Aug 28,2022 09:10

నాగపూర్‌ ఆంధ్రా అసోసియేషన్‌ గోల్డెన్‌ జూబ్లీ వార్షికోత్సవాలు ఘనంగా జరపాలని కమిటీ వాళ్లు నిర్ణయించుకున్నారు. సెక్రటరీ రామ్మూర్తి కమిటీ వాళ్లతో మాట్లాడుతూ 'మన తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు ఎంతో ఆదరణ పొందిన హరికథని, మన ఉత్సవాల్లో ఒకరోజు పెడదామని ఆలోచన ఉంది. మీ అభిప్రాయం చెప్పండి'.. అన్నాడు.
అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ ప్రతాప్‌ మాట్లాడుతూ... 'మా చిన్నప్పుడు పండగల్లో వినాయక చవితి, దసరా ఉత్సవాల్లోను తప్పనిసరిగా ఒకరోజు హరికథ చెప్పించేవారు. ఆ రోజుల్లో అవి విని భారత, భాగవత కథలు ఆకళింపు చేసుకునేవాళ్లం. ఈ రోజుల్లో హరికథ వినే వాళ్లు ఎవరూ?... నిరాసక్తంగా అన్నాడు.
'అవును సర్‌! అప్పట్లో కపిలేశ్వరపురం జమీందారు 'హరికథ' శిక్షణ కోసం ఆయన స్వస్థలంలో ఒక గురుకులం కూడా ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం మన ఆడిటోరియంలో ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. మన పిల్లలకీ ఈ హరికథ అంటే ఏమిటో తెలియజెయ్యాలని నాకు ఎప్పటి నుంచో కోరిక. మన ప్రాచీన కళల గురించి ఈ తరం వాళ్లకి తెలియజేయాలి కదా! అంటూ... అందరి అంగీకారం కోసం చూశాడు రామ్మూర్తి.
'అవును! ఈసారి తప్పకుండా ఏర్పాటు చేద్దాం.. కానీ, యూత్‌ గొడవ చేస్తారేమో!'.. అంటూ సందేహం వ్యక్తం చేశాడు వైస్‌ ప్రెసిడెంట్‌ చలపతి.
'మనం ఒకసారి హరికథని వినిపిస్తే, ప్రతి సంవత్సరం పెట్టించమని వాళ్లే అడుగుతారు'.. అన్నాడు రామ్మూర్తి ధీమాగా..
'అన్ని వయస్సుల వాళ్లనీ రంజింపజేసే మంచి హరికథకుడు ఎక్కడ దొరుకుతాడు మనకి?'... అనుమానం వ్యక్తం చేశాడు ప్రెసిడెంట్‌ ప్రతాప్‌.
'అది నాకు వదిలేయండి అని భరోసా ఇచ్చాడు రామ్మూర్తి. చివరికి సభ్యులందరూ ఓకే చెప్పేశారు.. రామ్మూర్తి ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. ఈ విషయం తన తల్లికి చెప్పాలి.. ఆమె ఎప్పటినుంచో హరికథ వినిపించమని పోరు పెడుతోంది. రామ్మూర్తి ఇంటికి వచ్చాకా, తల్లి చెవిలో వేశాడు ఆ విషయం.. ఆమె ఆనందానికి హద్దులు లేవు. కమిటీ వాళ్లని ఒప్పించిన ఆనందంతో నిద్రపట్టలేదు రామ్మూర్తికి. అతని ఆలోచనలు కొన్నేళ్ల వెనక్కి మళ్లాయి.

