన హక్కులను బలవంతులు, పాలకవర్గాలు కబ్జా చేస్తున్నాయి. అసలు ఏది హక్కు? ఆ హక్కులు ఎవరికి? వాటిని ఎలా కాపాడుకోవాలి? ఇదే ఈ అట్టమీది కథనం.

ఇవే కాదు.. ఇలాంటివి ఎన్నో అంశాలు.. విడివిడి సమూహాలు.. ఎక్కడికక్కడ ఒక్కటై, ఐక్యమై నినదించిన క్షణాలు! మనుగడ కోసం ప్రారంభమైన ఆరాటం.. మనిషితనాన్ని మరచిపోయి, స్వార్థమే సర్వస్వంగా మారినప్పుడు.. రక్షణ కోసం ఆవిర్భవించిన రాజ్యం.. సామాన్యుడిని సమిధలుగా మార్చినప్పుడు.. అవసరం కోసం ప్రారంభమైన వ్యాపారం.. లాభమే లక్ష్యంగా తోటి మనుషుల రక్తాన్ని మరిగినప్పుడు.. మనిషిని మనిషిగా కాకుండా.. హీనంగా.. దీనంగా మార్చే నికృష్ట సంస్కృతిని ప్రశ్నిస్తూ.. 'మేమూ మనుషులమే.. మమ్మల్ని బతకనివ్వండి..!' అంటూ నినదించిన గొంతులు.. అణచివేతను, దోపిడీని నిలదీసిన పోరాటాలు.. మానవ హక్కులయ్యాయి. మానవ హక్కులుగా ఐక్యరాజ్యసమితిలో ప్రతిధ్వనించాయి. ప్రపంచదేశాలకు దిశా నిర్ధేశం అయ్యాయి. కానీ, ఆ గమ్యాన్ని చేరుకోవడం.. సామాన్యులు సైతం ధైర్యంగా బతికే సమతారాజ్యాన్ని సాధించడం.. అంత సులభమేమీ కాదు. అందుకే అనేక దేశాల్లో మానవహక్కులు కాగితాలకే పరిమితమయ్యాయి. అరకొరగా ఉన్న రక్షణలు నిర్బంధ చట్టాల చాటున నీరసించాయి.

మనిషికున్నంత చరిత్ర..
మానవ హక్కులకు మనిషికున్నంత చరిత్ర ఉంది. మనిషి సాగించిన ప్రతి పోరాటంలోనూ, సాధించిన ప్రతి విజయంలోనూ మానవ హక్కులను అణచివేయడమో.. సమున్నత స్థాయిలో ఎగురవేయడమో జరిగింది. ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లుగా, నాగరికతకు నట్టిల్లుగా చెప్పుకునే అమెరికా ఆవిర్భావమే కనీస హక్కులను పాతరేసి, సామాన్యుల నెత్తుటి ఏరులు పారించిన తరువాతే జరిగింది. లాభం కోసం సాగిన అన్వేషణ ఒక జాతిని, దాని హక్కులను సమూలంగా ఎలా తుడిచిపెట్టిందో... రక్తపిపాసులు అధికారాన్ని ఎలా దక్కించుకున్నారో తెలుసుకోవాలంటే 'నరహంతకులు ధరాధిపతులై' పుస్తకం చదవాల్సిందే! ఆ అమెరికానే ఇప్పుడు ప్రపంచానికి ప్రజాస్వామ్యం.. హక్కుల పాఠాలను చెప్పడానికి బరితెగిస్తోంది.


చరిత్ర పుటల్లో కలిసిన సోవియట్‌ యూనియన్‌ది మరో చరిత్ర. ఏ సామాన్యుల సమాధులపైన అమెరికన్‌ డేగ రెక్కలు చాచిందో, ఆ సామాన్యుల చేతికే అధికారాన్ని అప్పగించిన ఘనత సోవియట్‌ యూనియన్‌ది. గనులను కొద్దిమందికి ఎలా సొంతం చేయాలన్న దానిపై అమెరికాలో తొలి చట్టాల రూపకల్పన జరగ్గా, సామాన్యులకు భూ పంపిణీ, అధికారాన్ని వారికి అప్పజెప్పడం, మహిళల సమానావకాశాలు సోవియట్‌ తొలి చట్టాలు. మానవ హక్కులకు ఎవరు పట్టం కట్టారో.. వాటిని కబ్జా చేసిందెవరో.. ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ చరిత్ర తెలుసుకోకుండా మానవహక్కుల గురించి మాట్లాడటం అర్థరహితం. ఎందుకంటే సోవియట్‌ రష్యాలో 1917లో విప్లవం విజయవంతమై రెండవ ప్రపంచ యుద్ధంలో ఫాసిజాన్ని తుదముట్టించింది. విశ్వమంతా సమతా వాయువుల ప్రసరణ ప్రారంభమైంది. ఆ తర్వాతే 1948, డిసెంబర్‌ 10న ఐక్యరాజ్యసమితి మానవహక్కుల ప్రకటనను ఆమోదించింది. 1950, డిసెంబర్‌ 10వ తేదీని 'మానవ హక్కుల దినం' గా ప్రకటించింది.

