Sep 11,2023 11:21

న్యూయార్క్‌ :   విశేష ప్రాచుర్యం పొందిన పవర్‌పాయింట్‌ ప్రెజెంటేషన్‌ సహసృష్టికర్త డెన్నిస్‌ అస్టిన్‌ (76) ఆదివారం మృతి చెందారు. కొంతకాలంగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్న అస్టిన్‌ కాలిఫోర్నియాలో మరణించారని ఆయన కుమారుడు మైఖేల్‌ అస్టిన్‌ మీడియాకు వెల్లడించారు. ఎంఐటిలో ఇంజనీరింగ్‌ పూర్తిచేసిన అస్టిన్‌ ఫోర్‌థాట్‌లో సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌గా పనిచేశారు.

టెక్నాలజీ రంగంలో విశేష సేవలందించిన అస్టిన్‌ పవర్‌పాయిట్‌ కో డెవలపర్‌గా గుర్తింపు పొందారు. ఫోర్‌థాట్‌కు చెందిన రాబర్ట్‌ గస్కిన్స్‌తో కలిసి అస్టిన్‌ పవర్‌పాయింట్‌పై పనిచేశారు. ఫోర్‌థాట్‌ సంస్థను తరువాత మైక్రోసాఫ్ట్‌ కొనుగోలు చేసింది. 1985 నుంచి 1996లో రిటైరయ్యే వరకూ పవర్‌పాయింట్‌ ప్రైమరీ డెవలపర్‌గా అస్టిన్‌ సేవలందించారు. 1993 నాటికి పవర్‌పాయింట్‌ ఏకంగా పది కోట్ల సేల్స్‌ నమోదు చేసింది.

ఒక సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పవర్‌పాయింట్‌ను సులభంగా నిర్వహించేలా అస్టిన్‌ సరళతరం చేశారు. కేవలం స్లైడ్స్‌ కాకుండా ప్రెజెంటేషన్స్‌ను పకడ్బందీగా ఇచ్చేలా పవర్‌పాయింట్‌ ప్రెజేం టేషన్‌ను అస్టిన్‌ డెవలప్‌ చేశారు. అస్టిన్‌ పవర్‌పాయింట్‌ను డిజైన్‌ చేయకుంటే దాని గురించి ఏ ఒక్కరూ వినిఉండేవారు కాదని, అది ఇంతగా ప్రాచుర్యం పొందేదని కాదని తన పుస్తకంలో గస్కిన్స్‌ రాసుకొచ్చారు. పవర్‌పాయింట్‌పై ప్రతిరోజూ 5 కోట్ల ప్రెజంటేషన్స్‌ క్రియేట్‌ అవుతున్నాయి. కార్పొరేట్‌ ఎగ్జిక్యూటివ్‌లు, బిజినెస్‌ స్కూల్స్‌, ప్రొఫెసర్లు, మిలటరీ జనరల్స్‌ ఈ సాఫ్ట్‌వేర్‌ను విరివిగా వాడుతున్నారు.