Nov 07,2023 12:05

రాయ్ పూర్‌  :    ఛత్తీస్‌గఢ్‌లో సుక్మా జిల్లాలో మావోయిస్టులు పేలుడుకు పాల్పడ్డారు. మంగళవారం ఉదయం మొదటి దశ పోలింగ్‌ ప్రారంభమైన కొద్దిసేపటికే ఈ పేలుడు ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎన్నికల విధుల్లో ఉన్న ఓ సిఆర్‌పిఎఫ్‌ జవాన్‌ తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు.

సుక్మా జిల్లాలోని తొండమార్క ప్రాంతంలో ఉదయం 8.30 గంటలకు మావోయిస్టులు మందుపాతర పేల్చారు. దీంతో పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్న సిఆర్‌పిఎఫ్‌ కోబ్రా బెటాలియన్‌కు చెందిన శ్రీకాంత్‌ తీవ్రంగా గాయపడినట్లు జిల్లా ఎస్‌పి కిరణ్‌ ఛవాన్‌ తెలిపారు. మెరుగైన చికిత్స కోసం జవానుని  హెలికాప్టరులో ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. గత రెండు రోజుల్లో మావోయిస్టులు పేలుళ్లకు పాల్పడటం ఇది రెండోసారి. సోమవారం కాంకేర్‌ జిల్లాలో జరిగిన ఐఇడి పేలుడులో బిఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌, ఇద్దరు పోలింగ్‌ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు.

ఛత్తీస్‌గఢ్‌లో మొదటి విడతలో భాగంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని 20 నియోజకవర్గాల్లో మంగళవారం పోలింగ్‌ ప్రారంభమైంది. ఇందులో 12 నియోజకవర్గాలు బస్తర్‌ డివిజన్‌లోనే ఉన్నాయి. అయితే ఈ ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని మిగిలిన 70 స్థానాల్లో ఈ నెల 17న ఎన్నికలు జరుగనున్నాయి.