Oct 28,2023 22:02

- ఎపికి కేంద్రం తీరని అన్యాయం

- బిజెపిని ఎందుకు మోస్తున్నారో పవన్‌ చెప్పాలి
- సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత వైసిపికి లేదు
- 30 నుంచి సిపిఎం ప్రజా రక్షణ భేరి బస్సు జాతాలు
- వామపక్ష పార్టీలతో కలిసి భవిష్యత్తు కార్యాచరణ
- సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు విమర్శించారు. బిజెపి చేతిలో ఎపి ప్రభుత్వం కీలుబమ్మలా మారిందని ఎద్దేవా చేశారు. సిపిఎం కేంద్ర కమిటీ సమావేశాల్లో పాల్గనేందుకు ఢిల్లీ వచ్చిన శ్రీనివాసరావు శనివారం హరికిషన్‌ సింగ్‌ సూర్జిత్‌ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. సిపిఎం రాజకీయ విధానాన్ని ప్రజలకు చెప్పడం, ప్రజా సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయం అంశాలను ప్రజలకు వివరించే కార్యాచరణతో ప్రజా రక్షణ భేరి బస్సు జాతాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజల సమస్యలే ప్రధాన ఎజెండాగా ఈ నెల 30 నుంచి రాష్ట్రంలో మూడు సిపిఎం ప్రజా రక్షణ భేరి బస్సు జాతాలు ప్రారంభం కానున్నాయని చెప్పారు. కర్నూలు జిల్లా ఆదోని, శ్రీకాకుళం జిల్లా మందస, పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట నుంచి విజయవాడ వరకు బస్సు జాతాలు జరగనున్నాయని తెలిపారు. నవంబర్‌ 15న విజయవాడలో ప్రజా రక్షణ భేరి సభ నిర్వహించనున్నామని, ఈ సభకు సీతారాం ఏచూరి, బివి రాఘవులు హాజరవుతారని చెప్పారు.
వామపక్ష పార్టీలతో కలిసి భవిష్యత్‌ కార్యాచరణ రూపొందిస్తామని శ్రీనివాసరావు పేర్కొన్నారు. పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం ఏపికి సంబంధించిన ఒక్క సమస్య కూడా పరిష్కరించలేదని విమర్శించారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు, విశాఖ, కడప ఉక్కు పరిశ్రమల అంశాలను పట్టించుకోలేదని దుయ్యబట్టారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా నది జలాల పంపకాలలో తగాదాలు పెడుతుందని విమర్శించారు. తెలంగాణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బిజెపి నాటకాలు ఆడుతోందని అన్నారు. కేంద్రం అన్యాయం చేస్తుంటే రాష్ట్రంలో రాజకీయపార్టీలు మాట్లాడకపోవడం దురదృష్టకరమన్నారు. ఎపి ప్రభుత్వం బిజెపి చేతిలో కీలుబమ్మలా తయారయ్యిందని ఎద్దేవా చేశారు. ఎక్కడ ఎలాంటి చట్టాన్ని తీసుకు రమ్మని చెప్తే, వైసిపి అలాంటి చట్టాలను రూపొందిస్తుందని విమర్శించారు. పవన్‌ కల్యాణ్‌ ఎన్‌డిఎలో ఎందుకు ఉన్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. బిజెపి ఏం చేసిందని ఎన్‌డిఎలో ఉన్నారని, బిజెపి, ఎన్‌డిఎను పవన్‌ ఎందుకు మోస్తున్నారని ప్రశ్నించారు. తెలుగువారి ఆత్మ గౌరవాన్ని కాపాడతారా? బిజెపి ముందు మోకరిల్లుతారా? తేల్చుకోవాలని హితవు పలికారు.
చంద్రబాబు అరెస్టును ఖండించామని, కేంద్ర ప్రభుత్వం అరెస్టు విషయంలో నాటకం ఆడుతోందని విమర్శించారు. కేంద్రంలో ఉన్న బిజెపికి తెలిసే చంద్రబాబు అరెస్టు జరిగిందని చెప్పారు. బిజెపి వల్ల ప్రజాస్వామ్య హక్కులు హరించబడుతున్నాయని, బిజెపిని ఆదర్శంగా తీసుకుని వైసిపి హక్కులను హరిస్తుందని ధ్వజమెత్తారు. వైసిపి సామాజిక న్యాయం పాటించడం లేదని, దళితులపై దాడులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత వైసిపికి లేదని అన్నారు.