మహాత్మా జ్యోతిరావు గోవిందరావు ఫూలే గొప్ప సామాజిక విప్లవకారుడు. శూద్రుల, మహిళల ఆశా జ్యోతి. కుల వ్యవస్థపై తిరగబడి 'క్రాంతి సూర్య'గా పేరుబడ్డ సంస్కర్త. జ్యోతిరావు పూర్వీకులు మహారాష్ట్ర సతారా జిల్లా ఖాతావ్ తాలూకా కట్గూన్ గ్రామానికి చెందిన మాలి కులస్తులు. గోవింద్, చిమనాబాయి దంపతులకు జ్యోతిరావు 11.04.1827న జన్మించారు. జ్యోతిరావును మొదట జ్యోతిబా అనేవారు. చదువురాని వారు పలకడానికి వీలుగా తన పేరును జోతిరావుగా మార్చుకున్నారు. ఆ కాలంలో బ్రాహ్మణులు పాఠశాలల్లో తమ కులస్తులకే చదువు చెప్పేవారు. దళితులను రానిచ్చినా వేరుగా కూర్చోబెట్టేవారు. 1834-38 మధ్య జోతి బా ప్రాథమిక విద్య ముగిసింది. బ్రాహ్మణత్వ కుతంత్రాల కారణంగా బడి మానిన జోతిబా వ్యవసాయంలో మునిగారు. పూల కొట్టు లోనూ పని చేసేవారు. ఈ దశలో 1840లో నార్గావ్ గ్రామస్తుడు ఖండోజీ కుమార్తె సావిత్రి బాయితో, నాటి ఆచారం ప్రకారం అతి చిన్న వయసులో, జోతిబా పెళ్లి అయింది. నాటికి జోతిబా వయసు 13, సావిత్రి బాయికి 9 ఏళ్లు. సావిత్రిబాయి నిరక్షరాస్యురాలు. అందుకు వెనుకబడిన కులం, మహిళ కావడం కారణం. జోతిబా ఉత్సాహం గమనించిన పర్షియన్ పండితుడు మున్షీ గఫార్ బేగ్, బ్రిటిష్ ఉద్యోగి లిజిత్ సాహబ్ లు అతని బంగారు భవిష్యత్తుకు చదువు అవసరమని తండ్రికి నచ్చజెప్పారు. 1841లో మూడేళ్ల విరామం తర్వాత 14 ఏళ్ల వయసులో జోతిబా స్కాటిష్ మిషనరి బడిలో చేరాడు. అక్కడ ఏడవ తరగతి వరకు చదివాడు. బడిలో, ఆంగ్లో అమెరికన్ రాజకీయ సిద్ధాంతవేత్త, తాత్వికుడు, విప్లవకారి థామస్ పెయిన్ పుస్తకం 'మనిషి హక్కులు' చదివారు. ఈ పుస్తకం ఆయనలో సామాజిక పరివర్తనా దృష్టి కలిగించింది. జోతిబా ముస్లిం పిల్లలతో ఆడేవాడు. వారి సాంగత్యంలో మత వంచన, కపట నైపుణ్యతల తప్పుడు ప్రచారాలు, మూఢనమ్మకాలు తెలిశాయి. క్రైస్తవ మిషనరీల పరిచయంతో ఫూలే జ్ఞానం పెరిగింది. వలసవాద యంత్రాంగంలో బ్రాహ్మణుల బంధుప్రీతి, అవినీతి అనుభవానికి వచ్చాయి.
1848లో జోతిబా జీవితంలో దుస్సంఘటన జరిగింది. ఒక మిత్రుని పెళ్ళిలో ఉన్నత కులస్తులు తనని కులం పేరుతో అవమానించారు. ఈ ఘటనతో శూద్రుల, అతి శూద్రుల విముక్తికి విద్య ఆయుధమని జోతి గుర్తించారు. 1848 లోనే దళిత బాలికలకు, స్త్రీలకు పాఠశాలలు ప్రారంభించారు. బాలికలకు, స్త్రీలకు, దళితులకు పాఠశాలలు ప్రారంభించిన తొలి భారతీయుడు జ్యోతిరావు. జోతిబా దంపతులు వితంతు వివాహాలను ప్రోత్సహించారు. దేవదాసీ, సతీ సహగమన దురాచారాలకు వ్యతిరేకంగా, రైతు పన్నుల రద్దుకు, సాగునీటి కాలువల నిర్మాణానికి, కార్మికుల సమస్యల పరిష్కారానికి ఉద్యమాలు నడిపారు. బ్రాహ్మణ వితంతువులకు గుండు గీయవద్దని క్షురకులకు నచ్చజెప్పారు. బ్రాహ్మణ వడ్డీ వ్యాపారుల ఉచ్చులో పడకుండా రైతులను చైతన్య పరిచారు. మానభంగాలకు గురయిన వితంతు గర్భవతుల సురక్షిత ప్రసవాలకు, వారి పిల్లల సంరక్షణకు 'శిశు హత్య నిరోధక కేంద్రాలు' ప్రారంభించారు. వితంతువులు, నిరాధార బాలల పోషణకు ఆశ్రమాలు ప్రారంభించారు. విద్యా హక్కు గురించి ప్రచారం చేశారు. ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చారు. బడి మానే పిల్లల సంఖ్య తగ్గించడానికి విద్యార్థులకు భోజన, గృహ వసతులు కల్పించారు. విద్యార్థి వేతనాలు ఇచ్చారు. పోషకాహార లోపాలు అరికట్టడానికి పిల్లలకు సమతుల ఆహారం అందించారు. తమ పాఠశాలల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేశారు. పిల్లలకు చిత్రలేఖనం, కళలు నేర్పారు. తల్లిదండ్రుల-ఉపాధ్యాయుల సమావేశాలు జరిపారు. పిల్లల మానసిక వికాసంపై దృష్టి కేంద్రీకరించారు. రైతులు, దళితులు, వెనుకబడిన తరగతులవారు, వారి పిల్లలు, కార్మికుల కోసం రాత్రి బడులు ప్రారంభించారు. దళితుల కోసం 1850లో రెండు విద్యా సంస్థలు స్థాపించారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో జనాభా ప్రాతిపదికన ప్రతి కులానికి ప్రాతినిధ్యం కోసం ఉద్యమాలు నిర్వహించారు. మద్యపానం పేద కుటుంబాలను సర్వనాశనం చేస్తుందనేవారు జోతిబా. ఎక్కువ సారా దుకాణాలకు అనుమతులు ఇవ్వాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను ఖండించారు. బ్రాహ్మణత్వ ఆధిపత్య వ్యతిరేక ఉద్యమాల నిర్మాణానికి ఫూలే 1873లో 'సత్యశోధక సమాజ్'ను స్థాపించారు. ఇది బ్రాహ్మణత్వ ఆచారాలు, ఛాందస భావాలు, విగ్రహారాధన, కుల వ్యవస్థలకు వ్యతిరేకంగా శూద్రులను చైతన్య పరిచింది. సాంస్కృతిక నిరసనలను, కట్న కానుకలు, పూజారులు, మంత్ర శ్లోకాలు లేని నిరాడంబర పెళ్ళిళ్ళను, కులాంతర, వితంతు వివాహాలను ప్రోత్సహించింది. మతాచారాల్లో పూజారుల అవసరాన్ని, బ్రాహ్మణ ఆధిపత్యాన్ని, బాల్య వివాహాలను ధిక్కరించింది. స్త్రీలు, శూద్రులు, దళితులకు విద్య, సమానత్వం, సామాజిక హక్కులు నేర్పింది. రాజకీయ ప్రవేశం కల్పించింది. జోతిబా తన సంపాదనంతా విద్యాలయాలకు, సేవా సంస్థలకు, సామాజిక కార్యక్రమాలకు ఖర్చు పెట్టారు. చివరికి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తన ఆరోగ్య చికిత్సకు కూడా డబ్బు లేదు.
జోతిబా ప్రజల కోసం అనేక నాటకాలు, పుస్తకాలు, పద్యాలు, కవితలు, గేయాలు, 'వ్యవసాయదారుని కొరడా తాడు' పుస్తకం రచించారు. అంతేగాక వాటిని ప్రచురించి ప్రజలకు పంచారు. ప్రజలకు సులభంగా అర్ధమయ్యే భాషలో, పాడుకోవడానికి అనువైన శైలిలో జానపద గేయాలు 'పోవాడా'లు రాసి వీటిని పాడుతూ ప్రజలను చైతన్య పరిచేవారు. 'సత్య ధర్మ' పుస్తకంలో ప్రపంచ మతాల గురించి రాశారు. తాను ఆచరించే 'సత్య మతం' మానవతావాద మతమని ప్రశంసించారు. 'గులాంగిరి (బానిసత్వం)' పుస్తకంలో విదేశీ విద్య, ఆంగ్లం, బ్రాహ్మణత్వం, అమెరికా జాత్యహంకారం, భారత బానిసత్వం, భవిష్యత్ కార్య ప్రణాళిక వగైరా అంశాలు వివరించారు. మార్క్స్ బోధించినట్లు జాతీయతతో పాటు అంతర్జాతీయతకూ ప్రాధాన్యత ఇచ్చారు. 'సత్సార్' (సత్య సారం) పుస్తకంలో బ్రాహ్మణాధిపత్య సంస్థలను తీవ్రంగా విమర్శించారు. దళితులకు సభ్యత్వం ఇవ్వని సార్వజనిక సభ, కాంగ్రెస్ కోరుతున్న పరిపాలన బ్రాహ్మణీయతకు దారి తీస్తుందని తన రచనల్లో హెచ్చరించారు. మన అంటరానితనాన్ని అమెరికా జాత్యహంకారంతో పోల్చిన జోతిబా అనారోగ్యంతో 28.11.1890న మరణించారు.
సంగిరెడ్డి హనుమంత రెడ్డి
(వ్యాసకర్త ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ కార్యదర్శి, గుంటూరు, సెల్: 9490 20 4545)










