May 15,2023 13:55

ప్రజాశక్తి-కొండాపురం (కడప) : మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై చిత్రాధిని సమీపంలో సోమవారం ఉదయం ఐదు గంటల 15 నిమిషాల సమయంలో ఘోర దుర్ఘటన జరిగింది.

వివరాలు ఇలా ఉన్నాయి : మండలంలోని నిదరపేట గ్రామానికి చెందిన సుబ్బిరెడ్డి కుటుంబము గత 30 సంవత్సరాల క్రితం తాడిపత్రిలో నివాసం ఏర్పరచుకున్నారు. వీరి కుటుంబ సభ్యులు కొంతమంది కర్నాటక రాష్ట్రం బళ్లారి సమీపంలోని కంప్లీకొట్టాల ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. వీరందరూ శనివారం ఉదయం తాడపత్రిలో తుఫాన్‌ వాహనాన్ని AP02 TE0238 బాడుగకు తీసుకుని తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లారు. దర్శనానంతరం ఆదివారం తిరిగి ఇంటికి బయలుదేరారు. ఈ ప్రయాణంలో సోమవారం ఉదయం 5 గంటల 15 నిముషాల సమయంలో మరో 20 నిమిషాలలో తాడిపత్రికి తమ ఇళ్లకు చేరతాము అనుకునే లోపే వీరికి మృత్యువు సంభవించింది. తాడిపత్రి వైపు నుండి కడప వైపు వెళుతున్న పది టైర్ల భారీ వాహనము ఢీకొట్టడంతో వాహనంలో ప్రయాణం చేస్తున్న 14 మందిలో ఏడుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. దుర్మరణం పాలైనవారిలో నలుగురు మహిళలు, ఒక బాలుడు, ఓ అవివాహితుడు, డ్రైవరు ఉన్నారు. మిగిలిన ఏడుగురిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. గాయపడినవారిని పోలీసుల సహాయంతో అంబులెన్స్‌ వాహనాన్ని పిలిపించి తాడిపత్రికి పంపించారు. అక్కడి నుండి మెరుగైన వైద్యం కోసం అనంతపురం జిల్లా ఆస్పత్రికి పంపినట్లు సమాచారం. ప్రమాదానికి తాడిపత్రి వైపు నుండి కడప వైపు వెళుతున్న లారీ KA34C4185 డ్రైవర్‌ నిర్లక్ష్యం కనిపిస్తోంది.

                                              ప్రమాదానికి రోడ్డుపై పెద్ద పెద్ద గుంతలే కారణం : అక్కడి ప్రజలు

సోమవారం ఉదయం జాతీయ రహదారిపై జరిగిన దుర్ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందడంతో చుట్టుపక్కల గ్రామాల వారు తండోపతండాలుగా చేరుకొని ఆవేదనకు లోనయ్యారు. ఒకే కుటుంబానికి చెందినవారంతా మరణించడంతో అక్కడ బంధువుల ఆవేదన వర్ణనాతీతంగా ఉంది. ఈ ప్రమాదానికి మూల కారణం జాతీయ రహదారిపై అధికంగా గుంతలు ఏర్పడడమే.. అని మరో కారణమని ప్రజలు అంటున్నారు ప్రమాదం జరిగిన ప్రాంతంలో రోడ్డుపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి రోడ్డు మట్టి మీద వేయడంతో లారీ డ్రైవర్‌ తన వాహనాన్ని గుంతలలో పడకుండా తప్పించబోయి ఎదురుగా వస్తున్న తుఫాన్‌ వాహనాన్ని ఢీకొన్నట్లు కూడా తెలుస్తోంది.

                                                                        లారీ డ్రైవర్‌ పరార్‌...

ప్రమాదం జరిగిన వెంటనే లారీని అక్కడే ఉంచి లారీ డ్రైవర్‌ పరారయ్యాడు సంఘటన విషయాన్ని తెలియగానే కొండాపురం సిఐ సుదర్శన ప్రసాద్‌ ఎస్సై సత్యనారాయణ లో తమ సిబ్బందితో వెళ్లి ప్రమాద సంఘటనపై విచారణ జరుపుతూ ట్రాఫిక్‌ సమస్య లేకుండా వాహనాలు పంపించి వేశారు.

                                                               బంధువుల రోదన వర్ణనాతీతం..

ఘటనా స్థలాన్ని జమ్మలమడుగు ఆర్డీవో శ్రీనివాసులు, డిఎస్పి నాగరాజు పరిశీలించారు. సోమవారం ఉదయం కొండాపురం జాతీయ రహదారిపై ప్రమాద సంఘటన తెలియగానే జమ్మలమడుగు ఆర్డిఓ శ్రీనివాసులు తహశీల్దార్‌ శోభన్‌ బాబు, రెవెన్యూ సిబ్బంది, జమ్మలమడుగు డిఎస్పి నాగరాజు సంఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే ట్రాఫిక్‌ సమస్య లేకుండా చూడాలని తన కింది సిబ్బందికి సూచించారు. తమ బంధువులు మరణించిన వార్త తెలియగానే వారి వారి బంధువులు శవాల వద్ద కూర్చొని బోరును వినిపించారు. వారి రోదన వర్ణనాతీతము. బంధువుల నుండి వివరాలను సేకరించి అనంతరం పోలీసులు అంబులెన్స్‌ వాహనాలను పిలిపించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రికి తరలించారు.