Jun 22,2022 06:44

ఆహార పంటల్లో పెద్దగా లాభాలు రావడం లేదు. కాబట్టి కాసులు దండుకోవాలంటే ఆక్వా కల్చర్‌ తప్ప మరో మార్గం లేదన్న నిర్ణయానికి సంపన్న వర్గం వచ్చింది. ఇప్పటికే కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అక్రమంగా పెద్దఎత్తున ఆక్వా సాగు చేస్తున్నారు. ఆ ప్రాంతంలో మొత్తం ఆక్వా విస్తరించి పంట కాల్వలన్నీ కలుషితమై పశువులు తాగడానికి కూడా నీరు కొనుక్కోవాల్సిన దుస్థితి వచ్చింది. ఒకనాడు అన్నపూర్ణగా పేరుగాంచిన ప్రాంతం ఆక్వా సాగు వల్ల వ్యవసాయ కార్మికులకు పనులు లేక గ్రామాలకు గ్రామాలే వలసలు పోతున్నాయి. ఆక్వా కుబేరులు మాత్రం డాలర్లు సంపాదించి పెద్దపెద్ద నగరాల్లో విలాసవంతమైన జీవనం గడుపుతున్నారు.

కోనసీమలో మరొకసారి పంట విరామం (క్రాప్ హాలిడే) చర్చ ముందుకు వచ్చింది. క్రాప్‌్‌ హాలిడేను ఉపసంహరించుకొని తక్షణమే వరి సాగు ప్రారంభించాలని మంత్రులు, అధికారులు మైకులు పెట్టి ఊరూరా తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. ఏ రైతాంగం క్రాప్‌ హాలిడే ప్రకటించింది? ఎవరి ప్రయోజనాల కోసం క్రాప్‌్‌ హాలిడే? దీని వెనక ఉన్న ప్రయోజనం ఏమిటీ అనేది క్షేత్ర స్థాయి లోకి వెళితే తప్ప అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా కోనసీమ లోనే పదే పదే ఈ డిమాండ్‌ ఎందుకు వస్తుంది?
       గతంలో చూసినా, నేడు పరిశీలించినా పంట విరామ అంశాన్ని ముందుకు తెచ్చింది భూస్వామ్య, గ్రామీణ సంపన్నులే. దీనికి మూడు ప్రధాన కారణాలు 1. ఆహార ధాన్యాల స్థానంలో ఆక్వా సాగుకు అనుమతించాలి. 2. ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం చేయాలి. 3. కౌలు రైతులకు ఎటువంటి హక్కులు ఇవ్వరాదు. వీటి కోసం భూస్వామ్యవర్గం అంతర్గతంగా చేస్తున్నటువంటి డిమాండే క్రాప్‌ హాలిడే. దీనికి రాజకీయాలు తోడై తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం గతంలోను, ఇప్పుడూ కొన్ని పార్టీలు వెంట ఉండి క్రాప్‌ హాలిడేను ప్రోత్సహిస్తున్నాయి.
        కోనసీమలో 16 మండలాలు, సుమారు 280 పంచాయితీలు ఉన్నాయి. 12 మండలాలు 240 పంచాయితీలలో క్రాప్‌ హాలిడే గురించి చర్చ జరుగుతుంది. ఇందులో ఆరు మండలాలు ఐ.పోలవరం, కాట్రేనికోన, ఉప్పలగుప్తం, అల్లవరం, అమలాపురం, అంబాజీపేట మండలాల్లో మాత్రమే 150 మంది రైతులు మండలాధికారుల దగ్గరకు వెళ్ళి క్రాప్‌ హాలిడే ప్రకటిస్తున్నట్లు వినతి పత్రాలు ఇచ్చారు. దీనికి వెంటనే కలెక్టర్‌ స్పందించి రైతులను చర్చలకు ఆహ్వానించి చివరకు వారితో కలవకుండానే ముఖం చాటేశారు. దీనికి కోపోద్రిక్తులైన రైతులు వెంటనే పంట విరామం ప్రకటిస్తున్నామని, రైతాంగాన్ని ఆదుకోవాలని బిక్షాటన చేసి తమ నిరసనను వెలిబుచ్చారు. దీనిని పాలకవర్గం వారి ప్రయోజనాలకు అనుగుణంగా ప్రచారం మొదలు పెట్టారు. రైతులు చెప్పినటువంటి అంశాలను పరిగణలోకి తీసుకోకుండా, శాశ్వతమైన పరిష్కారం ఆలోచించకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా తమకు తోచిన రీతిలో ముందుకు వెళుతున్నది.
