Sep 13,2022 22:40
  • నేటి నుంచి దేశ రక్షణ భేరి
  • అధికారమే పరమావధిగా నీచరాజకీయాలు
  • రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం ఆధ్వర్యాన రాజకీయ ప్రచారం

ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌, శింగనమల : అధికార దాహంతో ప్రజల మధ్య కులం, మతం చిచ్చురేపుతున్న బిజెపి పాలన దేశసముగ్రతకు తీవ్ర ముప్పని, ప్రతి ఒక్కరూ ఇలాంటి పాలనను తిప్పికొట్టాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. అనంతపురం జిల్లాలో మంగళవారం ఆయన పర్యటించారు. ముందుగా జిల్లాలో అతిపెద్దదైన శింగనమల చెరువును పరిశీలించి అక్కడి రైతులతో మాట్లాడారు. అనంతరం 'మోడీ ప్రభుత్వ విధానాలు - ప్రజలపై భారాలు - ఉద్యోగ ఉపాధి సమస్యలు' అనే అంశంపై సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో అనంతపురం ఆర్ట్స్‌ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. భారత స్వాతంత్య్రంలో బిజెపి వహించిన మోసకారి పాత్ర మొదలు... మోడీ పరిపాలన చేపట్టిన నాటి నుంచి దేశం ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ ఎగ్జిబిషన్‌లో ఫొటోలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో శ్రీనివాసరావు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తోన్న ప్రజావ్యతిరేక విధానాలతో ప్రజాసంక్షోభం నెలకొందన్నారు. కార్పొరేట్‌ సంస్థలకు దేశ సంపదను దోచిపెట్టడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోడీ పని చేస్తున్నారని తెలిపారు. అవినీతి, మతోన్మాదం పెరిగిందన్నారు. మానవాభివృద్ధిలో భారతదేశం 132వ స్థానంలో నిలవడం బిజెపి నిర్లక్ష్య పాలనకు నిదర్శనమన్నారు. రాష్ట్రం పట్ల మోదీ ప్రభుత్వం ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నా, ఇక్కడి అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నించలేని దుస్థితిలో ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో ఈ రెండు పార్టీలూ మోడీకి గులాంగా వ్యవహరిస్తూ ప్రజల ప్రయోజనాలను కేంద్రం వద్ద తాకట్టు పెట్టడం దుర్మార్గమన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతిపై కూడా బిజెపి ద్వంద్వ వైఖరి అవలంభిస్తోందని తెలిపారు. రాజధానిపై గెజిట్‌ లేదని, మూడు రాజధానులు అని, అమరావతే అంటూ మభ్యపెడుతోందన్నారు. అమరావతి పరిరక్షణ పాదయాత్రకు సిపిఎం మద్దతు ఇస్తోందని తెలిపారు. పాదయాత్రను అడ్డుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తుండడాన్ని సిపిఎం తీవ్రంగా ఖండిస్తోందన్నారు. బిజెపి ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజలను చైతన్యపరిచేందుకు సిపిఎం ఆధ్వర్యంలో ఈ నెల 14 నుంచి 27 వరకు రాష్ట్ర వ్యాప్తంగా వాడవాడలా పాదయాత్రలు, సదస్సులు, సభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అందులో భాగంగా 23న పుట్టపర్తిలో, 24న విజయవాడలో, 27న విశాఖలో సభలు జరగనున్నాయని చెప్పారు. వీటిలో ప్రజలు పాల్గని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర ఒకటో కమిటీ కార్యదర్శి వి.రామిరెడ్డి, నాయకులు వలి, ప్రకాష్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి సూర్యచంద్ర యాదవ్‌ తదితరులు పాల్గన్నారు.

  • వరద నీటిని నిల్వ చేయడంలో ప్రభుత్వం విఫలం

ఈ ఏడాది వర్షాలు ఆశాజనకంగా పడి ప్రాజెక్టులకు నీరు వస్తోన్నా, వాటిని పూర్తి స్థాయిలో నిల్వ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని వి.శ్రీనివాసరావు విమర్శించారు. మంగళవారం నాడు ఆయన అనంతపురం జిల్లా శింగనమల శ్రీరంగ రాయలచెరువును సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇటీవల వర్షాలతో జిల్లాలోని అన్ని డ్యాములు నిండాయన్నారు. లీకేజీలు, భద్రత తదితర కారణాలతో ఈ నీటిని డ్యాంల్లో ఉంచే పరిస్థితి లేక అనవసరంగా సముద్రం పాలవుతున్నాయన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఇటీవల 18 టిఎంసిల నీరు వృథాగా నదుల్లోకి వదిలేసినట్లు తెలుస్తోందన్నారు. ఈ నీరు డ్యాంల్లో నిలువ చేసే పరిస్థితి ఉంటే రైతులకు ఎంతో ఉపయోగంగా ఉండేదన్నారు. నీటి నిలువపై ప్రజాప్రతినిధులు దృష్టి సారించాలని డిమాండ్‌ చేశారు.