Oct 18,2023 21:37

- వాస్తవ లబ్ధిదారులకే అసైన్డ్‌ భూముల పట్టాలివ్వాలి
ప్రజారక్షణ భేరి యాత్రలను జయప్రదం చేయండి..
ప్రజాశక్తి -ఏలూరు ప్రతినిధి, ఏలూరు అర్బన్‌:విశాఖపట్నానికి మకాం మారుస్తానని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రకటించడం ప్రజల మనోభావాలను దెబ్బతీయడమేనని, అమరావతి నుంచే రాష్ట్ర పరిపాలన సాగాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. ఏలూరులోని ఉద్దరాజు రామం భవనంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడు రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వమే అసెంబ్లీలో ప్రకటించిందని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి క్యాంపు ఆఫీస్‌ ఎక్కడైనా ఉండొచ్చని, అయితే అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలను విశాఖపట్నం మారుస్తానంటే ప్రజలు హర్షించరని, ఇది అస్థిరత్వ పాలనకు దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇష్టానుసారంగా వ్యవహరించడానికి ఇది రాచరికం కాదని, ప్రజాస్వామ్యమని గుర్తు చేశారు. అసైన్డ్‌ భూములకు పట్టాలిస్తామని, అమ్ముకునే హక్కులు కల్పిస్తామని చెప్పడం ద్వారా వాస్తవ అసైన్డ్‌ లబ్ధిదారులకు అన్యాయం జరుగుతుందని చెప్పారు. మహిళల పేరుతో అసైన్డ్‌ భూములకు పట్టాలివ్వాలని కోరారు. కృష్ణా డెల్టా పరిధిలో ఏలూరు, బాపట్ల, కృష్ణా, గుంటూరు తదితర జిల్లాల్లో వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని, పట్టిసీమ ద్వారా సాగునీరు అందించి పంటలను కాపాడాలని కోరారు. చంద్రబాబుతో ములాఖత్‌ విషయంలో ఆంక్షలు విధించడం సరికాదన్నారు. మాజీ మంత్రులను, మాజీ ఎమ్మెల్యేలను అరెస్టులు చేయడం తగదన్నారు. ఇతర పార్టీలు, వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు, ఉద్యమాలపైన నిర్బంధం ప్రయోగిస్తున్న సందర్భాల్లో టిడిపి మౌనంగా ఉంటుందని, ఇతరులపై నిర్బంధాన్ని కూడా టిడిపి ప్రశ్నించాలని కోరారు. మద్యంపై 24 గంటల్లో కేంద్రం చర్యలు తీసుకోవాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి వినతిపత్రం ఇచ్చారని, మూడు రోజులు గడుస్తున్నా కేంద్రం ఎందుకు మాట్లాడటం లేదో చెప్పాలన్నారు. బిజెపి చెబుతున్న మద్యం కుంభకోణంపై సిబిఐ దర్యాప్తునకు కేంద్రం ఎందుకు ఆదేశించలేదని ప్రశ్నించారు. రాష్ట్రానికి ద్రోహం చేస్తున్న మోడీ ప్రభుత్వాన్ని బలపరుస్తూ ఎన్‌డిఎలో జనసేన ఏ విధంగా భాగస్వామ్యం అవుతుందో రాష్ట్ర ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

  • 30 నుండి సిపిఎం ప్రజారక్షణభేరి యాత్రలు

వివిధ తరగతులు, వర్గాల ప్రజల సమస్యలపై రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోరుతూ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో రాష్ట్ర సదస్సులు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ నెల 30 నుంచి పార్వతీపురం, శ్రీకాకుళం, కర్నూలు నుంచి రాష్ట్ర బస్సు యాత్రలు నిర్వహిస్తున్నామని, ఈ యాత్రలు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో 12 రోజులపాటు పర్యటిస్తాయని చెప్పారు. నవంబర్‌ 15న విజయవాడలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ బహిరంగ సభలో సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పాల్గంటారని చెప్పారు. ప్రజారక్షణ భేరి యాత్రలను, విజయవాడ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మంతెన సీతారాం, జిల్లా కార్యదర్శి ఎ.రవి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పి.కిషోర్‌, జిల్లా కమిటీ సభ్యులు కె.శ్రీనివాస్‌ పాల్గొన్నారు.