Feb 07,2021 07:07

    'పాలకులు ప్రజల్ని తమ గుప్పిట్లోకి తెచ్చుకోవాలంటే ...''దేశద్రోహం'' ముద్రను మించిన ఆయుధం మరొకటి లేదు' అంటాడు ప్రఖ్యాత తత్వవేత్త.. విద్యావేత్త నోమ్‌చామ్‌స్కీ. సరిగ్గా ఇప్పుడు మన దేశంలో అదే జరుగుతోంది. ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్చా హక్కుతో వాస్తవాల ప్రాతిపదికగా నిర్భయంగా సర్కారును విమర్శించినా, వారు అమలు చేయాలనుకుంటున్న మనువాద సంస్కతిని ప్రశ్నించినా... వ్యతిరేకించినా నేడు దేశద్రోహం కేసులు పెట్టి మరీ అణివేస్తున్నారు. గుజరాత్‌లో జరిగిన మారణకాండ మీద పరిశోధించాలనుకుంటే... ప్రపంచం ముందు దేశాన్ని అవమానపరుస్తున్నారని గగ్గోలు పెడతారు. చివరకు అన్నం పెట్టే రైతుకు మద్దతు తెలిపినా కళ్లెర్రజేస్తున్నారు.
   ఇప్పుడు ప్రభుత్వం దుర్భిణీ పెట్టి వెతుకుతోంది. కనుచూపు మేరలో ఎక్కడ చూసినా... దానికి దేశద్రోహులే కనిపిస్తున్నారు. జెఎన్‌యు విద్యార్థులంతా దేశద్రోహులే. వారిపై దేశద్రోహం కేసులు నమోదు చేసి జైళ్ల పాలు చేశారు. భీమాకోరెగాం దళితుల పక్షాన నిలిచి, వారి కోసం పోరాడిన వారిని, బస్తర్‌ గిరిజనుల కోసం పోరాడిన వారిని దేశద్రోహులన్నారు. విద్యావేత్తలను, వృద్ధులను సైతం వదిలిపెట్టలేదు. 80శాతం అంగవైకల్యం గల ప్రొఫెసర్‌ సాయిబాబాతో పాటు పార్కిన్‌సన్‌ వ్యాధితో బాధపడుతోన్న 83ఏళ్ల స్టాన్లీ సామిని కూడా జైల్లో పెట్టి దేశద్రోహులన్నారు. మేము ఈ దేశ పౌరులమేనన్నందుకు సిఎఎ పేరుతో దేశద్రోహం ముద్ర వేశారు. విద్యార్థులనుంచి రైతుల వరకూ ఎవరినీ వదిలిపెట్టలేదు. ఎవరైతే అజ్ఞానాన్ని వదిలించుకోవాలనుకుంటారో, చదువుకుందామనుకుంటారో... మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా గళం విప్పుతారో... వీళ్లంతా దేశద్రోహులే. జర్నలిస్టులు వాళ్ల పనివాళ్లు చేసుకుంటున్నా... దేశద్రోహులుగానే పరిగణించుతున్నారు. ఆర్థికవేత్తలు ఇంకా పెద్ద దేశద్రోహులు. ఎందుకంటే... ప్రభుత్వ ఆర్థిక విధానాలను, పాలసీలను ప్రశ్నిస్తారు గనుక. నోట్ల రద్దును ప్రశ్నించినందుకు వారందరినీ దేశద్రోహులన్నారు. ప్రతిపక్ష పార్టీలన్నిటినీ దేశద్రోహులుగానే ముద్రవేస్తున్నారు. అయితే, ఈ ప్రతిపక్ష పార్టీల నుండి బిజెపిలోకి వచ్చిన వారు మాత్రం... పునీతులు... చరితార్థులు. ముస్లిములు, క్రైస్తవులు కూడా దేశద్రోహులే. చివరకు శిక్కులు కూడా దేశద్రోహులే. ఎందుకంటే... వారిలో ప్రతి కుటుంబం నుంది దాదాపు ఒక్కరైనా సైన్యంలో వున్నారు. ఇప్పుడు జరుగుతున్న రైతు పోరాటంలోనూ వున్నారు. మలయాళీలయితే... ఎప్పటినుంచో దేశద్రోహులుగా పరిగణింపబడుతున్నారు. వారంతా సోమాలియానుంచి వచ్చినవారుగా ముద్రవేశారు. బాబర్‌ కాలం నుండి ఇప్పటివరకు వున్నవారంతా దేశద్రోహులే. ఎందుకంటే... ఈ దేశంలోనే వెయ్యి సంవత్సరాలుగా వుంటూ, ఈ దేశ అభివృద్ధిలో భాగస్వాములవుతున్నారు గనుక వారు దేశ ద్రోహులే.
    అంతెందుకు.... ఇప్పుడు రైతులంతా దేశద్రోహులే. ఎందుకంటే.. ఈ దేశంలో హరిత విప్లవం తీసుకొచ్చి, భారత దేశం ఆహారం విషయంలో స్వయం పోషకంగా ఎదిగేందుకు కృషి చేశారు గనుక వారంతా దేశ ద్రోహులు. ఈ నేలను, సాగును నమ్ముకున్న రైతు... దేశ భవిత కోసం రోడ్డెక్కితే... ఖలిస్తానీలు, ఉగ్రవాదులు అని ముద్ర వేస్తున్నారు. ఇప్పుడు రైతులకు మద్దతుగా ముందుకొస్తున్న హ్యాష్‌ట్యాగ్‌లకు భయపడి... రోడ్లపై మేకులు కొడుతున్నారు. భారత దేశం ఇవ్వాళ జాతుల బందిఖానా. దేశద్రోహులనే ముద్రవేసే కార్ఖానా. నిన్నటి చరిత్ర నిన్నటి లాగానే ఉండనక్కర్లేదనుకున్నా... ఇవ్వాళ్టి చరిత్రను తిరగరాయాలనుకున్నా... ఆ నిర్ణయం చరిత్ర నిర్మాతలైన ప్రజల చేతుల్లోనే ఉంటుంది. 'దేశమంటే మట్టికాదోరు... దేశమంటే మనుషులేనోరు' అన్నారు గురజాడ. దేశద్రోహం ముద్ర వేసినంత మాత్రాన నిజమైన దేశభక్తులెవరూ ఒక్క అడుగు కూడా వెనక్కి వేయరు. దానికి తార్కాణమే 70రోజులకు పైగా జరుగుతోన్న రైతు పోరాటం. దేశం కోసం ప్రాణమిచ్చే దేశభక్తులు ప్రభవిస్తూనే ఉంటారు. నిరంకుశ ప్రభుత్వాలను పడగొడుతూనే ఉంటారు. ఒక ఉషస్సు పుట్టాలంటే ఎన్నోకోట్ల నక్షత్రాలు చనిపోవాలన్నట్లుగా... నిజమైన దేశభక్తులు తమ ప్రాణాలను బలిపెట్టి అయినా... నిరంకుశాధికార పతనానికి నాంది పలుకుతారు.