Sep 15,2022 05:54

భారతదేశం ఆర్థికాభివృద్ధిలో ప్రపంచంలోనే ముందు వరుసలో వుందని విపరీతమైన ప్రచారం చేస్తున్నారు. ఇది నిజమా? అంటే ఇది పచ్చి అబద్ధం అని భారత సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక పరిణామాలు తెలియజేస్తున్నాయి. ప్రధానంగా భారతదేశం కులాన్ని నిర్మూలించకుండా అభివృద్ధి చెందదు. 140 కోట్లలో 10 కోట్ల మంది ఎదుగుదలను అభివృద్ధిగా చూపడం ఆశ్చర్యకరమైన విషయం. నిజానికి దేశంలో సుమారు 40 కోట్ల మందికి ఎటువంటి ఉపాధి లేదు.
దేశంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ బాగా కుంటుబడుతున్నది. దళితవాడల్లో ఎక్కువగా ఏకోపాధ్యాయ పాఠశాలలే. అనేక గిరిజన వాడల్లో పాఠశాలలు లేవు. దళితవాడల్లోని పాఠశాలలు నడవడం లేదు.
రాష్ట్రాల హక్కులను కాలరాసి రాష్ట్రాలకు రావలసిన పన్నులను కూడా కేంద్రం గుత్త సొత్తుగా దోపిడీ చేస్తున్నది. ఈ క్రమంలో కేంద్రం ఆదాయం పటిష్టమైనట్టుగా చూపిస్తున్నది. కార్పొరేట్‌ శక్తులకు దేశ సంపదను, శక్తిని ధారాదత్తం చేసే విధానాలతో వలస కూలీల వ్యవస్థను పెంచి...ఒక చోట పని దొరకని పరిస్థితి కల్పించింది.
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలపై అనేక అంశాలకు సంబంధించి విపరీతమైన ఒత్తిడి తీసుకు వస్తున్నది. బి.జె.పి యేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులపై సి.బి.ఐ దాడులు జరిపించి భయభ్రాంతులను చేయడం ద్వారా అభివృద్ధి సాధించగలరా! మహారాష్ట్రలో ఏం జరిగింది? శివసేనను చీల్చి...ఒక ముక్క వెనక బి.జె.పి చేరింది. కర్ణాటకలో సావర్కర్‌ వివాదం రేపి ముస్లింలను భయభ్రాంతులను చేస్తున్నది. బిజెపి పాలనలో ముస్లింలు, క్రైస్తవులు, బౌద్ధులు, మహిళలు భయంతో బతుకుతున్నారు. ప్రజలు భయభ్రాంతులు అయ్యాక ఉత్పత్తిలో భాగస్వాములు ఎలా అవుతారు? ప్రధానమైన తోలు ఎగుమతుల మీద, మాంసం ఎగుమతుల మీద దాడులు చేసి దళితులను, ముస్లింలను వేటాడుతున్నారు. అనేక ఆంక్షలు పెట్టి భయపెడుతున్నారు. శ్రమలో భాగస్వామ్యం లేని స్వాములకు, యోగులకు, బాబాలకు భూములు పంచిపెడుతున్నారు. అలా పంచిపెట్టడం వలన దేశం అభివృద్ధి చెందుతుందా? అభివృద్ధిలో ప్రధానమైన గిరిజనోత్పత్తులకు ఎగుమతి విధానం లేకుండా చేశారు.
స్త్రీలను ఉత్పత్తి రంగం నుండి తరిమి వేస్తున్నారు. మహిళలకు బ్యాంకు లోన్లు ఇవ్వడం లేదు. పెద్ద పెద్ద కంపెనీల సి.ఇ.ఓ లను చూపించి స్త్రీలు అభివృద్ధి చెందారని చెబుతున్నారు. దళిత స్త్రీలు పని కోసం రైలు ఎక్కితే కేసులు పెడుతున్నారు. గరీబోళ్ళకు రైళ్ళు లేవు. పేదలకు బస్సులు లేవు. అంతా ఏసీల మయం. అవన్నీ టిక్కెట్టు రిజర్వ్‌ చేసుకునే పైతరగతులకే. వలస కార్మికులకు ఎక్కడా బస్సులు లేవు. వారు కాంట్రాక్టర్ల చేతుల్లో నలిగిపోతున్నారు. వలస కార్మికులకు ప్రతి ప్రాంతంలోను భోజన వసతితో సహా నివాస శిబిరాలు ఏర్పాటు చేయాలి.
దేశంలో ఆర్థికాభివృద్ధి జరగాలంటే దళితులకు భూమి పంపకం చేయాల్సి వుంది. ప్రతి ఊరు లోను కుటీర పరిశ్రమలు పెట్టి అక్కడ తయారైన వస్తువులను ప్రపంచ మార్కెట్టులో అమ్మే విధానాన్ని రూపొందించాల్సి వుంది. సమాజంలోని నిరక్షరాస్యులుగా వున్న వారందరికీ ఆధునిక టెక్నాలజీతో కూడిన విద్య కావాల్సి వుంది. విద్య అంటే సామాజిక, సాంస్కృతిక నిజమైన విద్య. మౌఖిక విద్య కూడా నిజమైన విద్యే.