                                                                            ***

ఆ ఊరి గుడి వీధిలో చిన్న పెంకుటింట్లోంచి 'దయ చూడవయా రామయ్య! నిన్ను కొలిచిన వారిని దరికి జేర్చుకోవయ్యా.!' అనే కీర్తన వినపడుతోంది. ఆ గానం వినబడుతున్న ఇంటి వైపు అడుగులు వేసిన రామ్మూర్తికి, ఒక నడివయస్సు గల వ్యక్తి వెలిసిపోయిన ఎర్రని పట్టు పంచె కట్టుకుని, మెడలో మందార మాల వేసుకుని కాళ్లకు గజ్జెలు కట్టుకుని లయబద్దంగా అడుగులు వేస్తూ, చేతిలో చిరతలు పట్టుకుని వాయిస్తూ పాడుతూ కనబడ్డాడు... పక్కన పదిహేనేళ్ల పిల్లవాడు మృదంగం, యుక్త వయసులో వున్న ఒక అమ్మాయి వయోలిన్‌ వాయిస్తున్నారు.. ఆయన పాడే కీర్తన, వయోలిన్‌ మృదంగ నాదాలతో కలిసి మరింత మధురంగా గాలిలో పయనిస్తోంది.. ఆ గానానికి మంత్ర ముగ్దుడయ్యి వింటూ ఆ ఇంటి గుమ్మం ముందు నిలబడ్డాడు. ఎవరో అపరిచితుడు తమ ఇంటి ముందు నిలబడ్డాడని గమనించిన రాఘవదాసు బయటకి వచ్చి 'ఎవరు బాబు తమరు? ఎవరు కావాలి'..అని అడిగాడు...
'నా పేరు రామ్మూర్తి. నేను ఈ వూరి బ్యాంక్‌కి మేనేజర్‌గా కొత్తగా వచ్చానండి.. ఇల్లు అద్దెకు దొరుకుతుందేమోనని వెతుకుతున్నాను.. ఈలోగా రాముడి మీద మీరు పాడిన మధురమైన కీర్తన నన్ను కట్టిపడేసింది'... అన్నాడు.
రాఘవదాసు మోహంలో ఆనందపు కాంతి రేఖ మెరిసి మాయమయ్యింది. ఈ వీధిలో ఇళ్లేవీ ఖాళి లేవనుకుంటాను బాబు! నువ్వు ఒక్కడివే వుంటావా'..ఆరా తీశాడు..?
'నాతో నా భార్య, మా అమ్మ కూడా ఉంటారు. ఇల్లు దొరికితే ఇద్దర్నీ తీసుకు వస్తానండి.. బై ది బై, మీరు హరికథలు చెప్తారాండి' అడిగాడు ఆసక్తిగా.
'అవును నాయన.. తరతరాలుగా ఇదే మా జీవనోపాధి'... అని నిట్టూర్చాడు..
'మీరు పాడిన ''దయ చూడవయా రామయ్యా' ! అనే కీర్తన ఎవరు రాసింది? నేను ఎప్పుడూ వినలేదు' అడిగాడు.
'హరికథ కోసమని నేనే రాశాను'.. అన్నాడు రాఘవదాసు.
'అద్భుతంగా వుందండీ! ఎందరో గొప్ప గొప్ప వాగ్గేయ కార్లని గుర్తుకు తెచ్చారండి. అన్నాడు ప్రశంసాపూర్వకంగా.
'ఏం లాభం నాయన!.. ఈ హరికథని నమ్ముకున్న నాకు పూట గడవడమే కష్టంగా వుంది. ఈ మధ్య ఎవ్వరూ చెప్పించుకోవడం లేదు... నిరాశగా అన్నాడు.
'తమరి పేరండి.?... అడిగాడు రామ్మూర్తి.
'రాఘవదాసు భాగవతార్‌! అంటారు బాబు.! మా నాన్నగారు పాండురంగదాసుగారు కూడా గొప్ప హరికథా కళాకారులు, ఎన్నో ఏళ్లుగా మా వంశస్థులు దీని మీదే ఆధారపడి జీవించారు. వారి దారిలోనే నేను కూడా! ఆ రోజుల్లో హరికథనే కళను ఆదరించే మహానుభావులైన పోషకులు ఎందరో వుండేవారు.. అలాగే కథను ఆస్వాదించే జనం కూడా వుండే వారు. ఇప్పుడు నీకు తెలియంది ఏముంది? కాలం మారిపోయింది.. ఈ మధ్య కాలంలో నిరాదరణకి గురైన కళల్లో ఇది కూడా ఒకటి ఒంటరిగా మిగిలిపోయింది'... అని బాధగా అన్నాడు..
కూతురు సంధ్యశ్రీ తండ్రి ముఖంలో బాధని చూసి తాను వాయిస్తున్న వయోలిన్‌ పక్కనపెట్టి తండ్రి కేసి విచారంగా చూసింది. కొడుకు శివ, మృదంగం ఆపి వాళ్ల మాటలు ఆసక్తిగా వింటున్నాడు.
'అది గమనించిన అతను 'దృష్టి సాధన మీద పెట్టండి' అంటూ గంభీరంగా వాళ్లకేసి చూశాడు. వాళ్లిద్దరూ కంగారుపడి, సాధనని కొనసాగించారు.
'నా బాధలు చెప్పి, నిన్ను ఇబ్బంది పెడుతున్నట్టున్నాను.. అని నొచ్చుకున్నాడు రాఘవదాసు.
'అయ్యో పెద్దవారు ! అలాంటిదేదీ లేదండి! నాకు కూడా హరికథ అంటే ఇష్టమండి. మా అమ్మగారు చిన్నతనంలో రాత్రుళ్లు రేడియోలో వచ్చే హరికథలు మాకు కూడా వినిపెంచేవారండి. వస్తానండి! ఇల్లు వెతుక్కోవాలి.. మళ్లీ కలుద్దాం !'.. నమస్కారం పెట్టి ముందుకు కదిలాడు.
'శుభం నాయనా.! వెళ్లిరా' అంటూ ఇంట్లోకి దారితీశాడు రాఘవదాసు.

