Jul 22,2023 07:03

         మణిపూర్‌ మారణకాండపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎట్టకేలకు నోరు మెదిపారు. సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసం గిరిజన తెగల మధ్య బిజెపి పెట్టిన చిచ్చుతో మణిపూర్‌ దాదాపు మూడు నెలలుగా నెత్తురోడుతోంది. బిజెపి గొప్పగా చెప్పుకునే 'డబుల్‌ ఇంజిన్‌' ప్రభుత్వాలు, సుపరిపాలనలోని డొల్లతనాన్ని ఇది మరోసారి బయటపెట్టింది. మణిపూర్‌ తగలబడుతుంటే అమెరికా, ఫ్రాన్స్‌ పర్యటనల్లో మునిగి తేలిన ప్రధానికి ఈ ఈశాన్య రాష్ట్రం వైపు తొంగి చూసే తీరికే లేకపోయింది. మణిపూర్‌లో మానవ హక్కులు హరించే వ్యక్తికి ఇక్కడ స్వాగతం లేదు అని అమెరికా, ఫ్రాన్స్‌లో సామాజిక కార్యకర్తలు, ప్రజాతంత్రవాదులు గళమెత్తినా, మణిపూర్‌లో మానవ హక్కుల హననంపై యూరోపియన్‌ పార్లమెంటు తీర్మానం చేసినా ఖాతరు చేయలేదు. మణిపూర్‌ మంటలను ఆర్పేందుకు అక్కడి ముఖ్యమంత్రిని వెంటనే మార్చాలని ప్రతిపక్ష పార్టీలు చేసిన డిమాండ్‌కు వీసమెత్తు విలువ కూడా ఇవ్వలేదు. చివరికి మే4న మణిపూర్‌ మహిళలపై జరిగిన అమానుషత్వానికి సంబంధించిన విజువల్స్‌తో కూడిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవడం, సుప్రీం కోర్టు గట్టిగా మొట్టికాయలేయడంతో ప్రధాని నోరు విప్పారు.
        బిజెపి ప్రోద్బలంతో పట్టపగ్గాలు లేకుండా రెచ్చిపోతున్న మానవ మృగాలు.. కుకీ తెగకు చెందిన ముగ్గురు ఆడ తల్లులపై అఘాయిత్యాలకు పాల్పడడం, అడ్డుకోబోయిన కుటుంబ సభ్యుల్లో ఇద్దరిని హత్య చేయడం, ఇద్దరు మహిళలను నగంగా ఊరేగించడం, మరో మహిళను ఆటబొమ్మను ఆడించినట్లు ఆడించి.. వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసిన కిరాతక చర్యపై సర్వత్రా నిరసనాగ్రహాలు వ్యక్తమయ్యాయి. మణిపూర్‌లో జరిగిన ఈ ఘోరాతిఘోరంపై ప్రధాని మొసలి కన్నీరు కార్చగా, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌ ఒక టీవి చానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు అత్యంత జుగుస్సాకరంగా ఉన్నాయి. మణిపూర్‌లో ఇటువంటి ఘోరాలు బయటకు రాకూడదన్న ఉద్దేశంతోనే ఇంటర్నెట్‌ను నిషేధించామని ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడడం హేయాతి హేయం. మణిపూర్‌లో మానవత్వాన్ని మంటగలిపిన ఆ దాష్టీకంపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి వై చంద్రచూడ్‌ సరిగానే స్పందించారు. ఈ అమానుష ఘటనకు కారకులైన వారిపై చర్య తీసుకుంటారా, లేక మమ్మల్నే ఆ పని చేయమంటారా అని కేంద్ర, మణిపూర్‌ ప్రభుత్వాలను భారత ప్రధాన న్యాయమూర్తి నిలదీసిన తరువాత కూడా ఏలికల తీరు మారలేదు. రెండు రోజులుగా పార్లమెంటు ఉభయ సభలు దీనిపై స్తంభించిపోయాయి. యావత్‌ భారత ప్రజానీకాన్ని కలచివేసిన మణిపూర్‌ దారుణాలపై చర్చకు మోడీ ప్రభుత్వం ససేమిరా అంటున్నది. మరో వైపు మహిళలకు వ్యతిరేకంగా నేరాలకు పాల్పడేవారిపై ముఖ్యమంత్రులు కఠిన చర్యలు తీసుకోవాలి' అంటూ పార్లమెంటు వెలుపల సుద్దులు చెబుతున్నది. ఇది వంచన కాదా ?
         ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటించిన ప్రతిసారి పర్వత ప్రాంతాల ప్రగతికి ప్రత్యేక దృష్టిసారించామంటూ వాగాడంబర ప్రకటనలు చేసే మోడీ మణిపూెర్‌ను రావణ కాష్టంలా మార్చుతున్న అరాచక శక్తుల పీచమణిచేందుకు ఎందుకు సిద్ధపడడం లేదు. రాజకీయ లబ్ది కోసం హిందువులకు ప్రాతినిధ్యం వహించే మెజారిటీ మెయితీలకు ఆయుధాలు చేరవేసి క్రిస్టియన్‌ మైనార్టీలకు చెందిన కుకీ తెగలపై ఉసిగొల్పిన పాపం ఎవరిది? హిందూత్వ శక్తులది కాదా? కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పర్యటించిన తరువాత మణిపూర్‌లో మంటలు చల్లారకపోగా, మరింత పెరిగాయి. మణిపూర్‌లోశాంతిని పునర్దుధరించేందుకు ప్రధాన అడ్డంకి అక్కడి ముఖ్యమంత్రి బీరేన్‌సింగే కాబట్టి ఆయనను వెంటనే ఆ పదవి నుంచి తొలగించాలి. మే 4 నాటి దారుణానికి కారకులైనవారిని బోనులో నిలబెట్టాలి. మణిపూర్‌ హింసాకాండలో బాధితుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకోవాలి.