Jul 31,2023 22:48
  • కలెక్టరేట్ల వద్ద ధర్నా
  • విభజన హామీలు చేయాలి : వి శ్రీనివాసరావు

ప్రజాశక్తి-యంత్రాంగం : కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటు విషయంలో బిజెపి ద్రోహంపై సోమవారం నిరసనలు వెల్లువెత్తాయి. రాయసీమతోపాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సిపిఎం ఆధ్వర్యాన ర్యాలీ, కలెక్టరేట్ల వద్ద ధర్నా నిర్వహించారు. కలెక్టర్లకు వినతిపత్రం అందజేశారు. కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ సాంకేతికంగా, ఆర్థికంగా లాభదాయకం కాదని కేంద్రలోని బిజెపి ప్రభుత్వం ప్రకటించడం రాష్ట్ర ప్రజలను మోసగించడమేనని వక్తలు విమర్శించారు. పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలం బ్రాహ్మణచెర్వు సెంటర్‌లో జరిగిన నిరసన కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగి పదేళ్లవుతున్నా నేటికీ విభజన హామీలేవీ అమలు చేయకుండా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీరని ద్రోహం చేసిందని, అదే కోవలో కడప ఉక్కు పరిశ్రమపై కేంద్రం స్పందన ఉందని విమర్శించారు. విశాఖ రైల్వేజోన్‌ ప్రకటిస్తామని, ఉత్తరాంధ్రకు సుజల స్రవంతి నీళ్లు తీసుకొస్తామని, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని, రామాయపట్నం పోర్టు పెడతామని, రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తామని ప్రధాని మోడీ ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోలేదన్నారు. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటును పక్కన పెట్టడంతోపాటు ఉన్న విశాఖ ఉక్కును అమ్మకానికి పెట్టడం దారుణమన్నారు. పోలవరం ప్రాజెక్టు పరిధిలోని ముంపు గ్రామాల ప్రజలకు పునరావాస సౌకర్యం కల్పించకుండా, పరిహారం ఇవ్వకుండా గోదాట్లో ముంచుతున్నారని విమర్శించారు. తక్షణం పోలవరం నిర్వాసితులకు పరిహారం, ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మంతెన సీతారాం, జిల్లా కార్యదర్శి బి.బలరాం తదితరులు పాల్గన్నారు. అనంతపురంలో ర్యాలీ జరిగింది. కలెక్టరేట్‌ వద్ద మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్‌ మాట్లాడుతూ కడప ఉక్కు పరిశ్రమ వస్తే రాయలసీమలోని లక్షలాది మంది యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి వస్తుందని ప్రభుత్వాలు చెప్పాయన్నారు. దీంతో, ఈ పరిశ్రమ ఏర్పాటు కోసం ఆ ప్రాంత యువత ఎదురుచూస్తున్న తరుణంలో దానిని ఏర్పాటు చేయడం లేదంటూ పార్లమెంట్‌లో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానందరారు రాతపూర్వకంగా సమాధానం ఇవ్వడం సీమ ప్రజలకు ద్రోహం చేయడమేనని తెలిపారు. కేంద్రప్రభుత్వ తీరును ప్రశ్నించలేని స్థితిలో రాష్ట్రంలోని అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి, జనసేన పార్టీలు ఉన్నాయన్నారు. ఇప్పటికైనా ఆ పార్టీలు సీమ ప్రజల ఆకాంక్షను గుర్తించి కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్‌ చేశారు. విజయవాడ బీసెంట్‌ రోడ్డులో జరిగిన ధర్నాలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు మాట్లాడుతూ కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినా కడప బిడ్డనని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి జగన్‌... కేంద్రాన్ని, మోడీ ద్రోహాన్ని ప్రశ్నించకపోవడం సిగ్గుచేటన్నారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్‌, కె.శ్రీదేవి తదితరులు పాల్గన్నారు. పుట్టపర్తి, కర్నూలు, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు, భీమవరం కలెక్టరేట్ల వద్ద, గుంటూరులో శంకర్‌ విలాస్‌ సెంటర్‌లో ధర్నా నిర్వహించారు. ఆయా జిల్లాల సిపిఎం కార్యదర్శులు తదితరులు పాల్గన్నారు.