                                                                         ***

'రామ్మూర్తి ఆ వూరిలో వున్నన్నాళ్లు చాలా సార్లు రాఘవదాసు ఇంటికి వెళ్లి అతని చేత హరికథల్లోని పద్యాలు, కీర్తనలు పాడించుకుని వినేవాడు.. ఒకసారి తమ బ్యాంకు స్వర్ణోత్సవాల్లో కళాకారులకి సన్మానం చేసే అవకాశమొచ్చింది. రామ్మూర్తి రాఘవదాసుకి వూరి జనం సమక్షంలో సన్మానం చేశాడు. అతను ఆనందం పట్టలేకపోయాడు..
'మన మధ్యే వుండే గొప్ప వారిని మనమే గుర్తించకపోతే ఎలా!' అంటూ, ఆ వూరి జనాలని ఒప్పించి శ్రీరామ నవమి ఉత్సవాల్లో రాఘవదాసు హరికథ పెట్టించాడు. చాలా కాలం తర్వాత స్టేజి మీద చెప్పడం వల్ల రెట్టించిన ఉత్సాహంతో శ్రీరాముడి వంశ వృక్షంలోని చక్రవర్తుల పేర్లని గుక్కతిప్పుకోకుండా వర్ణించాడు. సీత కల్యాణంలోని శివ ధనుర్భంగ ఘట్టం కళ్లకు కట్టినట్టు చూపించాడు. హరికథలోని తియ్యదనాన్ని ఆ వూరి జనం చవి చూసి ఆనందం పట్టలేక చప్పట్లు మారు మోగించారు. ప్రతి సంవత్సరం రాఘవదాసు చెప్పే 'హరికథ' ఏర్పాటు చెయ్యాలని నిర్ణయించుకున్నారు..
ఆ వూరిలో రెండేళ్లు పని చేసిన తర్వాత రామ్మూర్తికి ప్రమోషన్‌ మీద వేరే ఊరు ట్రాన్స్‌ఫర్‌ అయ్యింది.. అతను వెళ్లిపొతున్నాడని తెలిసి రాఘవదాసు బ్యాంకుకి వచ్చాడు.
'నాయన! నా పట్ల, నా కళ పట్ల ఎంతో ప్రేమతో నాకు దారి చూపావు. ఇప్పుడు మా జీవితాలు కాస్త ఒడ్డున పడ్డాయి.. నువ్వు బదిలీ అయ్యి వెళ్లిపోతున్నావంటే బాధగా వుంది. కానీ పదోన్నతి మీద వెడుతున్నందుకు సంతోషంగా వుంది. మమ్మల్ని గుర్తుంచుకో నాయన!'... అంటుంటే అతని గొంతు గద్గదమైంది.
రామ్మూర్తి రాఘవదాసు కాళ్లకి దణ్ణం పెట్టాడు. దీర్ఘాయుష్మాన్‌ భవ! అని దీవించాడు. రామ్మూర్తి కళ్లల్లో సన్నని కన్నీటి పొర అప్రయత్నంగా కమ్మింది. అతను కనుమరుగయ్యేడు.. ఏళ్లు గడిచిపోయాయి. రామ్మూర్తి ఉద్యోగ బిజీలో పడి కాలక్రమేణా రాఘవదాసుని మర్చిపోయాడు. హరికథ వినిపించమని తల్లి అడగడంతో.. మళ్లీ ఆ రోజులు జ్ఞాపకానికి వచ్చాయి.

