
- అనుభవం లేకున్నా అదానీ కన్సార్టియంకు పనులు
- జాబితాలో బిజెపి నేత కంపెనీ కూడా..
- కాషాయ పార్టీకి విరాళాలు అందించిన మరో నాలుగు కంపెనీలకూ పనులు
- వీటి నుంచి రూ.77 కోట్లకు పైగా విరాళాలు
- యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘనలు
మోడీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జాతీయ రహదారుల విస్తరణ కార్యక్రమం భారత్‌మాల ప్రాజెక్టు మొదటి దశ పనుల్లో అవకతవకలు చోటు చేసుకున్నాయా? అదానీ కంపెనీలకు లబ్ది చేకూరే ప్రయత్నాలు జరిగాయా? బిజెపి నాయకుడి కంపెనీ కూడా ఇందులో ఉన్నదా? కాషాయ పార్టీకి విరాళాలు అందించిన కంపెనీలూ దీని కింద లబ్దిని పొందాయా? అంటే కాగ్ నివేదిక అవుననే చెపుతున్నది. అదానీ నేతృత్వంలోని కన్సార్టియంతో పాటు మరికొన్ని కంపెనీలు భారత్‌మాల ప్రాజెక్టు మొదటి దశ కింద నిబంధనలు ఉల్లంఘించి మరీ టెండర్లను పొందాయని తెలుస్తున్నది. సరైన అనుభవం లేనప్పటికీ రోడ్డు నిర్మాణ ప్రాజెక్టులను దక్కించుకున్నట్టు కాగ్ నివేదిక వెల్లడిస్తున్నది. ఈ ప్రాజెక్టు కింద పనులను పొందిన కంపెనీలకు కేంద్రంలోని అధికార బీజేపీతో ప్రత్యంక్షంగానో, పరోక్షంగానో సంబంధాలు ఉన్నట్టు తెలుస్తున్నది.
న్యూఢిల్లీ : మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చాక..కార్పొరేట్లను ప్రసన్నం చేసుకోవటంలోనే తలమునకలైంది. పార్టీకి విరాళాలిచ్చే పెద్దలకు కావాల్సిన పనులను అప్పగించేందుకు వెనుకాడటంలేదు. దీనికి ఉదాహరణకు అదానీ ట్రాన్స్‌పోర్ట్ నేతృత్వంలోని కన్సార్టియం... హైబ్రిడ్ యాన్యుటీ మోడల్‌లో తెలంగాణలోని సూర్యాపేట నుంచి ఖమ్మం మధ్య జాతీయ రహదారిని నాలుగు-లేన్‌లుగా చేసే ప్రాజెక్ట్‌ను పొందింది. అయితే, హైవే సెక్టార్‌లో నిర్మాణ పనుల్లో అనుభవం కలిగి ఉండాలనే షరతు ఉన్నది. దానిని అదానీకి చెందిన కంపెనీ సంతృప్తిపర్చలేదు. అయినప్పటికీ అదానీ కన్సార్టియంకే ఈ ప్రాజెక్టు అందటం గమనార్హం. అలాగే, బీజేపీ నాయకుడు నవీన్ జైన్ ప్రమోట్ చేసిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ అయిన పీఎన్‌ఆర్ ఇన్ఫోటెక్‌కు 2019 ఆగస్టులో లక్నో రింగ్ రోడ్ యొక్క ప్యాకేజీ 1 కాంట్రాక్ట్‌ను మొదట అంచనా వేసిన దానికంటే 17.44 శాతం అధిక ధరతో అందించారు. బిడ్ ధర సవరించిన అంచనాల కంటే 2.02 శాతం పెరిగింది. ఆ సమయంలో జైన్ ఆగ్రా మేయర్‌గా ఉండటం గమనార్హం. దీంతో ఇందులో అధికార దుర్వినియోగం కూడా జరిగిందనే ఆరోపణలు వచ్చాయి.
2013 నుంచి 2021 మధ్య కాలంలో బీజేపీకి రూ. 77 కోట్లకు పైగా విరాళం ఇచ్చిన నాలుగు కంపెనీలు ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్, జె కుమార్ ఇన్‌ఫ్రాప్రాజెక్ట్స్, లార్సెన్ అండ్ టూబ్రో, ఎంకేసీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్‌లతో అక్రమాలకు పాల్పడినట్టు కాగ్ నివేదిక పేర్కొన్నది.
అదానీ ట్రాన్స్‌పోర్ట్ కన్సార్టియం
కన్సార్టియంలో అదానీ సంస్థకు 74 శాతం సింహభాగం ఉన్నది. అయితే, సదరు కన్సార్టియం హైవే సెక్టార్‌లో నిర్మాణ పనుల్లో ఐదేండ్ల అనుభవానికి సంబంధించిన షరతును నెరవేర్చలేదు. బిడ్డర్ సమర్పించిన పనుల జాబితా ప్రకారం కంపెనీ ''ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా'' ఎటువంటి నిర్మాణ పనులను ఎప్పుడూ నిర్వహించలేదు. ఏది ఏమైనప్పటికీ, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ) 2019 మార్చిలో రూ. 1,566.30 కోట్ల బిడ్ ప్రాజెక్ట్ వ్యయంతో ఎటువంటి అభ్యంతరాలు లేకుండా బిడ్డర్ సాంకేతికంగా అర్హత సాధించినట్టు ప్రకటించించటం గమనార్హం. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ కింద, ప్రాజెక్ట్‌పై మొత్తం వ్యయంలో 40 శాతం ఎన్‌హెచ్‌ఏఐ చెల్లించింది. మిగిలిన 60 శాతం రోడ్ డెవలపర్ ద్వారా సమకూరుతుంది. కాగ్ నివేదికలో ఉన్న ఆరోపణలను అదానీ గ్రూప్ అధికార ప్రతినిధి తోసిపుచ్చారు.