      ఈ ప్రాంతంలో 2011, 2017లో కూడా పంట విరామం ప్రకటించారు. ఆ రోజు విరామం ప్రకటించడానికి ప్రభుత్వ విధానాలు ఒక భాగమైతే ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం చేయాలనే డిమాండ్‌ను ప్రధానంగా ముందుకు తెచ్చారు. ఆ రోజుల్లో కూడా విరామం అంశాన్ని ముందుకు తెచ్చింది వ్యవసాయం చేయని భూస్వాములు, ధనిక రైతులు మాత్రమే. విరామానికి వ్యతిరేకంగా వ్యవసాయ కార్మికులు, కౌలు, పేద రైతులు ఐక్యమై ఆర్డీవో కార్యాలయం ముందు ఆందోళనలు చేపట్టడంతో ప్రభుత్వం సీరియస్‌గా తీసుకొని పంట విరామాన్ని విరమింపచేసింది. వరి పంటలో పెద్దగా లాభాలు రావడం లేదని పక్కన ఉన్న కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఆక్వా సాగు విస్తరిస్తున్నది. ఇది కోనసీమ వరకు పాకింది. ఇక్కడ కూడా ఆక్వా కల్చర్‌ తెస్తే పెద్దఎత్తున లాభాలు రాబట్టుకోవచ్చన్న అంశం ప్రధానమైనది. కానీ ఈ ప్రాంతంలో ఆక్వా సాగుకు ప్రజల వ్యతిరేకత, ప్రభుత్వ జీవోలు అడ్డంకిగా ఉన్నాయి. పైఆటంకాలను అధిగమించడానికి ఆక్వా సాగుకు ప్రభుత్వాన్ని ఒప్పించడానికే సంపన్న వర్గం పంట విరామాన్ని ముందుకు తెచ్చింది. ఈ ఏడాది అక్కడక్కడ కొంతమంది కౌలురైతులు కూడా పంట విరామాన్ని సమర్థిస్తున్నట్లు కనిపిస్తున్నారు. దీనికి ప్రభుత్వ విధానాలే ప్రధాన కారణం.
      ప్రభుత్వం రైతుల ధాన్యాన్ని సకాలంలో మద్దతు ధరకు కొనడంలేదు. కొన్న ధాన్యానికి నెలల తరబడి బకాయిలు చెల్లించడంలేదు. ఐదు దశాబ్దాలుగా మేజర్‌ పంట కాలువలను, డ్రైనేజీల పూడిక తీయకపోవడం వల్ల ప్రతీ ఏటా మొదటి పంట మునిగిపోయి కౌలుదార్లు నష్టపోయినా అనివార్యంగా యజమానులకు కౌలు చెల్లించాల్సి వస్తోంది. సముద్రపు ఉప్పు నీరు ఎగదన్నకుండా ఉన్న స్లూయిజ్‌ గేట్లను మరమ్మతులు చేయలేదు. అదనంగా కొత్త గేట్లను పెట్టకపోవడంతో మొదటి పంట మునిగిపోతోంది. పెద్దఎత్తున కాలువ గట్లు పక్కన భూములు ఆక్రమణకు గురై చిన్న వరదలు వచ్చినా పంట మునిగిపోతోంది. ఈ కారణంగా సన్న, చిన్నకారు, కౌలు రైతులలో కూడా పంట విరామం డిమాండ్‌ మొదలైంది.
     ఈ ప్రాంతంలో ఏడాదికి మూడు పంటలు వేస్తారు. మొదటి, రెండవ పంట వరి. మూడవ పంటగా మినుములు లాంటివి చల్లుకుంటారు. ఏప్రిల్‌, మే, జూన్‌ మాసాలలో ఉపాధి హామీ పనులు ముమ్మరంగా సాగుతాయి. ఈ సమయంలో రెండవ పంట వరి మిషన్లతో కోసినా... గడ్డి కట్టడానికి, చిన్న చిన్న పనులు చేయడానికి 15 రోజుల పాటు కూలీలు ఉపాధి హామీ పనుల్లో ఉండి అందుబాటులో ఉండరు. పిలిచినా రారు. కాబట్టి ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని లేదా క్యాలెండర్‌ ప్రకటించాలని వారి డిమాండ్‌.
