ప్రజాశక్తి-ఏలేశ్వరం : ఏలేశ్వరం శివారు ఏలేరు కాలువలో పెద్దాపురంకు చెందిన వానపల్లి చిన్న వీర్రాజు(22) మృతదేహం శుక్రవారం ఉదయం లభ్యమయింది. ఈ మేరకు ఏఎస్ఐ సన్యాసిరావు తెలిపినవిరాలు ఇలా ఉన్నాయి. పెద్దాపురంకు చెందిన వానపల్లి వీర్రాజు రొయ్యల ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. యధావిధిగా గురువారం ఉదయం క్యారేజీ తీసుకుని పనికి వెళ్ళిన వీర్రాజు కనిపించకపోవడంతో తల్లి వానపల్లి పోచమ్మ, బంధువులు వెతికిన ఫలితం లేకపోయింది. సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయి ఉండడంతో అనేక చోట్ల వెతికారు. ఏలేరు కాలవలు గుర్తుతెలియని యువకుడి మృతదేహం లభించిందని సమాచారం అందడంతో వచ్చి చూడగా చిన్న వీర్రాజు మృతదేహంగా గుర్తించారు. మృతుని చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో కుటుంబం పోషించే బాధ్యత వీర్రాజు పైనే ఉంది. ఇటీవలే మృతుని సోదరి పచ్చకామెర్లతో చనిపోయింది. మృతుని మేనమామ కాకిలేటి శరభయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి మృతదేహాన్ని ప్రత్తిపాడు పోస్ట్మార్టంకు తరలించినట్లు ఏఎస్ఐ తెలిపారు.










