Dec 08,2022 06:36

దేశంలోని ప్రతిష్టాత్మకమైన వైద్య, శాస్త్ర పరిశోధన సంస్థలపై వరుసగా జరుగుతున్న సైబర్‌దాడులు కలవరాన్ని కలిగిస్తున్నాయి. ఢిల్లీలోని ఎయిమ్స్‌పై హ్యాకర్లు దాడి చేసి కీలక డేటాను తస్కరించిన అంశం ప్రకంపనలు సృష్టిస్తుండగానే, పరిశోధనలకు నెలవైన భారత వైద్య పరిశోధన మండలి (ఐసిఎంఆర్‌)పై పంజా విసిరిన తీరు ఆందోళనకరం. అత్యంత కీలకమైన ఈ సంస్థపై ఒక్కరోజులోనే ఆరువేలసార్లు హ్యాకింగ్‌ యత్నాలు జరిగాయి. ఎయిమ్స్‌కు సమీపంలోని సఫ్దర్‌జంగ్‌ ఆస్పత్రి, తమిళనాడులోని శ్రీ శరణ్‌ ఆస్పత్రిపై కూడా హ్యాకర్లు దాడులు చేశారు. శ్రీ శరణ్‌ ఆస్పత్రికి చెందిన పేషంట్ల డేటాను డార్క్‌ వెబ్‌సైట్‌లో అమ్మకానికి పెట్టడం, ఎయిమ్స్‌ డేటాను తమ ఆధీనంలోకి తీసుకుని 200 కోట్ల రూపాయలు ఇస్తేనే వెనక్కి ఇస్తామని బ్లాక్‌మెయిల్‌ చేయడం హ్యాకర్ల బరితెగింపునకు నిదర్శనం. రాన్‌సమ్‌వేర్‌ ద్వారా ఎయిమ్స్‌ సర్వర్‌ను, కంప్యూటర్లను హ్యాకర్లు తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు చెబుతున్నారు. దీని ప్రభావం ఎయిమ్స్‌లోని అన్ని విభాగాలపై పడింది. ఒకటి, రెండు రోజులు వైద్యసేవలను అత్యంత కనిష్ట స్థాయికి కుదించారు. ఈ సైబర్‌ దాడి జరిగి వారం రోజులు గడుస్తున్నా ఇప్పటికీ పూర్తిస్థాయిలో సర్వర్‌ వ్యవస్థను పునరుద్ధరించలేదు. అనేక విభాగాల్లో ఇప్పటికీ మాన్యువల్‌ పద్ధతిలో పనులు నిర్వహిస్తున్నారు. హ్యాకర్ల బ్లాక్‌మెయిల్‌కు లొంగకుండా ప్రత్యామ్నాయ పద్ధతుల ద్వారా డేటాను ఎయిమ్స్‌ తిరిగి పొందడమే కొంత ఊరట ఇచ్చే అంశం. వరుసగా జరిగిన దాడులు మన అత్యాధునిక డిజిటల్‌ వ్యవస్థల లోపాలను దేశ భద్రతకు, ప్రజానీకానికి పొంచి ఉన్న ముప్పును ఎత్తి చూపుతున్నాయి.
సైబర్‌ దాడులపై అధ్యయనం చేసే కృత్రిమ మేథ (ఆర్టిఫీషియల్‌ ఇంటిలిజెన్స్‌-ఎ.ఐ) సంస్థ క్లౌడ్‌ ఎస్‌ఇకె ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఈ తరహా దాడులు పెరగుతున్నాయి. వైద్య ఆరోగ్య రంగంలో ఈ పెరుగుదల మరింత ఆందోళనకరంగా ఉంది. గత ఏడాది మొదటి నాలుగు నెలలతో పోలిస్తే ఈ ఏడాది అదే సమయంలో హెల్త్‌ కేర్‌ రంగంపై దాడులు 95.35 శాతం పెరిగాయి. దాడులకు గురవుతున్న దేశాల్లో భారత్‌ రెండవ స్థానంలో ఉంది. మరోవైపు భద్రతా ప్రమాణాలపై నిపుణులు చేసిన హెచ్చరికలను ఏమాత్రం ఖాతరు చేయకుండా ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ మిషన్‌ను కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. పేషంట్లకు సంబంధించిన సమస్త వివరాలను, వైద్యుల సిఫార్సులను డిజిటల్‌గా నిలువచేయడం ప్రారంభించింది. కరోనా విజృంభణ సమయంలో ప్రారంభించిన కోవిన్‌ పోర్టల్‌ కూడా ఇటువంటిదే! ఆ సమయంలోనూ సైబర్‌ నిపుణులు చేసిన హెచ్చరికలను కేంద్రం పట్టించుకోలేదు. ఇటువంటి సమాచారం కోసమే హ్యాకర్లు దాడులు చేస్తారని, అలా తస్కరించిన డేటాను ఇన్సూరెన్స్‌ కంపెనీలతో పాటు, వైద్య,ఆరోగ్య రంగానికి చెందిన వివిధ కార్పొరేట్‌ సంస్థలకు భారీ మొత్తాలకు అమ్ముకుంటున్నారన్నది క్లౌడ్‌ ఎస్‌ఇకె సంస్థ సర్వే సారాంశం. ఎయిమ్స్‌లో దేశానికి చెందిన అత్యంత ముఖ్యమైన వ్యక్తుల సమాచారాన్ని నిక్షిప్తం చేస్తుండటం ఈ సందర్భంగా ప్రస్తావనార్హం.
అమెరికా, చైనా, రష్యా, ఫ్రాన్స్‌ వంటి దేశాలు తమ డిజిటల్‌ వ్యవస్థల భద్రతకోసం దాదాపుగా ప్రభుత్వ సర్వర్లన్నింటినీ ఒకే పోర్టల్‌ కిందకు తీసుకువచ్చి పటిష్టమైన రక్షణ వ్యవస్థలను (ఫైర్‌వాల్స్‌)ను అభివృద్ధి చేశాయి. మన దేశంలో పాలకవర్గాలు తాత్కాలిక ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తుండటంతో ఆ తరహా ఆవిష్కరణలు క్లిప్టంగా మారుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే ఆరోగ్య రంగానికే కాకుండా, దేశ భద్రతకు కూడా ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పటిష్టమైన రక్షణ చర్యలు లేకుండా జరిగే డిజిటలైజేషన్‌ ప్రక్రియ మొదటికే మోసంగా మారుతుంది. ఆ పరిస్థితి ఏర్పడితే కేంద్ర ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత! ఆధార్‌ కార్డుల జారీ పేరుతో సేకరించిన సమాచారం కూడా ఇప్పటికే అనేక మార్లు లీక్‌ అయింది. తాజా దాడుల తరువాతైనా కేంద్ర ప్రభుత్వం సైబర్‌ భద్రతపై పూర్తిస్థాయిలో దృష్టి సారించాలి. ప్రజల వ్యక్తిగత సమాచారానికి పూర్తి భద్రతనిచ్చే దుర్బేధ్యమైన రక్షణ వ్యవస్థను రూపొందించాలి. ఈ తరహా దాడులకు పాల్పడే హ్యాకర్లను కఠినంగా శిక్షించాలి.