ప్రజాశక్తి-వత్సవాయి : అకాల వర్షాల వలన మొక్కజొన్న పంటలు నష్ట పోయిన రైతులకు కౌలు రైతులకు నష్టపరిహారం అందించాలని రైతు సంఘం కౌలు రైతు సంఘం మండల కమిటీ డిమాండ్ చేసింది. శనివారం మండల కేంద్రమైన వత్సవాయిలో నష్టపోయిన మొక్కజొన్న పంటలు పరిశీలించారు. మండలంలో 4 వేల ఎకరాలకు పైగా మొక్కజొన్న పంట దెబ్బతిన్నదని అధికారులు మాత్రం 750 ఎకరాలు మొక్కజొన్న పంట మాత్రమే దెబ్బతిన్నదని చెప్పటం చాలా విడ్డూరంగా ఉందని రైతు, కౌలురైతు సంఘం ఆగ్రహం చేసింది. మొక్కజొన్న ఎక్కువ శాతం కంకి లేత దశలోనే ఉన్నాయని అకాల వర్షాలకు పడిపోవటం వలన కంకి రాకుండా ఎండిపోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారులు సమగ్ర సర్వే చేసి పంట నష్టపరిహారం రైతులకు కౌలు రైతులకు అందించాలని కోరారు. అనంతరం డిప్యూటీ తాసిల్దార్ మాడుగుల రవికి వినతిపత్రం అందించారు. పై అధికారుల దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఏపీ రైతు సంఘం నాయకులు చిరుమామిళ్ల హనుమంతరావు, కౌలు రైతు సంఘం మండల అధ్యక్షులు తమ్మినేని రమేష్, రైతు సంఘం మండల కార్యదర్శి తమ్మినేని రాంబాబు, కౌలురైతు సంఘం జాను కోటయ్య, బి రాము, రైతులు, తదితరులు పాల్గొన్నారు.










