Jun 15,2023 16:50

ప్రజాశక్తి-నందిగామ : నందిగామ పట్టణంలోని 19వ వార్డు అనాసాగరంలో ముత్యాలమ్మ గుడి వద్ద 15వ ఆర్ధిక సంఘం నిధులు రూ.3 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించనున్న సీసీ డ్రైనేజీ, కల్వర్టు నిర్మాణ పనులకు నందిగామ శాసనసభ్యులు మొండితోక జగన్ మోహన్ రావు గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నందిగామ పట్టణ అభివృద్ధిలో భాగంగా 1, 19 మరియు 20వ వార్డుల పరిధిలో గల అనాసాగరంలో మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గ్రామీణ వాతావరణం తలపించే అనాసాగరంలో ఇప్పటికే కోటి రూపాయల నిధులతో వైయస్సార్ అర్బన్ హెల్త్ క్లినిక్ ను, ఓపెన్ జిమ్ ను, ప్రత్యేక వాటర్ లైన్ ఏర్పాటు చేశామని, అదేవిధంగా సీసీ డ్రైనేజ్ లు, సిసి రోడ్లు మరియు కల్వర్టుల నిర్మాణాలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించామన్నారు. దానితో పాటు అనాసాగరం జడ్పీహెచ్ఎస్ పాఠశాలకు కోటి రూపాయలు నిధులతో నాడు నేడు కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామన్నారు. ముఖ్యంగా అనాసాగరం అభివృద్ధికి అధిక ప్రాధాన్యమిస్తున్నామని, త్వరలోనే మరిన్ని నిధులు కేటాయించి అనాసాగరాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు అమలు చేస్తున్నామని తెలిపారు. గత చంద్రబాబు ప్రభుత్వం మాదిరిగా శిలాఫలకాలు వేసి ప్రజలను మోసం చేయకుండా వేగవంతంగా పనులు ప్రారంభించి నాణ్యత ప్రమాణాలతో చేపట్టిన పనులను పూర్తి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ మహమ్మద్ మస్తాన్, మున్సిపల్ కమిషనర్ డాక్టర్ జయరామ్, ఏఈ ఫణి శ్రీనివాస్, కౌన్సిలర్ లు ముందా మరియమ్మ, పాకాలపాటి కిరణ్ ,సొసైటీ అధ్యక్షులు పాములపాటి రమేష్, కర్రీ రవీంద్ర, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ గుడివాడ సాంబశివరావు, పట్టణ పార్టీ అధ్యక్షులు దొంతిరెడ్డి దేవేందర్ రెడ్డి, యాకుబ్ అలీ, కో ఆప్షన్ సభ్యులు మన్నెం దాసు, షేక్ జాఫర్, చాపల మల్లికార్జునరావు, చిరుమామిళ్ల చిన్ని, షేక్ కరీముల్లా, బండారు వెంకటరావు, పిల్లి జయరాజు తదితరులు పాల్గొన్నారు .