Aug 27,2023 11:29

వాషింగ్టన్‌ :   అమెరికాలో మరోసారి  జాతి విద్వేషం బుసలు కొట్టింది. నల్ల జాతీయులపై ఆగ్రహించిన ఓ అమెరికన్‌ ఫ్లోరిడా స్టోర్‌లో కాల్పులకు దిగాడు. ఈ ఘటనలో ముగ్గురు నల్ల జాతీయులు మరణించారు. అనంతరం ఆ వ్యక్తి కూడా ఆత్మహత్యకు పాల్పడినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన నల్ల జాతీయులు ఎక్కువగా నివసించే ఫ్లోరిడాలోని జాక్సన్‌విల్లేలో డాలర్‌ జనరల్‌ స్టోర్‌లో శనివారం జరిగింది. ఈ ఘటనను జాతి విద్వేపూరిత దాడిగా అనుమానిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ''అతను నల్ల జాతీయులపై ఆగ్రహంతో ఉన్నాడు. అతనికి ఎలాంటి విద్వేషపూరిత సమూహంలో భాగస్వామ్యం పేర్కొనేందుకు ఎటువంటి ఆధారాలు లేవు'' అని షెరీఫ్‌ టికె వాటర్స్‌ మీడియాతో మాట్లాడారు. 20 ఏళ్ల వయస్సున్న నిందితుడు గ్లాక్‌ హ్యాండ్‌గన్‌ మరియు ఎఆర్‌ -15 సెమీ ఆటోమేటిక్‌ రైఫిల్స్‌ను వినియోగించాడని, ఒకదానిపై స్వస్తిక్‌ చిహ్నం ఉందని అన్నారు. నిందితుడు ద్వేషపూరిత భావజాలానికి ప్రభావితమయ్యాడని.. ఈ దాడికి ప్రధాన కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలిన ఆధారాలు సూచిస్తున్నాయన్నారు. ఐదేళ్ల క్రితం జాక్సన్‌విల్లేలో వీడియో గేమ్‌ టోర్నమెంట్‌లో ఓ సాయుధుడు ఇద్దరి వ్యక్తులపై జరిపి అనంతరం తనని తాను కాల్చుకున్న సంగతి తెలిసిందే.