Oct 25,2023 17:37
  • రాష్ట్రంలో అసమానతలు లేని అభివృద్ధి జరగాలని కోరుతూ సిపిఎం విడుదల చేసిన ప్రణాళికను బలపరచండి.
  •  సిపిఎం జిల్లా కమిటీ పిలుపు

ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్ : ఆంధ్ర రాష్ట్రంలో అసమానతలు లేని అభివృద్ధి జరగాలని కోరుతూ సిపిఎం ప్రత్యామ్నాయ ప్రణాళికను రాష్ట్రంలో విడుదల చేసిందని సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ తెలిపారు. బుధవారం సుందరయ్య భవనంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పి .నిర్మల, రాధాకృష్ణ, రామకృష్ణ, నారాయణలతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిపిఎం పార్టీ తన ప్రత్యామ్నాయ ప్రణాళికలో 400 రూపాయలకు గ్యాస్ కనెక్షన్ ఇవ్వాలని, 60 రూపాయలకే పెట్రోల్, డీజిల్ ఇవ్వాలని, పెన్షన్లు 5000 రూపాయలు ఇవ్వాలని,  మెగా డిఎస్సి విడుదల చేసి  4 వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలని, మధ్య తరహా పరిశ్రమలకు యాజమాన్యాలకు  ప్రభుత్వాలు రాయితులు ఇవ్వాలని, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వాలని, పెండింగ్ ఉన్న సాగునీటి ప్రాజెక్టులను తక్షణమే పూర్తి చేయాలని, స్వామినాథన్ సిఫారసులు అమలు చేసి రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, రసాయనక ఎరువుల ధరలు  అదుపు చేయాలని, చదువుకున్న నిరుద్యోగులకు ఐదువేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వాలని, వ్యవసాయ కార్మికులకు 200 రోజులు పని దినాలు కల్పించాలని, రోజుకు 600 రూపాయలు కూలి ఇవ్వాలని, పట్టణ ప్రాంతాల్లో కూడా ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయాలని, భూమిలేని నిరుపేదలకు రెండున్నర ఎకరాల భూమి ఇవ్వాలని, కౌలు రైతులకు కౌలు రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని, రచయితలపై జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని, లౌకిక తత్వాన్ని కాపాడాలని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని, వెనకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించే నిధులు కేటాయించాలని ప్రణాళికలు పెట్టడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అలాగే దీనితోపాటు కర్నూలు జిల్లా సమగ్ర అభివృద్ధి కొరకు సంవత్సరానికి ₹10,000 కోట్లు విడుదల చేయాలని జిల్లాలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు తక్షణమే పూర్తి చేయాలని కర్నూలు జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని, ఓర్వకల్ లో  ప్రకటించిన పారిశ్రామిక హబ్ లో ఐటీ, ఫార్మా, స్టీల్ ఇండస్ట్రీస్ నిర్మించాలని ప్రణాళికలో పెట్టడం జరిగిందని ఆయన తెలిపారు. పై అంశాల సాధన కోసం సిపిఎం రాబోయే కాలంలో పోరాటం చేస్తుందని ఆయన వివరించారు. అందులో భాగంగా అక్టోబరు 30 తేదీ నుండి రాష్ట్రంలో అసమానతలు లేని అభివృద్ధి జరగాలని కోరుతూ ప్రజారక్షణభేరి యాత్ర మూడు కేంద్రాల నుండి బయలుదేరుతుందని ఆయన తెలిపారు. అక్టోబర్ 30 తేదీన ఉదయం 10 గంటలకు ఆదోనిలో బస్సు యాత్ర ప్రారంభమవుతుందని ప్రారంభ సభకు సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు అశోక్ ధావలె, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్ ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారని ఆయన తెలిపారు. ఈ సభకు, బస్సు యాత్రలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. రాష్ట్రంలో వేలాది మందిని సమీకరించి నవంబర్ 15 తేదీన విజయవాడలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని ఈ బహిరంగ సభకు సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి హాజరవుతున్నారని ఆయన తెలిపారు.