      గత మూడు సంవత్సరాల నుండి ఐ.పోలవరం, కాట్రేనికోన, ఉప్పలగుప్తం, అల్లవరం మండలాలకు సంబంధించి సుమారు ఏడు వేల ఎకరాలకు పైగా సముద్రపు నీరు ఎగదన్ని మొదటి పంట మొత్తం మునిగిపోతుంది. ఇందులో 90 శాతం భూమి కౌలుదారులు సాగు చేస్తున్నారు. పంట పండినా, పండకపోయినా భూయజమానికి పది బస్తాలు చెల్లించాలి. పంట నష్టం, క్రాప్‌ ఇన్స్యూరెన్స్‌ ఎటువంటి నష్టపరిహారం వచ్చినా భూ యజమానులే తీసుకుంటున్నారు. ప్రభుత్వం కౌలుదార్లకి అన్ని హక్కులు కల్పిస్తామన్న మాటల్లో ఒక్కటి కూడా అమలు జరగడం లేదు. ఈ కారణంగా గతంలో లేని విధంగా కౌలుదార్లలో కొంత చైతన్యం వచ్చింది. అక్కడక్కడ మొదటి పంట పూర్తిగా నష్టం వస్తుంది. కాబట్టి పది బస్తాలకు బదులు ఐదు బస్తాలు మాత్రమే ఇస్తాము. రెండవ పంటకు పన్నెండు బస్తాలు ఇస్తాం. అలాగైతేనే కౌలు చేస్తాం. లేదంటే కౌలు మాను కుంటాం- అన్న డిమాండ్‌ కూడా ముందుకు వచ్చింది. ఇది భూ యజమానులకు మింగుడు పడని అంశం. ఈ కారణంగా కూడా కౌలురైతులకు ఎటువంటి హక్కులు ఇవ్వకుండా ప్రభుత్వాన్ని నిలేయడానికి కూడా పంట విరామం ముందుకు తెచ్చారు. వ్యవసాయ కార్మికులు, కౌలు రైతులు, చిన్న, సన్నకారు రైతులు విరామాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జూన్‌ నెల ఆఖరిలోపు నారుమళ్ళు పోయాలి. కానీ చాలా చోట్ల ఇంకా ప్రారంభం కాలేదు. ఈ నెల చివరి నాటికి కోనసీమలో ఉన్న ఆరు మండలాల్లో పంట విరామం అంశం తెలిసిపోతుంది. కాబట్టి క్రాప్‌ హాలిడే ప్రకటించడానికి ప్రధాన కారణం కోనసీమలో ఆక్వా సాగుకు అనుమతించాలని భూస్వామ్య వర్గం పెద్దఎత్తున చేస్తున్న ప్రయత్నమే. తమ రాజకీయ ప్రయోజనాల కోసం పాలక వర్గాలు దీనికి వత్తాసు పలుకుతున్నాయి.
ఆక్వా సాగు కోసమే...?
        ఆహార పంటల్లో పెద్దగా లాభాలు రావడం లేదు. కాబట్టి కాసులు దండుకోవాలంటే ఆక్వా కల్చర్‌ తప్ప మరో మార్గం లేదన్న నిర్ణయానికి సంపన్న వర్గం వచ్చింది. ఇప్పటికే కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అక్రమంగా పెద్దఎత్తున ఆక్వా సాగు చేస్తున్నారు. ఆ ప్రాంతంలో మొత్తం ఆక్వా విస్తరించి పంట కాల్వలన్నీ కలుషితమై గ్రామాలలో కనీసం పశువులు తాగడానికి కూడా నీరు కొనుక్కోవాల్సిన దుస్థితి వచ్చింది. ఏ ఊళ్లో చూసినా అంటువ్యాధులే. చివరకు పశువులు కూడా ఈ నీరు తాగి ఈసుకుపోతున్నాయి. పాడిపరిశ్రమంతా ధ్వంసమవుతున్నది. ఒకనాడు అన్నపూర్ణగా పేరుగాంచిన ప్రాంతం ఆక్వా సాగు వల్ల వ్యవసాయ కార్మికులకు పనులు లేక గ్రామాలకు గ్రామాలే వలసలు పోతున్నాయి. ఆక్వా కుబేరులు మాత్రం డాలర్లు సంపాదించి పెద్దపెద్ద నగరాల్లో విలాసవంతమైన జీవనం గడుపుతున్నారు. క్రాప్‌ హాలిడే వెనకున్న ప్రధాన ఉద్దేశ్యం ఇదే. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం శాశ్వతమైన పరిష్కారం చేపట్టాలి.

                                                                 ఆహార పంటల్లో పెద్దగా లాభాలు రావడం లేదు. కాబట్టి కాసులు దండుకోవాలంటే ఆక్వా కల్చర్‌ తప్ప మరో మార్గం లేదన్న నిర్ణయానికి సంపన్న వర్గం వచ్చింది. ఇప్పటికే కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అక్రమంగా పెద్దఎత్తున ఆక్వా సాగు చేస్తున్నారు. ఆ ప్రాంతంలో మొత్తం ఆక్వా విస్తరించి పంట కాల్వలన్నీ కలుషితమై పశువులు తాగడానికి కూడా నీరు కొనుక్కోవాల్సిన దుస్థితి వచ్చింది. ఒకనాడు అన్నపూర్ణగా పేరుగాంచిన ప్రాంతం ఆక్వా సాగు వల్ల వ్యవసాయ కార్మికులకు పనులు లేక గ్రామాలకు గ్రామాలే వలసలు పోతున్నాయి. ఆక్వా కుబేరులు మాత్రం డాలర్లు సంపాదించి పెద్దపెద్ద నగరాల్లో విలాసవంతమైన జీవనం గడుపుతున్నారు.

                                                 వి. వెంకటేశ్వర్లు
            / వ్యాసకర్త : వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సెల్‌ : 9490098980 /