- మోంకాడా డే సందర్భంగా క్యూబా అధ్యక్షుడి వ్యాఖ్యలు
హవానా : ''ఒక ఎదురు దెబ్బ మహత్తర విజయంగా మారగలదు.'' అని క్యూబా అధ్యక్షులు మిగ్వెల్ డియాజ్ కానెల్ వ్యాఖ్యానించారు. క్యూబా జాతీయ ఐక్యతను దెబ్బ తీయడానికి అమెరికా ప్రయత్నించినంతకాలమూ ఎదురు దాడి చేయడానికి మోంకాడా వస్తూనే వుంటాడని ఆయన పేర్కొన్నారు. అమెరికా మద్దతుతో బాటిస్టా ప్రభుత్వం అనుసరించే నియంతృత్వానికి వ్యతిరేకంగా 1953 జులై 26 ఫైడెల్‌కాస్ట్రో, ఆయన సోదరుడు రాల్ కాస్ట్రో నేతృత్వంలో విప్లవకారుల బృందం కనివినీ ఎరుగని రీతిలో చేపట్టిన పోరాటాన్ని స్మరిస్తూ క్యూబా ప్రభుత్వం చేపట్టిన అధికారిక కార్యక్రమాలు బుధవారంతో ముగిశాయి. ముగింపు కార్యక్రమంలో క్యూబా అధ్యక్షుడు పాల్గొని ప్రసంగించారు. ఆనాటి వీరోచిత విప్లవ పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ, ఆ పోరాటం లాటిన్ అమెరికాలో అనేక తరాల సామాజిక పోరాట యోధులకు స్ఫూర్తినిచ్చిందని చెప్పారు. క్యూబాపై ఆరు దశాబ్దాలుగా సాగుతున్న అమెరికా ఆంక్షల కారణంగానే క్యూబా ఆర్థికాభివృద్ధి పరిమితమవుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. శాంటియాగో డీ క్యూబాలో మోంకాడా గారిజన్ నగరంలో జాతీయ తిరుగుబాటు దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
- సిఐటియు సంఘీభావం
మోంకాడా డే 70వ వార్షికోత్సవం సందర్భంగా క్యూబన్లకు డబ్ల్యుఎఫ్‌టియు అనుబంధ సంస్థ అయిన సిఐటియు సంఘీభావం తెలిపింది. క్యూబాపై యురోపియన్ పార్లమెంట్ జరుపుతున్న కొత్త దాడిని తీవ్రంగా నిరసించింది. క్యూబన్లపై దాడి చేయడానికి, వారు సాధించిన విజయాలకు విఘాతం కలిగించడానికి ఇయు చేస్తున్న ప్రయత్నాలను యురోపియన్ పార్లమెంట్ ఆమోదించిన కొత్త తీర్మానం మరింత పెచ్చరిల్లేలా చేస్తోందని విమర్శించింది. క్యూబా కార్మిక లోకానికి, ప్రజలకు సంఘీభావాన్ని పునరుద్ఘాటిస్తూ ఆ దేశంపై అమానవీయమైన రీతిలో సుదీర్ఘంగా అమలవుతున్న ఆంక్షలను బేషరతుగా ఉపసంహరించాలని డిమాండ్ చేసింది. మోంకాడా డేని స్మరించుకుంటూ సంఘీభావ కార్యాచరణ చేట్టాల్సిందిగా తన సభ్యులకు పిలుపునిచ్చింది.










