
- కేవలం స్పర్శతోనే అక్షరాలను గుర్తు పట్టి.. చదివేందుకు వీలుగా అంధులకు ఓ లిపిని కనిపెట్టారు లూయిస్ బ్రెయిలీ. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఎందరో అంధులు చదువుకుంటున్నారు. అనేక ఉన్నత పదవులను చేపట్టి తాము ఎవరికీ ఏ విధంగా తీసిపోని స్థాయికి ఎదుగుతున్నారు. అందుకు ఉదాహరణగా నిలుస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ళ మండలం పెద అమిరం మెయిన్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు దొండపాటి ప్రసన్న భారతి. ఆమె పుట్టుకతోనే అంధురాలు. పట్టుదలతో చదువుకున్నారు. దృఢ సంకల్పంతో ముందుకు సాగారు. ఉన్నత విద్యాభ్యాసం పూర్తిచేసి, ఉపాధ్యాయినిగా వృత్తిలో చేరి, ఇప్పుడు ప్రధానోపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. ఆమెతో పాటు పాఠశాలలో పనిచేసే మిగతా ఉపాధ్యాయులంతా కళ్లు ఉన్న వారే.. ఈమె ఒక్కరే అంధత్వంతో ఉన్నారు. అయితేనేం ఆత్మ విశ్వాసంతో తాను నేర్చుకున్న అంధుల లిపితో ఏదైనా ఇట్టే గుర్తు పట్టేయగలరు. లోపాలుంటే వెంటనే చెప్పేస్తారు. సరిచేయాలని సూచిస్తారు.
సంకల్ప బలం ఉంటే ఏదైనా సాధించొచ్చునని నిరూపించారు ప్రసన్న భారతి. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ప్రాంతానికి చెందిన డాక్టర్ డి.చంద్రయ్య (రిటైర్డ్ మెడికల్ ఆఫీసర్), తల్లి సరోజినీ దేవిలకు ఆరో సంతానంగా ప్రసన్నభారతి జన్మించారు. పదో తరగతి వరకు ఆంధ్రా బ్లైండ్ మోడల్ స్కూల్లో చదివారు. ఇంటర్ నరసాపురంలో, డిగ్రీ రాజమండ్రి వైఎన్ కాలేజీలో, బిఇడి అద్దేపల్లి మహాలక్ష్మి కాలేజీలోపూర్తి చేశారు. తరువాత ఆంధ్రా యూనివర్శిటీలో ఎంఎ చదివారు. 2004లో ఉపాధ్యాయరాలిగా నియమితురాలై దెయ్యాల తిప్ప పాఠశాలలో పనిచేశారు. తరువాతమొగల్తూరు, దేవునితోట పాఠశాలల్లో విద్యాబోధన చేశారు. ఉద్యోగోన్నతిపై పెద అమిరం మెయిన్ ప్రాథమిక పాఠశాలకు బదిలీ అయ్యి ప్రధానోపాధ్యాయురాలుగా విధులు నిర్వహిస్తున్నారు.
- పుట్టుకతోనే అంధురాలు
ప్రసన్న భారతికి పుట్టినప్పటి నుంచే కంటి చూపు లేదు. పాఠశాల వయసు వచ్చాక తల్లిదండ్రులు ఆమెకు అంధుల ప్రత్యేక పాఠశాలలో బ్రెయిలీ లిపిలో చదువు కొనసాగించారు. తల్లిదండ్రుల సహకారం, వారిచ్చిన ఆత్మవిశ్వాసం భారతిని ముందుకు నడిపించాయి. ఆత్మన్యూనతా భావానికి గురికాకుండా వారు కుమార్తెని నిరంతరం ప్రోత్సహిస్తూ ముందుకు నడిపించారు. చదువులో మామూలు విద్యార్థులతో పోటీ పడిన ప్రసన్న భారతి ఏ రోజూ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఉద్యోగం వచ్చాక వివాహమైంది. భర్త సహాయంతో ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్నారు. శరీరంలో అన్ని అంగాలు సక్రమంగా ఉన్నా ఏమీ చేయలేమని, తల్లిదండ్రులకు భారంగా మారుతున్న ఎంతో మంది యువత ఉన్న నేటి రోజుల్లో, అన్నింటిలోకి ప్రధానమైన కళ్ళు లేకున్నా, పట్టుదల, సంకల్పబలం ఉంటే ఏదైనా సాధించొచ్చునని నిరూపించిన ప్రసన్న భారతి ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు.

