వాషింగ్టన్ : నాన్ బాస్మతి బియ్యంపై భారత్ విధించిన నిషేధం అమెరికాలోని ప్రవాసీయుల్లో (ఎన్‌ఆర్‌ఐ) ఆందోళనకు దారితీసింది. గతవారం భారత్ నిషేధాన్ని విధిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. బియ్యం ఎగుమతుల్లో ప్రధాన వాటా భారత్‌దే కావడంతో ప్రపంచ వ్యాప్తంగా ఇతర దేశాల్లోనూ ఆహార మార్కెట్‌లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. బియ్యం కొరత ఏర్పడవచ్చని ప్రవాసీయుల్లో ఆందోళన వ్యక్తమౌతోంది. అమెరికాలోని ప్రవాసీయులు పలు సూపర్‌మార్కెట్లలో బియ్యం కోసం క్యూల్లో నిలబడుతున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.
సోనా మసూరీ బియ్యం కోసం పదికి పైగా షాపుల్లో వెతికానని... ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 వరకు దాదాపు అన్ని షాపులు తిరిగానని వాషింగ్టన్‌కి చెందిన అరుణ మీడియాకు వివరించారు. చివరికి సాయంత్రానికి లభించినప్పటికీ... దాని ధర కన్నా మూడురెట్లు అధికంగా చెల్లించాల్సి వచ్చిందని అన్నారు. సోనా మసూరీ రైస్ కావాలంటూ అధిక ఫోన్ కాల్స్ వస్తున్నాయని సప్నా ఫుడ్స్ యజమాని తరుణ్ సర్దానా తెలిపారు. గతవారం నుండి సోనామసూరీకి డిమాండ్ అధికంగా ఉందని, అధిక మొత్తంలో కొనుగోలు చేస్తున్నారని అన్నారు.
ధరలు అధికమవడం, బియ్యం కొరత ఏర్పడవచ్చనే ఆందోళనలతో ముందు జాగ్రత్తగా అధిక మొత్తంలో కొనుగోలు చేస్తున్నారని అన్నారు. దీంతో ఒక్కసారిగా కొనుగోళ్లు పెరగడంతో డిమాండ్‌కు అనుగుణంగా ధరలు కూడా అమాంతం పెరిగాయని చెప్పారు. బియ్యం బస్తా అసలు ధర కన్నా రెండింతలు, మూడింతలు కూడా ఉంటోందని వివరించారు. హోల్‌సేల్ వ్యాపారులు, బియ్యం కంపెనీలు డిమాండ్‌కి అనుగుణంగా ధరలను సర్దుబాటు చేసేందుకు యత్నిస్తున్నాయని అన్నారు.
Rice bag NRIs standing in line to collect rice in the US,just like how they stand in front of a ration shop.pic.twitter.com/L0YqEwqrsa
— Брат (@B5001001101) July 25, 2023
;