                                                                         ***

చాలా ఏళ్ల తర్వాత రాఘవదాసుని కలవబోతున్నాననే ఆలోచన వల్ల... మనసంతా ఉద్వేగంతో నిండిపోయింది. వీధిలో ఆనవాళ్లను బట్టి, ఇల్లు కనుక్కున్నాడు. పూర్తిగా జీర్ణావస్థలో వుంది. అరుగు ఎక్కి తలుపు మీద నెమ్మదిగా తట్టాడు. ఒకామె తలుపు తీసింది.
'ఏమ్మా! ఈ ఇంట్లో రాఘవదాసు భాగవతార్‌ గారని హరికథలు చెప్పే ఆయన వుండాలి..! వున్నారా?.. అడిగాడు.
'రామ్మూర్తి అన్నయ్య ! నన్ను గుర్తు పట్లేదా? నేను సంధ్యశ్రీని' అంటూ నవ్వుతూ పలకరించింది ఆమె.
'నువ్వా సంధ్య! ఎంత మారిపోయావు'.. ఆశ్చర్యపోతూ లోపలికి వచ్చి కుర్చిలో కూర్చున్నాడు.
ఆమె ఇచ్చిన మంచి నీళ్లు తాగి. గ్లాసు కింద పెడుతూ..
'నాన్నగారు ఏరమ్మా?'.. అడిగాడు ఇంటి లోపలికి చూస్తూ.
'నాన్నగారు పోయి నాలుగేళ్లు అవుతోందన్నయ్య.. ఆమె గొంతు జీరబోయింది. ఈ కథలు, కళలు మనకి పనికిరావని. శివ పట్నంలో ఉద్యోగంలో చేరిపోయాడు'. అంది.
రాఘవదాసు లేడనే విషయం వినగానే.. రామ్మూర్తి హతాశుడయ్యాడు. గుండెల్లోంచి దుఃఖం పెల్లుబికింది. కాసేపు ఇద్దరి మధ్య నిశ్సబ్దం నాట్యం చేసింది. కాసేపటకి తేరుకున్న రామ్మూర్తి.
'నువ్వు ఒక్కర్తివి ఇక్కడేం చేస్తున్నావమ్మా? జాలిపడుతూ.. అడిగాడు.
'ఏదో చిన్నగా పిల్లలకి సంగీత పాఠాలు చెప్తున్నాను. ఈ రోజుల్లో కాన్వెంటు పిల్లలకి తెలుగు రాదు కదా.. వాళ్లకి తెలుగు ట్యూషన్‌ చెప్తున్నాను. అని నవ్వింది.. ఆ నవ్వులో జీవం లేదు అనుకున్నాడు.
రామ్మూర్తి సందిగ్ధావస్థలో పడ్డాడు. నెమ్మదిగా తాను వచ్చిన విషయం చెప్పాడు.
'నాన్నగారి హరికథ మా వాళ్లకి వినిపిద్దాం అని నాగపూర్‌ నుంచి ఎంతో ఆశతో వచ్చానమ్మ' అంటూ బాధపడ్డాడు.
అతని ముఖంలో నిరాశ చూసి. 'నాకు నాలుగు రోజులు టైమియ్యి అన్నయ్య.. నాన్నగారి శిష్యులు కొంత మంది అక్కడక్కడ ఉన్నారు. వాళ్లు ఇప్పుడు హరికథలు చెప్తున్నారో లేదో తెలియదు.. వాళ్లతో మాట్లాడి నీకు తెలియ జేస్తాను'.. అంటూ ఫోన్‌ నెంబర్‌ తీసుకుంది. అతను తిరుగు ప్రయాణమయ్యాడు.

