Aug 15,2023 15:45

వాషింగ్టన్‌ :   ఉక్రెయిన్‌కు కొత్త 200 మిలియన్‌ డాలర్ల విలువైన రక్షణ సాయాన్ని అందించనున్నట్లు  అమెరికా సోమవారం ప్రకటించింది. వైమానిక రక్షణ ఆయుధాలు, యుద్ధ ట్యాంకులు, మోర్టార్లలో వినియోగించే భారీ బుల్లెట్లు, యుద్ధట్యాంకు పరికరాలతో పాటు ఈ సాయాన్ని అందించనున్నట్లు తెలిపింది. యాంటీ ఆర్మోర్‌ పరికరాలు కూడా పంపనున్నట్లు అమెరికా స్టేట్‌ సెక్రటరీ ఆంటోనీ బ్లింకెన్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పెంటగాన్‌ అకౌంటింగ్‌ లోపంతో గుర్తించిన 6.2 బిలియన్‌ డాలర్ల నిధులకు తగినట్లుగా ఆయుధాలను ఉక్రెయిన్‌కు సాయం కింద పంపనున్నట్లు గత సోమవారం ఇద్దరు అధికారులు మీడియాకి వెల్లడించిన సంగతి తెలిసిందే.

ఉక్రెయిన్‌కి పంపిన మందుగుండు సామాగ్రి, క్షిపణులు మరియు ఇతర పరికరాల విలువను అకౌంట్‌ చేసే సమయంలో సిబ్బంది ''తరుగుదల విలువ'' బదులుగా పొరపాటున ''భర్తీ విలువ''గా లెక్కించారని పేర్కొన్నారు. దీంతో ఉక్రెయిన్‌కు రవాణా చేయబడిన ఆయుధాలకు అధిక విలువను లెక్కించినట్లు తెలిపింది. దీంతో అకౌంటింగ్‌లో లోపం ఉక్రెయిన్‌కి లబ్థి చేకూర్చిందని... మరిన్ని ఆయుధాలను పంపుతున్నట్లు తెలిపారు. రష్యా చొరబాటును ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్‌కు ఆయుధాలు అవసరమని అన్నారు.