అమెరికా : తాను గర్భం దాల్చినట్లు తెలుసుకున్న ఓ యువతి ఆ విషయం తెలుసుకున్న 48 గంటల్లోనే డెలివరీ అయ్యిన ఘటన అమెరికాలో జరిగింది. సహజంగా మహిళలు గర్భం దాలిస్తే శరీరంలో కొన్ని మార్పులు చోటుచేసుకుంటాయి. వైద్యులను సంప్రదించి, పలు పరీక్షలు చేయించి గర్భధారణను నిర్ధారించుకుంటారు. ఆ తరువాత తొమ్మిది నెలలు గర్భంలో శిశువును మోసిన తర్వాత మహిళ బిడ్డకు జన్మనిస్తుంది. నిర్ణీత నెలల కంటే ముందే బిడ్డను కంటే ఆ బిడ్డ ప్రాణాలకే ప్రమాదం. ఎందుకంటే తల్లి గర్భంలో శిశువు సంపూర్ణంగా అభివృద్ధి చెందడానికి కచ్చితంగా తొమ్మిది నెలల సమయం కావాల్సిందే. కానీ ఆమెరికాకు చెందిన ఓ మహిళ మాత్రం తాను గర్భం దాల్చినట్టు తెలుసుకున్న 48 గంటలకే బిడ్డకు జన్మనిచ్చింది. అంతేకాదు.. ఆ తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు.
ఏంజరిగిందంటే... అమెరికాకు చెందిన పేటన్ స్టోవర్ (23) స్థానిక విద్యాసంస్థలో టీచర్‌గా పనిచేస్తోంది. ఇటీవల ఆమెకు తల తిరిగినట్లుగా, వికారంగా అనిపించడంతో పని ఒత్తిడివల్ల కావచ్చని లైట్ తీసుకుంది. కానీ, క్రమంగా బాడీలో మార్పులు రావడం, కాళ్లలో వాపు రావడంతో భయపడిన ఆమె వైద్యులను సంప్రదించింది. మహిళను పరీక్షించిన వైద్యులు.. స్టోవర్‌కు ప్రెగెన్సీ అని నిర్ధారించారు. ఆ విషయాన్ని స్టోవర్ నమ్మలేదు. దాంతో అల్ట్రా సౌండ్ స్కానింగ్ చేయించుకుంది. కడుపులో బిడ్డ ఉన్నట్లు స్కానింగ్‌లో స్పష్టంగా కనిపించడంతో ఆమె గర్భం దాల్చినట్లు నమ్మింది. స్టోవర్ గర్భం వచ్చి ఆరు నెలలు దాటిందని వైద్యులు చెప్పడంతో దంపతులిద్దరూ షాకయ్యారు. అంతేగాక, ప్రెగెన్సీతో పాటు అత్యంత అరుదుగా వచ్చే ప్రీక్లామ్‌ప్సియా అనే రుగ్మత స్టోవర్‌లో ఉందని, దీనివల్ల బీపీ ఎక్కువై కిడ్నీలు, కాలేయం పనితీరు మందగిస్తుందని, ఇది ప్రాణాలకే ప్రమాదమని వైద్యులు చెప్పడంతో స్టోవర్ దంపతులు ఆందోళనపడ్డారు.
48 గంటల్లో సర్జరీ.. తల్లీబిడ్డ క్షేమం..
వైద్యుల సూచన మేరకు స్టోవర్ వెంటనే ఆస్పత్రిలో చేరగా.. 48 గంటల్లో సర్జరీ చేసి తల్లీబిడ్డ ఇద్దరినీ వైద్యులు కాపాడారు. ఆమెకు ఒక కిలో 800 గ్రాముల బరువుతో మగబిడ్డ జన్మించాడు. కాగా, ఆరు నెలల గర్భిణి అయినా స్టోవర్ పొట్ట లావుగా బయటికి కనిపించకపోవడానికి ప్రీక్లామ్‌ప్సియా కారణం అయివుండవచ్చని వైద్యులు పేర్కొన్నారు. ఇలాంటివి అత్యంత అరుదుగా సంభవిస్తాయని డాక్టర్లు పేర్కొన్నారు.