- ఆంగ్లంపై ఆసక్తి పెంచుతూ ...
ప్రసన్న భారతి విద్యాబోధనలో ఎంతో సృజనాత్మకంగా కృషి చేస్తున్నారు. విద్యార్థుల అంతర్గత నైపుణ్యాలు, వ్యక్తిగత, తరగతి గది సామర్థ్యాలను వెలికితీయడం, ఆంగ్లంపై ఆసక్తి పెంచుకునేలా కృత్యాధార బోధనను అవలంబిస్తున్నారు. పలు రకాల కృత్యాలు తయారు చేయడం.. వాటిని తరగతి గదిలో ప్రదర్శించడం.. విద్యార్థులతో స్వయంగా తయారు చేయించడం ఆమె ప్రత్యేకత. ప్రాథమిక విద్యార్థులు భవిష్యత్తులో రాణించేందుకు ఆటలు, పాటలు, చిత్రాలతో బోధన చేస్తున్నారు. పాఠ్య పుస్తకాల్లోని బొమ్మలు గీయించడం, గేయాలు రాయించడం, చదవడం, రాయడం అనే ప్రక్రియలతో పాటు విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీసే వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. సమాజం, జీవనం, పర్యావరణం, టెక్నాలజీ, చరిత్ర, పరిశుభ్రత వంటి వాటితోపాటుగా మనిషి జీవన విధానానికి అవసరమయ్యే విషయాలను కథల రూపంలో బోధిస్తున్నారు. ఆమె వద్ద విద్యాబుద్ధులు నేర్చుకున్న ఎంతో మంది విద్యార్థులు నవోదయ పరీక్షలకు ఎంపికయ్యారు. హెచ్‌ఎంగా నాడు-నేడు పనులను సమర్థవంతంగా నిర్వహించారు. దాతల సహకారంతో పుస్తకాలు, బ్యాగులు, టైలు, గుర్తింపుకార్డులు వంటివి అందించటానికి తనవంతుగా కృషిచేస్తున్నారు. 100 సంవత్సరాల చరిత్ర కలిగిన పాఠశాలలో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థినీ విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు. బైర్రాజు పౌండేషన్ సాయంతో కంప్యూటర్ శిక్షణ ఏర్పాటు చేస్తున్నారు.
- సృజనాత్మక శక్తుల వెలికితీతకు ప్రాధాన్యం
2004లో దెయ్యాలతిప్పలో ఉపాధ్యాయినిగా విధుల్లో చేరిన ప్రసన్నభారతి విద్యార్థుల్లోని సృజనాత్మక శక్తులను వెలికితీయటానికి నిరంతరం కృషిచేస్తున్నారు. వారిలో ఆల్‌రౌండ్ అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు. ప్రాథమికస్థాయి పిల్లల్లో భాషాభివృద్ధికి కృషి చేయడంతో ప్రశంసాపత్రాన్ని కూడా అందుకున్నారు. బోధనోపకరణాలతో విద్యార్థులకు అర్థమయ్యేలా పాఠాలు చెబుతున్నారు. ప్రసన్న భారతికి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయినిగా అవార్డు అందుకున్నారు. సంకల్పం జిల్లా బెస్ట్ స్కూలు అవార్డులను మూడుసార్లు సాధించారు. తాను కళ్లతో చూడని ప్రపంచాన్ని తన విద్యార్థులకు సచిత్రంగా, సమగ్రంగా పరిచేయం చేస్తూ ... వారి అభ్యున్నతికి తోడప్పడుతున్న ప్రసన్న భారతి కృషి అభినందనీయం.
- మరింత బాధ్యత పెరిగింది
ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నాను. అంధురాలనే భయంగానీ, బాధగానీ లేదు. పుట్టుకతో వచ్చిన సమస్యను తల్లిదండ్రుల సహకారంతో అధిగమించాను. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దటానికి నావంతుగా కృషిచేస్తున్నాను. జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావడంతో నా బాధ్యత మరింత పెరిగింది. వందేళ్ళ చరిత్ర కలిగిన పాఠశాల్లో పనిచేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఉపాధ్యాయ బాధ్యతలు నూరుశాతం నిర్వర్తించడానికి శాయశక్తుల కృషి చేస్తున్నాను.
- దొండపాటి ప్రసన్నభారతి
- గొట్టేటి శ్రీనివాసులు
ప్రజాశక్తి కాళ్ళ విలేకరి, పశ్చిమ గోదావరి జిల్లా