                                                                          ***

నాగపూర్‌ ఆంధ్రా అసోసియేషన్‌ ఆడిటోరియం, వేదిక ముందు కూర్చున్న ఆహూతులతో కళ కళ లాడుతోంది.. రామ్మూర్తి హడావుడిగా అటూ ఇటూ తిరుగుతూ హరికథ ఏర్పాట్లు చూస్తున్నాడు. వేదిక మీద.. వయోలిన్‌, మృదంగ వాద్యకళాకార్లు శృతి చూసుకుంటున్నారు.
కొంత సేపటికి రామ్మూర్తి వేదికనెక్కి... మైకు తీసుకుని...'సభకు నమస్కారం.! మన తెలుగు వారి ప్రాచిన సాంప్రదాయ కళల్లో హరికథ ది అగ్రస్థానం.. ఇప్పటి పిల్లలకి, యువతకు మన పురాణాలలోని కథలని హరికథా రూపంలో వినిపిస్తే వాళ్లు సులువుగా అర్థం చేసుకుంటారని మన కమిటీ నిర్ణయం తీసుకుని ఈ కార్యక్రమం ఏర్పాటు చేసింది. మీరందరూ కథ విని ఆనందిస్తారని ఆశిస్తున్నాను.. ఈ రోజు కార్యక్రమంలో విద్యున్మణి, సంగీత సాహిత్యాలలో దిట్ట, శ్రీ పురాణం రాఘవదాసు భాగవతార్‌గారి కుమార్తె అయిన, కుమారి సంధ్యశ్రీ భాగవతారిణిగారు 'రుక్మిణి కళ్యాణం' హరికథ వినిపిస్తారు. అని ప్రకటించగానే కరతాళ ధ్వనులు ఆ హాల్లోమారు మోగాయి.
'ఆంగికం భువనం యస్య! వాచికం సర్వ వ్మాయం.. అంటూ ప్రార్థనతో మొదలు పెట్టిన ఆమె హరికథ గంగా ప్రవాహంలా సాగింది. అందర్నీ సంభ్రమాశ్చర్యాల్లో ముంచింది. ముఖ్యంగా శ్రీ కృష్ణుడు, రుక్మిణిని రథంలో తీసుకుని వెళ్లిపోయే సన్నివేశాన్ని తన ఆంగికాభినయాలతో వర్ణించిన తీరు, ప్రేక్షకులందర్నీ ఆకట్టుకుంది. ఎంతో శ్రద్దగా అందరూ హరికథని విన్నారు. కథ పూర్తి అయ్యాకా, అసోసియేషన్‌ సభ్యులు ఆమెకి ఘనంగా సన్మానం చేశారు. ప్రతి వార్షికోత్సవ కార్యక్రమాల్లో 'హరికథ'ని ఏర్పాటు చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు. రామ్మూర్తికి చాల సంతోషమనిపించింది. కొన్ని రోజుల క్రితం ఆమె ఫోనులో మాట్లాడిన మాటలు జ్ఞాపకం వచ్చాయి. 'నువ్వు వెళ్లాకా, నాలో అంతర్మథనం మొదలైంది అన్నయ్య!. ఈ దైవ దత్తమైన కళని నాన్నగారి తర్వాత నేనే ఎందుకు కొనసాగించకూడదూ? అనిపించింది. ఆ భాగ్యం నాకే కలిగించు అని ప్రార్థించింది. తెలుగు వారి సంపద అయిన ఈ సాంప్రదాయ కళని కొనసాగించడానికి సంధ్యశ్రీ వేదికనెక్కింది.

చాగంటి ప్రసాద్‌
9000206163