బిజెపి నేతకు సంబంధించిన కంపెనీ
2019, మార్చి 7న లక్నో రింగ్ రోడ్ ప్యాకేజీ 1 కోసం రూ. 904.31 కోట్ల అంచనా వ్యయంతో బిడ్‌లు జరిగాయి. విచిత్రమేమిటంటే, పీఎన్‌సీ ఇన్ఫోటెక్‌కు రూ. 1,062 కోట్లకు కాంట్రాక్టు లభించింది. ఇది అసలు అంచనా కంటే 17.44 శాతం ఎక్కువ. ఎన్‌హెచ్‌ఏఐ అసలు అంచనాలు 2016-17 షెడ్యూల్డ్ రేట్ల ఆధారంగా ఉన్నాయి. ప్రాజెక్ట్ అంచనా వ్యయం తదనంతరం 2019 రేట్ల ఆధారంగా సవరించబడింది. అయితే, కాగ్ నివేదికలో వివరించిన విధంగా, జైన్ కంపెనీ బిడ్ అంచనాలను 2.02 శాతం మించిపోయింది.
ఐఆర్‌బి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నుంచి బిజెపికి రూ.65 కోట్లు విరాళం
హాపూర్ బైపాస్-మొరాదాబాద్ హైవే ప్రాజెక్ట్ కోసం 68 శాతం తక్కువ ప్రీమియంతో ఎన్‌హెచ్‌ఏఐ కాంట్రాక్ట్‌ను గెలుచుకున్న ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్.. 2013 నుంచి బీజేపీకి సుమారు రూ. 65 కోట్లు విరాళంగా అందించింది. 97.77 కోట్ల వార్షిక ప్రీమియం, 22 సంవత్సరాల రాయితీ వ్యవధితో ఎన్‌హెచ్‌ఏఐ ప్రాజెక్ట్ కోసం బిడ్లను ఆహ్వానించారు. అయితే, 2018 మార్చిలో, ప్రభుత్వ ఏజెన్సీ కేవలం రూ. 31.50 కోట్ల వార్షిక ప్రీమియంతో ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బిడ్‌ను ఆమోదించించటం గమనార్హం. ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ 2020-21లో బిజెపికి రూ.20 కోట్లు విరాళంగా అందించగా, దాని సంబంధిత మూడు కంపెనీలు 2013 నుంచి 2021 మధ్య కాలంలో బిజెపికి దాదాపు రూ. 45 కోట్లు విరాళంగా అందించాయి.
జే కుమార్ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ నుంచి కాషాయ పార్టీకి రూ.6.46 కోట్లు విరాళం
2018, డిసెంబర్ 2018లో జే కుమార్ ఇన్‌ఫ్రాప్రాజెక్ట్స్ ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే ప్యాకేజీ 1 కోసం రూ. 1,349 కోట్ల కాంట్రాక్ట్‌ను గెలుచుకున్నది. ప్రతిపాదిత షరతు అభ్యర్థనను నెరవేర్చడంలో కంపెనీ విఫలమైనప్పటికీ ఇది జరిగిందని కాగ్ నివేదిక పేర్కొన్నది. 2013 నుంచి 2018 మధ్య, జే కుమార్ ఇన్‌ఫ్రాప్రాజెక్ట్స్ బీజేపీకి దాదాపు రూ. 6.46 కోట్లు విరాళంగా అందించింది. 2017-18లో రూ.5.25 కోట్లు, 2015-16లో రూ.కోటి, 2013-14లో రూ.21 లక్షలు ఇచ్చింది. 2015 రోడ్డు స్కామ్‌కు సంబంధించి జే కుమార్ ఇన్‌ఫ్రాప్రాజెక్ట్‌ను 2016లో బృహన్‌ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ బ్లాక్‌లిస్ట్ చేసింది.
ఎంకెసి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, లార్సెన్ అండ్ టూబ్రో ద్వారా విరాళాలు
ఢిల్లీ-వడోదర ఎక్స్‌ప్రెస్‌వేకి సంబంధించి చోటు చేసుకున్న అవకతవకలను కూడా కాగ్ ఎత్తి చూపింది. బిడ్‌లు తప్పుడు అంచనాల ఆధారంగా ఆహ్వానించబడ్డాయని వివరించింది. ఈ ప్రాజెక్టుతో సంబంధమున్న కంపెనీల నుంచి కూడా బీజేపీకి విరాళాలు అందాయి. 2014-15లో లార్సెన్ అండ్ టూబ్రో బీజేపీకి రూ. 5 కోట్లు విరాళంగా ఇచ్చిందని తేలింది. 2018 నుంచి 2020 మధ్యకాలంలో ఎంకేసీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కాషాయ పార్టీకి రూ.75 లక్షలు విరాళంగా అందించింది. బీహార్‌లోని కిషన్‌గంజ్‌లో నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోవడంతో జిఆర్ ఇన్‌ఫ్రాప్రాజెక్ట్ గతేడాది జూన్‌లో వెలుగులోకి వచ్చింది.