హక్కులు ఎవరికి...?
ఇక వర్తమానానికి వద్దాం. సోవియట్‌ యూనియన్‌ లేని ప్రస్తుత ప్రపంచంలో అణచివేయడం, దోపిడీ చేయడం ఇవి రెండే కీలక సూత్రాలుగా మారిన విషయం ప్రత్యేకంగా చెప్పనసవరం లేదు. అయితే, ఈ పనులు ఎవరైతే చేస్తారో వారే హక్కుల పరిరక్షకులుగా భుజకీర్తులు తగిలించుకోవడం పరిపాటిగా మారింది. దానికోసం అన్నింటినీ గందరగోళపరుస్తూ మభ్య ప్రపంచంలో ఉంచడం. ఒకటి చెబుతారు.. మరొకటి చేస్తారు.. చెప్పినదాన్నే చేస్తున్నామంటూ నిజమని మభ్యపెడుతూ ప్రచారం చేస్తారు.. చేయిస్తారు. ఇప్పుడన్నీ తలకిందులుగా కనపడేది అందుకే. ఎవరు పీడితులో, ఎవరు పీడకులో ఒక పట్టాన అర్థం కాదు. భూమి లేని నిరుపేదలు కడుపు నింపుకోవడం కోసమో, తల దాచుకోవడం కోసమో సెంటు ప్రభుత్వ భూమినో, అటవీభూమినో స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తే వారిని ఆక్రమణదారులని ముద్ర వేస్తారు. కేసులు పెట్టి, జైళ్లల్లో పడేస్తారు. జీవించే హక్కు, గౌరవంగా జీవనం సాగించే హక్కు గురించి, అవి ఎంత మానవహక్కులైనా సరే ఇక్కడ మాట్లాడటానికి వీల్లేదు. బెయిల్‌ తెచ్చుకునే దిక్కులేక ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గుతున్న వారిలో అత్యధికులు ఇటువంటి వారే. వీరి జీవితాలు జైళ్లలోనే ముగుస్తుంటాయి. అదే ఏ ఆదానీనో, అంబానీనో అయితే నామమాత్రపు లీజుకు వందల, వేల ఎకరాలు తీసుకుంటారు. పరిశ్రమలు పెడతారు. ఉద్యోగాలు వస్తాయి అంటారు. ఈ క్రమంలో ఎందరు నిరాశ్రయులైనా, కట్టుబట్టలతో రోడ్డున పడ్డా ఫర్వాలేదు. ఎందుకంటే వారికేమీ రావు, వారు మనుషులు కారు.. నిరాశ్రయులు, నిర్భాగ్యులు, నిరుపేదలు అంతే! వారికే హక్కులూ ఉండవు..