దేశం మొత్తం ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ జరుపుకుంటున్న వేళ...దేశ ప్రధాని ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఈ దేశ మహిళల హక్కులు, గౌరవం స్త్రీ శక్తి అంటూ, మాట్లాడిన కొన్ని గంటల తర్వాత (ఆగష్టు 15వ తేదీ మధ్యాహ్నం)...బిల్కిస్‌ బానోతో పాటు దేశ ప్రజలందరూ నిర్ఘాంతపోయే దారుణ వార్త మీడియా ద్వారా బయటికొచ్చింది. తనకు, తన కుటుంబానికి జరిగిన అన్యాయం మీద సుదీర్ఘ కాలంగా న్యాయ పోరాటం చేస్తున్న బిల్కిస్‌ బానో ఈ దుర్వార్తను వినాల్సి వచ్చింది. పదిహేడేళ్ళ క్రితం బిల్కిస్‌ బానో మీద సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆమె కుటుంబ సభ్యుల మీద అత్యాచారం చేసి చంపేసిన నేరస్థులకు, 'క్షమాభిక్ష' పెట్టి గుట్టుచప్పుడు కాకుండా జైలు నుండి విడుదల చేసింది గుజరాత్‌ ప్రభుత్వం. ఈ దుర్మార్గమైన వార్త విన్న బిల్కిస్‌తో పాటు మొత్తం గ్రామమంతా భయాందోళనలతో వణికిపోయింది. అన్నింటినీ మించి కరకు పాషాణాల్లాంటి 11 మంది నేరస్తులకు స్వీట్లు తినిపించి, పూలదండలేసి బయటి ప్రపంచంలోకి ఆహ్వానించిన తీరును టీవీల్లో, సోషల్‌ మీడియాల్లో చూసిన బిల్కిస్‌ మనసులో చెలరేగిన కల్లోలం, కలిగిన అవమానం, ఆందోళనను తూచడానికి ఏ కొలమానమూ లేదు. పదిహేడు సంవత్సరాలుగా ఆమె గుండెల్లో గూడుకట్టిన గాయాన్ని క్రూరంగా కెలికిన ఈ దేశ న్యాయ వ్యవస్థ వేసుకున్న మనువాద ముసుగు మెల్లగా జారిపోయిన దృశ్యాలుగా కనిపించాయి. ఇది సిగ్గుపడాల్సిన విషయమని మహిళా సంఘాలు గళం విప్పి మాట్లాడుతున్నాయి. ఈ ఘటన భారతదేశంలో స్త్రీ అణచివేతకు నిలువెత్తు సాక్ష్యం.
మరోపక్క దళితులు కాంట్రాక్ట్‌ లేబర్‌ గానూ గృహ నిర్మాణ కార్మికులుగాను, మున్సిపల్‌ వర్కర్లుగానూ పని చేస్తూ, పట్టణాల్లో, మురికివాడల్లో జీవిస్తున్నారు. బీహార్‌, ఉత్తరప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌ రాష్ట్రాల్లోని దళితులు ఇతర రాష్ట్రాలకు పెద్ద ఎత్తున కూలీలుగా వలస వెళ్తున్నారు.
డా|| బి.ఆర్‌. అంబేద్కర్‌ ఆర్థిక శాస్త్రవేత్త. ఆయన ప్రభుత్వ రంగ సంస్థలను విస్తృతం చేయాలని చెప్పాడు. ఇప్పుడవి తాకట్టులోకి వెళ్తున్నాయి. అంబేద్కర్‌ భూమిని, పరిశ్రమలను జాతీయం చేయాలని చెప్పాడు. అవన్నీ కార్పొరేట్‌ చేతిలోకి వెళ్తున్నాయి. అంబేద్కర్‌ రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని చెప్పాడు. ముఖ్యంగా అస్పృశ్య భారతాన్ని విముక్తి చేసి స్పృశ్య భారతంగా చేయాలన్నాడు. ఇప్పటికీ 40 శాతం గ్రామాల్లో అస్పృశ్యత తీవ్రంగా వుంది. వారిని ఉత్పత్తి రంగంలోకి రానివ్వడం లేదు. ఉత్పత్తి వారి బానిసత్వాన్ని నిర్మూలిస్తుంది. ఉత్పత్తి లేని భారతం దారిద్య్రపు ఊబిలో కూరుకుపోయింది. శ్రమ, మానవ వనరులు, మానవ విలువల సమన్వయంతో ముందుకు సాగినప్పుడే అభివృద్ధి చెందిన భారతం ఏర్పడుతుంది. అప్పుడే ఆర్థిక పరిపుష్టి గలిగిన భారతదేశం ఏర్పడుతుంది.

katti padmarao
(వ్యాసకర్త: సామాజిక దళిత ఉద్యమ నాయకులు,
సెల్‌ : 9849741695)