
న్యూఢిల్లీ : భారత్ మాలా పరియోజన ఫేజ్-1 ప్రాజెక్టు కింద కేంద్రం నిర్మిస్తోన్న ద్వారకా ఎక్స్‌ప్రెస్ నిర్మాణ వ్యయం భారీగా పెరిగినట్లు కాగ్ సోమవారం పేర్కొంది. 2017లో ఆర్థిక వ్యవహారాల మంత్రుల కమిటీ (సిసిఇఎ) ఆమోదించిన వ్యయం కన్నా 14 రెట్లు అధికమైనట్లు ఓ నివేదికలో వెల్లడించింది. రద్దీ తగ్గించే ఉద్దేశంతో ఢిల్లీ-గురుగ్రామ్ మధ్య ఎన్‌హెచ్-48 నుండి సమాంతరంగా 14 లైన్ల రహదారి నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. కిలోమీటర్ రహదారికి రూ.18.20 కోట్ల వ్యయానికి సిసిఇఎ ఆమోదం తెలపగా.. కిలోమీటర్ నిర్మాణానికి రూ.250.77 కోట్లు ఖర్చయినట్లు కాగ్ తెలిపింది. రెండు రాష్ట్రాల మధ్య ట్రాఫిక్ దృష్ట్యా ద్వారకా ఎక్స్‌ప్రెస్ వేను అతి తక్కువ ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లతో ఎనిమిది రోడ్ల నిర్మాణంగా విస్తరించాలని నిర్ణయించినట్లు గతేడాది ఏప్రిల్‌లో కేంద్ర రోడ్డు రవాణా శాఖ ఇచ్చిన వివరణను కూడా కాగ్ ప్రస్తావించింది. నిర్మాణ వ్యయం భారీగా పెరగడానికి ఇదే ప్రధాన కారణమని పేర్కొన్నట్లు కాగ్ తెలిపింది.
రోజువారీగా 55,432 ప్యాసింజర్ వాహనాలు ప్రయాణిస్తాయనే లెక్కతో నిర్మించిన ఎనిమిది లైన్ల నిర్మాణానికి పక్కా ప్రణాళిక లేదని పేర్కొంది. రోజువారీగా 2,32,959 ప్యాసింజర్ వాహనాలు ప్రయాణించేందుకు ఆరు లైన్ల నిర్మాణం సరిపోతుందని తెలిపింది. కేవలం ద్వారకా ఎక్స్‌ప్రెస్ మాత్రమే కాదని, దేశ వ్యాప్తంగా భారత్‌మాలా పరియోజన కింద నిర్మించిన ప్రాజెక్టుల్లో చాలా వరకు ఆమోదం పొందిన వ్యయం కంటే 58 శాతం అధికంగా ఖర్చయ్యాయని కాగ్ వెల్లడించింది. 26,316 కి.మీ పొడవు ప్రాజెక్టుకు మంజూరైన వ్యయం రూ. 8,46,588 కోట్లు (కి.మీకి రూ.32.17 కోట్లు) కాగా, సిసిఇఎ 34,800 కి.మీ పొడవు ప్రాజెక్టు కోసం రూ.5,35,000 కోట్లు (కి.మీకి రూ.15.37 కోట్లు) ఆమోదించింది. పైగా ప్రాజెక్టు వ్యయం భారీగా పెరిగినా గతేడాదితో రహదారి నిర్మాణం పూర్తి కావలసి ఉంది. డెడ్ లైన్ ముగిసినా ఇప్పటికీ నిర్మాణం పూర్తి కాలేదని తెలిపింది. ఈ ఏడాది మార్చి 31 నాటికి కేవలం 13,499 కి.మీ రహదారి మాత్రమే పూర్తయిందని అన్నారు. అన్ని ప్రాజెక్టులు ఇదే విధంగా ఉన్నట్లు కాగ్ పేర్కొంది.