మన రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకూ తీరప్రాంతాన్ని ఒక్కసారి చూస్తే.. ఇటువంటి ఆక్రమణలు ఎలా జరుగుతున్నాయో, ఆక్రమణలు చేస్తున్నవారికి ప్రభుత్వ రక్షణ ఎలా లభిస్తోందో.. సర్వహక్కులు ఎలా దఖలు పడుతున్నాయో అర్థమవుతుంది. వీరికే సమాజంలో గౌరవనీయ స్థానం లభిస్తుంది. చట్టాలు, పోలీసులు, న్యాయవాదుల్లో అత్యధికుల మద్దతు వీరికే. అన్ని హక్కులూ వీరికే దఖలు పడతాయి. ఒక్కోసారి రాజ్యాంగంలో లేనివీ అవసరమైతే సృష్టిస్తారు. ఈ మాత్రం పూచీ లేకపోతే.. అన్ని వందల కోట్లు దిగమింగిన విజయమాల్యా అంత సులభంగా విదేశాలకు ఎలా వెళ్లిపోగలడు? ఇప్పటికీ అక్కడే ఎలా ఉండగలడు? అందుకే హక్కులు.. అవి మానవ హక్కులైనా.. మరొకటైనా.. వాటి ఫలాలు ఎవరికి చెందాలి? పీడనకు గురయ్యే వారికా? పీడించే వారికా? గో గూండాల పేరుతో దాడులకు దిగేవారికా? ఆ దాడుల్లో ప్రాణాలు కోల్పోయేవారికా? అత్యాచారాలు చేసేవారికా? ఆ అమానుష కాండకు బలయ్యే వారికా? మతం, కులం పేరుతో హింసకు దిగే వారికా? ఆ హింసాకాండలో ఆస్తులను, అయినవారిని కోల్పోయి బాధితులుగా మిగిలే వారికా? మానవ హక్కులు ఎవరికి? అసలు ఏది హక్కు? పీడించడమా? పీడనను తిప్పికొట్టడమా? ప్రాణాలు తీయడమా? కాపాడుకోవడమా? బానిసలుగా బతుకులీడ్చడమా? బానిస సంకెళ్లను తెంచుకోవడమా?

ఐక్యరాజ్య సమితి ఏం చెప్పింది?
మనిషి మనిషిగా బతికేందుకు దోహదపడే ప్రతి అంశమూ మానవహక్కే! అంటే కూడు, గూడు, గుడ్డ వంటి అంశాలకే పరిమితం కాదని ఐక్కరాజ్యసమితి 1948 డిసెంబర్‌10న చేసిన యూనివర్శల్‌ డిక్లరేషన్‌లో పేర్కొంది. ఈ డిక్లరేషన్‌ ప్రకారం మనిషిగా బతకడమే కాదు, గౌరవప్రదమైన జీవితాన్ని గడపడమూ మానవ హక్కుల్లో భాగమే! భావప్రకటనా స్వేచ్ఛ కూడా దీనిలో భాగమే. అన్ని రకాల వివక్షలకు వ్యతిరేకంగా, పేదరికానికి వ్యతిరేకంగా, సమానత్వం, సమానావకాశాల సాధనకోసం ప్రపంచ మానవాళి కృషి చేయాలని ఆ డిక్లరేషన్‌ పిలుపునిచ్చింది. దీనిలో భాగంగా ఒక్కో ఏడాది ఒక్కో అంశాన్ని ఐక్యరాజ్యసమితి ప్రధానంగా తీసుకుని పనిచేస్తుంది. ఈ ఏడాది కరోనా బారిన పడిన వారిపై వివక్ష చూపడాన్ని నిరసించాలని, వారికి సంఘీభావంగా కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చింది.

మనదేశంలో ఇలా ...
మన దేశానికి వస్తే మానవహక్కుల చట్టం 1993 సెక్షన్‌2 (డి) ప్రకారం వ్యక్తుల జీవితం, స్వేచ్ఛ, సమానత్వం, గౌరవానికి సంబంధించిన అన్ని హక్కులు మానవ హక్కులే! అయితే, ఇవి రాజ్యాంగంలోకానీ, అంతర్జాతీయ ఒప్పందాల్లో గానీ పొందుపరచి ఉంచాలని, భారత న్యాయస్థానాల ద్వారా అమలుపరుచుకోగలిగి ఉండాలని పేర్కొన్నారు. జీవించడమంటే జంతువుల్లాగా గడపడం కాదని, భౌతిక, మానసిక, మేధోపరంగా అభివృద్ధి చెందడానికి తగిన పరిస్థితులు ఉండాలని సుప్రీంకోర్టు 1990లో ఒక కేసు విచారణలో తెలిపింది.

రాజ్యాంగంలో వీటికి పూచీ..
రాజ్యాంగంలోని 19వ అధికరణం వాక్‌ స్వాతంత్య్రం (భావ వ్యక్తీకరణ), నచ్చిన వృత్తిని, మతాన్ని స్వీకరించి, అనుసరించే స్వేచ్ఛను, ఎక్కడైనా నివసించే హక్కును, సంచరించే హక్కును దఖలుపరిచింది. ఇవన్నీ మానవ హక్కుల కిందకే వస్తాయి.14 నుంచి 18 అధికరణాలు సమానత్వపు హక్కును నిర్దేశించాయి. 17వ అధికరణం అంటరానితనంతోపాటు అన్ని రకాల వివక్షల నుంచి రక్షణ కల్పిస్తుంది. 1993లో మానవ హక్కుల పరిరక్షణ చట్టాన్ని ఆమోదించడంతో వీటికి చట్టబద్ధత కూడా లభించింది. హక్కులు ఉల్లంఘించబడితే కోర్టుకు వెళ్లే అవకాశమూ ఉంది.

