May 03,2023 12:41

ప్రజాశక్తి-కాకినాడ : స్థానిక యూటీఎఫ్ హోం నందు అమరజీవి దాచూరి రామిరెడ్డి వర్థంతి సభ కాకినాడ జిల్లా యూటీఎఫ్ అధ్యక్షుడు కె.వి.వి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ముందుగా రామిరెడ్డి చిత్రపటానికి మాజీ రాష్ట్ర కార్యదర్శి వర్మ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ముఖ్యవక్త గా జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు ఐ.ప్రసాదరావు మాట్లాడుతూ ఐక్య ఉద్యమాల రథసారథి రామిరెడ్డి అని తెలిపారు. నేటి ఉపాధ్యాయ రంగంలో ఉన్న పలు సమస్యలకు పరిష్కారం ఉపాధ్యాయుల ఐక్య పోరాటాలు ద్వారానే సాధ్యం అని తెలిపారు. రామిరెడ్డి ఉపాధ్యాయ ఉద్యమం కోసం 16 సంవత్సరాల సర్వీసు స్వచ్ఛందంగా వదులుకున్నారని, మరి నేటితరం ఉపాధ్యాయ సమస్యల కోసం చేసే పోరాటాల్లో ఆమడదూరంలో ఉండుట శోచనీయం అని తెలిపారు. ముఖ్యంగా గత నాయకులు సాధించిన హక్కులు, రాయితీలు నిలబెట్టుకోవడం నేటి ఉపాధ్యాయులు భుజస్కంధాలపై ఉన్న బాధ్యత అని తెలిపారు.‌ రాష్ట్ర కార్యదర్శి టి. అన్నారాము మాట్లాడుతూ రామిరెడ్డి యమ్ ఎల్ సి గా ప్రజల గొంతుకను శాసనమండలిలో వినిపించి, సమస్యలు పరిష్కారం కోసం ప్రయత్నాలు చేశారు అని, తన జీవితాన్ని, జీతాన్ని సంఘం కోసం దారబోసిన త్యాగశీలి రామిరెడ్డి అని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సిలబస్ నుంచి డార్విన్ సిద్ధాంతాన్ని, చారిత్రక సంఘటనలు తీసివేస్తూ, శాస్త్రీయ దృక్పథం నుంచి మధ్య యుగాల నాగరికతను ప్రోత్సహించే విధంగా విద్యా విధానం మార్పులు చేస్తుందని మాజీ రాష్ట్ర కార్యదర్శి ప్రభాకరవర్మ తెలిపారు. సి.ఐ.టి.యు, రాష్ట్ర పెన్షనర్ నాయకులు సత్తిరాజు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిరంకుశ పాలనతో కార్మిక సంఘాలను, నాయకులను అణిచివేత స్తుందని, భారత రాజ్యాంగ ఆశయాలకు విరుద్ధంగా పయనిస్తుంది అని ఆందోళన వ్యక్తం చేశారు.‌ ప్రజాస్వామ్య పద్ధతిలో పోరుబాట పట్టడం ద్వారానే ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల సమస్యలు పరిష్కారం అవుతాయని పలువురు నేతలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జోగా అప్పారావు, గిరిధర గోపాల్, గోవిందరాజులు, జిల్లా కార్యదర్శులు సాయిరాం, సీతారామయ్య, వీరబాబు, సూరిబాబు, నాగమణి, కనకదుర్గ పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.