Jun 28,2022 06:23
  • రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించి నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవడానికి, పంటలు దెబ్బతిన్న ప్రతి రైతుకూ బీమా పరిహారం అందించటానికి మండల స్థాయిలో స్పెషల్‌ స్పందన కార్యక్రమాలు వారం రోజులు పాటు నిర్వహించాలి. అక్కడిక్కడే సెటిల్‌ చేయాలి. ఇ-క్రాప్‌ బుకింగ్‌ జరగని కౌలు రైతులను గుర్తించి పరిహారం చెల్లించాలి. పరిహారం రానివారు జులై 15 లోగా ఫిర్యాదు చేసుకోవడానికి గడువు ఇచ్చినప్పటికీ, వాటిని పరిష్కరించాలంటే రైతు భరోసా కేంద్రంలో ఉన్న సిబ్బందితోపాటు అదనంగా మరికొందరిని కేటాయించాలి. కౌలు రైతులకు పరిహారం రానందున కౌలు రైతులను గుర్తించడానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి విచారించి పరిహారం అందే విధంగా తగిన చర్యలు చేపట్టాల్సి ఉంది.

గతేడాది ఖరీఫ్‌లో తుపాన్లు, అధిక వర్షాలు, వరదలు, చీడపీడలు వల్ల 36 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ప్రధానంగా వరి, పత్తి, మిరప, వేరుశనగ, అపరాలు తదితర పంటలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. పత్తి, మిరప పంటలైతే వాతావరణ ప్రభావం వల్ల పూర్తిగా దెబ్బతిన్నాయి. నష్టపోయిన రైతులకు పరిహారం అందజేస్తామని రాష్ట్ర ప్రభుత్వం వాగ్దానం చేసింది. కానీ అచరణలో రైతులందరికీ సక్రమంగా అందలేదని సమాచారం.

  • ఇచ్చిన పరిహారం

జూన్‌ 14న ముఖ్యమంత్రి జగన్‌ చేతుల మీదుగా రూ.2977 కోట్లను 15.60 లక్షల మంది రైతులకు పరిహారం ఇస్తున్నట్లు లబ్ధిదారుల జాబితాను విడుదల చేశారు. ఇది చాలా అన్యాయం.

  • జరిగిన నష్టం

గత ఖరీఫ్‌లో మొత్తం సాగు 88.80 లక్షల ఎకరాలు. వరి, పత్తి, మిరప, కంది, వేరుశనగ సాగు విస్తీర్ణం 79.93 లక్షల ఎకరాలు. పూర్తిగా, పాక్షికంగా దెబ్బతిన్న విస్తీర్ణం 51.53 లక్షల ఎకరాలు. పెట్టుబడి నష్టం రూ.16 వేల కోట్లు, ఉత్పత్తి నష్టం రూ.20 వేల కోట్లు పైమాటే. నష్టపోయిన దాంట్లో 50 శాతం కూడా ఇవ్వలేదు. వివిధ కారణాల రీత్యా పంటలు దెబ్బతిన్నపుడు పరిహారం ఇప్పించాలని రైతులు క్లయిమ్‌ చేసినా పరిహారం వచ్చేది కాదు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులు చెల్లించిన ప్రీమియం మేరకు నష్ట పరిహారం ఇవ్వడం లేదు. ఈ పథకాల వల్ల రైతులకన్నా ప్రైవేటు బీమా కంపెనీలే బాగు పడ్డాయి. అందులో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ వంటి 9 రాష్ట్రాల్లో ఈ పథకాలను అమలు చేయకుండా ప్రత్యామ్నాయం చూసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రూ.100 కోట్లతో ఒక బీమా కంపెనీ పెట్టాలని కేంద్ర ప్రభుత్వం అనుమతి కోరింది. కేంద్ర ప్రభుత్వం అంగీకరించనందున బీమా పాలసీ నిబంధనలు పాటిస్తూ జరిగిన నష్టానికి తన ఖజానా నుండి పరిహారం అందజేస్తోంది.
ప్రకటించిన బీమా ఇప్పటికీ చాలా జిల్లాల్లో నష్టపోయిన రైతులకు అందలేదని అందోళన వ్యక్తమవుతోంది. ఈ రోజుకు కూడా నష్టపోయిన లబ్ధిదారుల లిస్టును కొన్ని రైతు భరోసా కేంద్రాలలో గోప్యంగా ఉంచారు. పరిహారం అందించడానికి తీసుకున్న ప్రమాణాలు కూడా సమగ్రంగా లేవని తెలుస్తోంది.

  • బీమా పాలసీలో ఏముంది ...

కేంద్ర ప్రభుత్వం 2016లో పంటల బీమా పాలసీని తీసుకు వచ్చింది. ఇందులో రెండు రకాలైన బీమా పాలసీలు ఉన్నాయి. ఒకటి ఉత్పత్తి ఆధారిత, రెండోది తాజా పరిచిన వాతావరణ ఆధారిత పథకాలు. పంట విలువలో ఖరీఫ్‌లో 2 శాతం, రబీలో 1.5 శాతం, ఉద్యాన, వాణిజ్య పంటలకు 5 శాతాన్ని బ్యాంకులిచ్చే 'స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌'ను బట్టి బీమా ప్రీమియాన్ని రైతులు చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం 15 ప్రైవేటు బీమా కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. రైతులు చెల్లించే ప్రీమియం మినహా మిగిలిన ప్రీమియాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించేవి.

  • రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది ?

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఒక రూపాయికే పంటల బీమా అని తొలి ఏడాదిలో మొదట చెప్పింది. ఆ తరువాత ఉచిత పంటల బీమా పథకాన్ని ప్రవేశ పెట్టింది. పంటల బీమాలో నమోదు చేయడానికి ఆధార్‌ కార్డు ఆధారంగా రైతు భరోసా కేంద్రంలో రిజిస్ట్రేషన్‌ చేయాలని, రైతులను పంట పొలాల్లో నిలబెట్టి ఈ-క్రాప్‌ బుకింగ్‌ చేయాలని, ఆ తరువాత ఇకెవైసి చేయాలని ప్రకటించింది.

  • రాష్ట్రంలో సాగు ఎంత ?

రాష్ట్రంలో 80.96 లక్షల ఎకరాలలో వ్యవసాయం చేస్తున్నారు. ఇందులో 65.75 లక్షల మంది చిన్న, సన్నకారు రైతులు 44.11 లక్షల ఎకరాలలో సాగు చేస్తున్నారు. మిగిలిన 36.85 లక్షల ఎకరాలలో కౌలు రైతులు పంటలు పండిస్తున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 15.60 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు. వీరుగాక లంక భూములు, బంజరు భూములు, పోడు భూములు, అటవీ హక్కుల చట్టం ద్వారా పట్టాలు పొందిన వారు అనేక లక్షల మంది స్వయంగా పంటలు పండిస్తున్నారు.

  • ఇ-క్రాప్‌ బుకింగ్‌కు సిబ్బంది కొరత

సాగు చేస్తున్న రైతులను, వారి పంటలను ఇ-క్రాప్‌ బుకింగ్‌ చేయాలంటే రైతు భరోసా కేంద్రంలో ఉన్న సిబ్బంది చాలరు. రాష్ట్రం మొత్తంగా 10,871 రైతు భరోసా కేంద్రాలున్నాయి. సిబ్బంది మాత్రం 10,871 మందే ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇ-క్రాప్‌, ఇకెవైసి, బీమా గురించి రైతుల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించాలి. కరపత్రాలు వేసి ప్రచారం చేయాలి. మైక్‌ ద్వారా గ్రూపు మీటింగులు జరపాలి. సమాచారాన్ని మారుమూల ప్రాంతాలకు కూడా తీసుకు వెళ్లాలి. ఆ విధంగా ప్రచారం చేయాలి. దీనికి తగిన సిబ్బంది ఏర్పాటు జరగాలి. 50 కుటుంబాలకు ఒక వాలంటీరును పెట్టినట్లు సాగు భూములను పరిగణనలోకి తీసుకొని సిబ్బందిని ఏర్పాటు చేయాలి. నిర్లక్ష్యంగా వ్యవహరించకుడా తగు జాగ్రత్తలు రైతులకు ఎప్పటికప్పుడు చెప్పాలి.
బీమా కింద పంటలను నోటిఫికేషన్‌ చేయటంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో ఏయే పంటలను ఏ బీమా పథకం కింద గుర్తిస్తున్నారో తెలియక పోవడం వలన ఎక్కువ నష్టం జరిగింది. పల్నాడు జిల్లాలో ఇరిగేషన్‌ పరిధిలో మిరప పంట ఎక్కువగా పండుతోంది. కానీ పంటను వర్షాధార పంట కింద నమోదు చేయటం వల్ల మిరప రైతులు నష్టపోయారు. ఎన్టీఆర్‌ జిల్లాలో వర్షాధార పంట కింద గుర్తించారు. ఎన్యూమరేషన్‌ చేసే సందర్భంలో పంటల నమోదు అదర్స్‌ కాలమ్‌లో నమోదు జరగటం వల్ల పరిహారం రాలేదు. దీనికి ప్రభుత్వమే ప్రధాన కారణం. అనంతపురం జిల్లాలో వేరుశనగ, కంది పంటలను అదర్స్‌ కాలమ్‌లో నమోదు చేశారు. అక్కడ కూడా భారీగా నష్టం జరిగింది. ప్రకాశం జిల్లాలో ఉత్పత్తి ఆధారిత, వాతావరణ ఆధారిత పథకాలు ఉన్నప్పటికీ ఏ పంటకూ పరిహారం రాలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో పంటలకు ఎక్కువగా నష్టం జరిగింది. ఇక్కడ ఏ ఒక్క రైతుకూ పరిహారం రాలేదు.
ఆధికార పార్టీ వారు పంటలు పండించకుండానే గుంటలు, కొండలు, వాగులు, వంకలతోపాటు చివరికి శ్మశానవాటికల్లోనూ పంటలు పండించినట్లు రాసుకొని కోట్లాది రూపాయిలు కాజేస్తున్నారు. కృష్ణా జిల్లాలో రైతులకు తెలియకుండానే ఇతరుల చేత ఇకెవైసి చేయించారు. వారికి డబ్బులు వేశారు. ఏ జిల్లాలో చూసినా రైతుల ఆవేదన చెప్పనలవి గాకుండా ఉంది. ఎన్నడూ లేనిది రైతులు ఆందోళనలకు దిగారు. రైతు భరోసా కేంద్రాలకు తాళాలు కూడా వేశారు.