ఆచరణలో అపహాస్యం..
దేశంలో చట్టాలు ఘనంగా ఉన్నప్పటికీ ఆచరణలో అపహాస్యానికి గురవుతున్నాయి. ఎటువంటి విచారణా లేకుండా జైళ్లలో మగ్గుతున్న వారి సంఖ్య ఏటికేడాది పెరుగుతోంది. 2019లో విడుదల చేసిన లెక్కల ప్రకారం 3,30,487 మంది వివిధ జైళ్లలో విచారణ లేకుండా కాలం గడుపుతున్నారు. వీరిలో అత్యధికులు ఉత్తరప్రదేశ్‌లో ఉన్నారు. ఇది మానవహక్కుల ఉల్లంఘనే! నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత భావప్రకటనా స్వేచ్ఛ, సభలు, సమావేశాలు జరుపుకునే స్వేచ్ఛలను పెద్దఎత్తున హరిస్తున్నారని ఐక్యరాజ్య సమితికి మానవహక్కుల కమిటీ పేర్కొంది. ఈ విషయంలో ఐక్యరాజ్యసమితికి భారతదేశం సరైన సమాచారం ఇవ్వడం లేదని ఆ కమిటీ విమర్శించింది. దేశద్రోహం పేరిట ప్రభుత్వం ఎంతోమంది గొంతులను అణచివేస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ కమిటీ రూపొందించిన నివేదిక ప్రకారం సిఎఎ వ్యతిరేక ఆందోళనల సందర్భంగా 1500 మందిని కేంద్రం నిర్బంధించింది. 83 సంవత్సరాల స్టాన్‌ స్వామిని జైలులో నిర్బంధించడాన్ని కమిటీ తప్పు పట్టింది. స్టాన్‌ స్వామితో పాటు బీమా కొరగావ్‌ కేసులో వరవరరావుతో పాటు అనేకమంది రచయితలను, మేధావులను అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. అంతకుముందే వికలాంగుడైన సాయిబాబాను అరెస్టు చేసి, ఏళ్లు గడుస్తున్నా విడుదల చేయలేదు. ఆయన తల్లి చనిపోతే చివరి చూపూ చూడనివ్వలేదు.

నల్ల చట్టాలివి..!
అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకుంటున్నప్పటికీ హక్కులను హరించడమే లక్ష్యంగా అనేక చట్టాలు రూపొందాయి. వీటి ఉద్దేశం ఏమైనప్పటికీ ఆచరణలో అవి మానవ హక్కులకు ప్రమాదకరంగా మారాయన్నది నిర్వివాదం. ఇండియన్‌ ఆర్మ్‌డ్‌ఫోర్సెస్‌ (స్పెషల్‌ పవర్స్‌) చట్టం, టెర్రరిస్టు ప్రభావ ప్రాంతాల (ప్రత్యేక కోర్టుల) చట్టం, టెర్రరిస్ట్స్‌ అండ్‌ డిస్‌రప్టివ్‌ యాక్టివిటీస్‌ (ప్రివెన్షన్‌) యాక్ట్‌ 1987 (టాడా), ప్రీవెన్షన్‌ టెర్రరిజం యాక్ట్‌ (పోటా)-2002 వీటిలో కొన్ని. టాడా స్థానంలో మరిన్ని విస్తృత అధికారాలతో పోటాను ప్రభుత్వం తీసుకువచ్చింది. ఇటీవల కాలంలో నినదిస్తున్న గొంతులను నొక్కడానికి ఈ చట్టాన్నే కేంద్రం ఉపయోగిస్తోంది.

