హైదరాబాద్: అకారణంగా తమపై చేయి చేసుకున్నాడనే కారణంతో ఐటీ ఎంప్లాయిస్ ఏకంగా పోలీస్ వర్గాల్లో అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తి ఫోన్ నే హ్యాక్ చేశారు. ఈ ఉదంతంతో కంగుతిన్న సదరు అధికారి కారకులను పట్టుకునే పనిలో ఉన్నారు. అసలేం జరిగిందంటే.. హైదరాబాద్ ఐటీ కారిడార్ లో ఇటీవల ఉద్యోగులంతా స్వచ్ఛందంగా ర్యాలీ నిర్వహించారు. ఆ టైంలో సైబరాబాద్ డీసీపీ ఓ ఐటీ ఉద్యోగిపై చేయి చేసుకున్నాడు. దీంతో తోటి ఉద్యోగులు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డీసీపీకి ఎలాగైనా బుద్ధి చెప్పాలని ఉద్యోగులంతా ఓ ప్లాన్ వేశారు. అందులో భాగంగా సదరు అధికారి ఫోన్ హ్యాక్ చేశారు. అనంతరం సైబర్ నేరస్థులు ఫోన్ లోని డేటా మళ్లీ డీసీపీకే పంపించారు. ఈ ఘటనతో కంగుతిన్న సైబర్ క్రైమ్ పోలీసులు కారకులను వెతికి పట్టుకునే పనిలో ఉన్నారు. దీనికి తోడు తమను బెదిరించిన మిగతా పోలీస్ అధికారుల ఫోన్లు హ్యక్ చేస్తామని హెచ్చరించినట్లు తెలుస్తోంది. గతంలోనూ మహిళా డీసీపీ ఫోన్ ని గుర్తు తెలియని వ్యక్తులు హ్యాక్ చేశారు. అయితే ఈ పని ఒకరు చేసిందా.. లేదా అంతకంటే ఎక్కువ మంది కలిపి చేశారా అనే విషయం స్పష్టత రాలేదు. ఓ నిందితుడు అదుపులో ఉన్నట్లు సమాచారం.