May 28,2023 14:45

ప్రజాశక్తి-ఆదోనిరూరల్ : మండలం పరిధిలో పాండవగల్ పెద్ద చెరువు సమస్యపై మూడవరోజు రిలే  నిరాహార దీక్షలు కొనసాగాయి.ఈ దీక్షలు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి రామాంజనేయులు, పాండవగల్ గ్రామ సర్పంచ్ కె ఉమాదేవి ప్రారంభించారు. దీక్షలను ఉద్దేశించి సిపిఎం జిల్లా నాయకులు రామాంజనేయులు,సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె.వెంకటేశులు,సిపిఎం పార్టీ మండల కార్యదర్శి లింగన్న మాట్లాడుతూ సర్వేనెంబర్ 135 లో ఉన్న పాండవగల్లు పెద్ద చెరువు 20 ఎకరాలను ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలని గత 30 సంవత్సరాలుగా సిపిఎం పార్టీ ఉద్యమిస్తూనే ఉందని, అయినప్పటికీ గెలిచిన ప్రభుత్వాలు కానీ ప్రజాప్రతినిధులుగాని ప్రస్తుతం ఉన్న అధికారులు కానీ ఎవరు కూడా దీని పట్ల చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తున్నారని, వీరికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ప్రభుత్వ లాయర్లతో మాట్లాడి, హైకోర్టులో పెండింగ్లో ఉన్న కేసును వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద చెరువును స్వాధీనం చేసుకునే అంతవరకు తన పోరాటాన్ని కొనసాగిస్తుందని ఈ పోరాటానికి జిల్లా కమిటీ సంపూర్ణంగా మద్దతుగా ఉంటుందని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం, రెవెన్యూ అధికారులు స్పందించి వెంటనే కోర్టులో జోక్యం చేసుకోవాలని లేని పక్షంలో ఆదోనిలో రెవెన్యూ కార్యాలయాలు ముందు జరిగే ఆందోళనలకు వారే బాధ్యత వహించాల్సి వస్తుందని వారు హెచ్చరించారు. మూడవరోజు నిరాహార దీక్షల్లో సిపిఎం పార్టీ మండల నాయకులు జే రామాంజనేయులు,సిపిఎం పార్టీ శాఖ కార్యదర్శులు గోవిందు,అనీఫ్ బాషా, సిపిఎం పార్టీ సభ్యులు 9వ వార్డు నెంబర్ కే కృష్ణ,4వ వార్డ్ సభ్యులు ఎస్. మా భాష,  సిపిఎం సానుభూతిపరులు, ఆంజనేయ, యు.పరశురాం, డివైఎఫ్ఐ నాయకులు భాస్కర్, మంజునాథ, రమేష్ కూర్చున్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం శాఖ కార్యదర్శి కే పాండురంగ,సిపిఎం పార్టీ మహిళా శాఖ కార్యదర్శి నరసమ్మ, పార్టీ సభ్యులు మునెమ్మ,తాయమ్మ, భవాని, తిమ్మక్క, గ్రామ పెద్దలు మరియు హుస్సేనీ, రంజాన్, దేవయ్య, రామాంజనేయులు, సిపిఎం  పార్టీ సభ్యులు, సానుభూతిపరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.