Nov 15,2023 09:22

కుందేలు, తాబేలు, ఉడుత మంచి స్నేహితులు. కుందేలుకి కంగారెక్కువ. ఆలస్యం అమృతం విషం అంటుంది. తాబేలు ఏమో నిదానమే ప్రధానం అంటుంది. ఉడుత మాత్రం సమయానుకూలంగా, ముందు చూపుతో సమయస్ఫూర్తిగా నడుచుకోవాలి అంటుంది.
ఉడుతతో ఏకీభవించకుండా కుందేలు, తాబేలు తమ వాదనలే సరైనవని విభేదించేవి. ఒకరోజు నిదానమే ప్రధానం అనుకుంటూ వెళుతున్న తాబేలుపై తోడేలు దాడి చేయబోయింది. అది గమనించిన ఉడుత చెట్టు చాటునుంచి సింహాన్ని అనుకరిస్తూ గర్జించింది. తోడేలు తనకి సింహం నుండి ముప్పు వాటిల్లుతుందని తాబేలును వదిలేసి పలాయనం చిత్తగించింది. అంతలో అటు కంగారుగా వస్తున్న కుందేలు ఆలస్యం అమృత విషం అనుకుంటూ దారిలో గమనించకుండా ఊబిలో చిక్కుకుంది. ఊడలు పట్టుకుని ఊగుతున్న ఉడుత కుందేలును చూసి ఒక ఊడను ఊబిలోకి అందించింది. ఊడను పట్టుకుని కుందేలు బతుకు జీవుడా అంటూ ఊబిలోంచి బయట పడింది.
ముందు చూపుతో సమయస్ఫూర్తిగా నడుచుకోకపోతే ప్రమాదం వాటిల్లుతుందని ఉడుత వాదనే సరైనదని తెలుసుకున్న కుందేలు, తాబేలు ఆ రోజు నుండి తాము కూడా సమయస్ఫూర్తిగా నడుచుకోవడం నేర్చుకున్నాయి.
- కయ్యూరు బాలసుబ్రమణ్యం
9441791239