  • కౌలు రైతుల పరిస్థితి అగమ్యగోచరం

రాష్ట్రంలో మారిన వ్యవసాయ పరిస్థితులలో కౌలు రైతుల పాత్ర గణనీయంగా ఉంది. కౌలు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి సహాయ సహకారాలు అందించడం లేదు. కౌలు గుర్తింపు కార్డులు, పంటల బీమా, రైతు భరోసా, పంట రుణాలు, ఇన్‌పుట్‌ సబ్సిడీ తదితర వ్యవసాయ శాఖ ఇచ్చే రాయితీ పథకాలు కౌలు రైతుల దరి చేరటం లేదు. వాస్తవంగా కౌలు చేస్తోంది పేద రైతులే అయినప్పటికీ భూ యజమాని తమ పేర్లను ఇ-క్రాప్‌ బుకింగ్‌లో ఎక్కించుకొని ఇకెవైసి చేసుకుని బీమా పరిహారాలు కాజేస్తున్నారు. ఇ-క్రాప్‌ బుకింగ్‌ చేసేటప్పుడే కౌలు రైతులకు గుర్తింపు కార్డులు జారీ చేస్తామని చెప్పింది. ఒక వేళ కార్డులు లేకపోయినా ఇ-క్రాప్‌ బుకింగ్‌ చేస్తామని చెప్పి బొంకింది. గుర్తింపు కార్డులు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆటంకాలను కలిగించింది. సిసిఆర్‌సి కార్డులు పొందకుండానే అనేక ఆంక్షలు పెట్టింది. దీనివల్ల 'అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్లు'గా కౌలు రైతుల పరిస్థితి దాపురించింది. ఉదాహరణకు గుంటూరు జిల్లాలో ముప్పాళ్ల మండలం మాదాల గ్రామంలో 758 మందికి బీమా పరిహారం వస్తే ఇందులో ఒక్క కౌలు రైతుకు కూడా పరిహారం రాలేదు. కోనసీమ ప్రాంతంలో 90 శాతం మంది వరి పండించే రైతులు. ప్రతి సంవత్సరం ఆ ప్రాంతం రైతులు అధిక వర్షాలు, వరదలు, డ్రైనేజీ మునక వలన ఖరీఫ్‌ సాగు దెబ్బతిని పంటలు కోల్పోతారు. ముందస్తుగా కౌలు చెల్లించి, పెట్టుబడి పెట్టి పంట చేతికి రాక, దిగుబడి లేక అన్ని రకాలుగా నష్టానికి గురవుతున్నారు. వారికి కూడా పరిహారం దక్క లేదు.

  • ఏం చేయాలి?

స్థూలంగా పరిశీలిస్తే నష్టపోయిన రైతులకు ఇ-క్రాప్‌ బుకింగ్‌ సక్రమంగా జరగలేదు. ఇకెవైసి చేసే సందర్భంలో రైతులకు తగిన సమాచారం ఇవ్వలేదు. ప్రచారమూ లేదు. క్రాప్‌ కటింగ్‌ ఎక్స్‌పరిమెంట్లు సక్రమంగా జరపలేదు. పర్యావరణ ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. నష్ట పరిహారాన్ని అంచనా వేసేటప్పుడు అనుసరించిన విధానం లోపభూయిష్టంగా ఉంది. పసుపుకు మినహా అన్ని పంటలకు రిస్క్‌ శాతాన్ని తగ్గించడం వల్ల పరిహారం తగ్గింది.
రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించి నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవడానికి, పంటలు దెబ్బతిన్న ప్రతి రైతుకూ బీమా పరిహారం అందించటానికి మండల స్థాయిలో స్పెషల్‌ స్పందన కార్యక్రమాలు వారం రోజులు పాటు నిర్వహించాలి. అక్కడిక్కడే సెటిల్‌ చేయాలి. ఇ-క్రాప్‌ బుకింగ్‌ జరగని కౌలు రైతులను గుర్తించి పరిహారం చెల్లించాలి. పరిహారం రానివారు జులై 15 లోగా ఫిర్యాదు చేసుకోవడానికి గడువు ఇచ్చినప్పటికీ, వాటిని పరిష్కరించాలంటే రైతు భరోసా కేంద్రంలో ఉన్న సిబ్బందితోపాటు అదనంగా మరికొందరిని కేటాయించాలి. కౌలు రైతులకు పరిహారం రానందున కౌలు రైతులను గుర్తించడానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి విచారించి పరిహారం అందే విధంగా తగిన చర్యలు చేపట్టాల్సి ఉంది.


- పి.జమలయ్య, ఎ.పి రైతు సంఘం ప్రధాన కార్యదర్శి