ఏం చేయాలి..?
హక్కులేవీ భిక్షగా రాలేదు. ఎన్నో త్యాగాలు, సుదీర్ఘ పోరాటాలతోనే వచ్చాయి. అలా సాధించుకున్న వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యతా మనదే! కాళ్లా వేళ్లా పడి హక్కులను కాపాడుకోలేం, కొత్తవి సాధించుకోలేం! సంఘటితంగా సమైక్య పోరాటాలు చేయడం, అటువంటి పోరాటాలకు మనసా, వాచా, కర్మణా సహకరించడం ద్వారానే హక్కుల పరిరక్షణ సాధ్యమవుతుంది. ఇలా పోరాటం చేయడమూ మన హక్కే! మానవ హక్కే!

***

అవసరాలన్నీ తీర్చుకోగలగడమే స్వేచ్ఛ : కారల్‌ మార్క్స్
(freedom is realisation of necessities -Marx)

స్వేచ్ఛ ముఖ్యమా? తిండి ముఖ్యమా? అన్న చర్చ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. తిండే ముఖ్యం అనుకుంటే జైల్లో తిండి పెడతారు. అక్కడ ఉండటానికి సిద్ధపడతారా? కాదు. స్వేచ్ఛే ముఖ్యం అనుకుంటే ఆకలి కడుపులతో బతికే స్వేచ్ఛ మనకి ఎలాగూ ఉంది కదా?! అన్న ప్రశ్న వస్తుంది. అందుకే.. ఈ ప్రశ్న తప్పని గుర్తించడం అవసరం. స్వేచ్ఛ-తిండి రెండు వేర్వేరు అంశాలు కావు. మనిషి మనుగడలో రెండూ అంతర్భాగమే. అందుకే మార్క్స్‌.. మనిషి తన అవసరాలన్నింటినీ (శారీరక, బౌద్ధిక, సాంస్కృతిక, సామాజిక, కుటుంబ అవసరాలు) తీర్చుకోగలగడమే స్వేచ్ఛ అని నిర్వచించాడు. అటువంటి స్వేఛ్చను పొందగలిగే సామాజిక వ్యవస్థ కమ్యూనిజంలోనే సాధ్యమవుతుందని వివరించాడు.

***

'మీరు తీసుకొచ్చిన చట్టాలతో మా భవిష్యత్తు అగమ్యగోచరమవుతుంది. రోడ్డున పడాల్సి వస్తుంది. బతకడం కష్టమవుతుంది. మాకే కాదు.. దేశంలోని కోట్లాది మంది ప్రజలకి ఆహార సమస్య తలెత్తుతుంది. తిండి గింజలు దొరక్క.. దొరికినా కొనే సామర్థ్యం లేక ప్రజలు ఆకలితో నకనకలాడాల్సి వస్తుంది.'
- దేశవ్యాప్తంగా రైతాంగం వినిపిస్తున్న గళం

***

'నేను 80 సంవత్సరాల పైబడిన ముదుసలిని! వృద్ధాప్య సమస్యలు వెంటాడుతున్నాయి. చేతులు వణుకుతున్నాయి. ఆహారాన్ని నమిలి తినలేను. జావ చేసుకుని తాగడానికి ఒక కప్పు, స్ట్రా ఇప్పించండి!'
- ఎన్‌ఐఎ ప్రత్యేకకోర్టుకు ఫాదర్‌ స్టాన్‌స్వామి చేసిన విజ్ఞప్తి

***

'మేము ఈ దేశంలోనే పుట్టాం. ఇక్కడే మరణిస్తాం. మేమే కాదు. మా తాత ముత్తాతలూ ఈ నేల మీదే పుట్టారు. వారందరికీ ఆధారాలు తీసుకురమ్మంటే ఎలా తేగలం? మతానికీ పౌరసత్వానికీ ముడిపెట్టి వెళ్లిపొమ్మంటే ఎక్కడికి పోగలం..? ఎలా బతకగలం?'
- సిఎఎ, ఎన్‌ఆర్‌సి ఆందోళనల్లో బాధితుల ఆవేదన

***

'కరోనా వైరస్‌ వెంటాడుతోంది. ఇది ఎప్పుడు తగ్గుతుందో తెలియదు. ఇంకా విజృంభిస్తుందేమో కూడా తెలియదు. వ్యాక్సిన్‌ ఎప్పుడు వస్తుందో? వచ్చినా తమకు అందుతుందో? లేదో? అందినా ధర తమ ఆర్థిక పరిస్థితికి తగ్గట్టుగా అందుబాటులో ఉంటుందో? ఉండదో?'
- ప్రపంచవ్యాప్తంగా సామాన్యుల ఆందోళన

- పొగడదొరువు
7382168168