Jul 06,2023 06:07

'పోలవరం నిర్వాసితుల పోరుకేక' మహా పాదయాత్ర జయప్రదమైంది. ప్రాజెక్టు వల్ల భూములు, ఊళ్లు, ఇళ్లు, సర్వం కోల్పోయిన లక్షల మంది అభాగ్యుల పునరావాసంపై దశాబ్దాలుగా ప్రభుత్వాలు చూపుతున్న నిర్లక్ష్యాన్ని ఎలుగెత్తింది పాదయాత్ర. అందుకే పాదయాత్రకు వివిధ పార్టీలు, సంఘాలు, సంస్థల నుంచి మద్దతు, సంఘీభావాలు వెల్లువెత్తాయి. పాదయాత్రకు హర్షాతిరేకాలు, అభినందనలు లభించాయి. అడవుల్లో, మారుమూల ఏజెన్సీలో నిర్వాసిత గ్రామాల్లో పాదయాత్ర తలపెట్టడం అతిపెద్ద సవాల్‌ కాగా అడ్డంకులను అధిగమించి విజయవంతం చేయడం సాధారణ విషయం కాదు. జూన్‌ 20న అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం నెల్లిపాకలో సమరోత్సాహంతో ప్రారంభమైన సిపిఎం పాదయాత్ర చివరి మజిలీ విజయవాడ చేరే వరకు మడమ తిప్పలేదు. 380 గ్రామాలను సందర్శిస్తూ 400 కిలోమీటర్లు అప్రతిహతంగా సాగింది. మండుటెండలను, వర్షాలను, ఆరోగ్య సమస్యలను పాదయాత్రీకులు లెక్కచేయకుండా ముందుకేనన్నారు. 500 మందికిపైగా వలంటీర్లు పాల్గొనగా అత్యధికులు యువతే. వందకుపైన మహిళలు తుదికంటా కదంతొక్కడం విశేషం. హంగు ఆర్భాటాలతో హైవేలపై జరుగుతున్న మిగతా పాదయాత్రలకు పోలవరం నిర్వాసితుల పాదయాత్ర పూర్తి భిన్నం అయినందునే సర్వత్రా శభాష్‌ అనిపించుకుంది.
పోలవరం నిర్వాసితులది బతుకు పోరాటం. ఏళ్లతరబడి తమ ఆవేదనను ప్రభుత్వాలకు తెలుపుతూనే ఉన్నారు. అయినా ఉలుకు పలుకు లేదు. లక్షా ఆరువేల కుటుంబాలు ఖాళీ చేయాల్సిన పరిస్థితి. అడవినే నమ్ముకొని బతుకు సాగిస్తున్న గిరిపుత్రులు, ఎస్‌సి, బిసి, పేదలు కకావికలం అవుతున్నారు. ప్రాజెక్టు వలన లక్షల ఎకరాలకు సాగునీరు, వందల గ్రామాలకు తాగునీరు అందుతుంది కాబట్టి 'పోలవరం'ను రాష్ట్రానికి జీవనాడిగా పేర్కొనవచ్చు. సమాజాభివృద్ధికి దోహదపడే ప్రాజెక్టు కోసం సర్వస్వం అర్పించిన తమ పట్ల ప్రభుత్వాలు చూపుతున్న నిర్లక్ష్యంపై తమకు దిక్కెవరని ఆందోళనగా ఉన్నారు. వారికి సిపిఎం అండగా నిలిచి పోరాడుతోంది. నిర్వాసితుల సమస్యలను నేరుగా ఆకళింపు చేసుకోడానికి పాదయాత్ర చేపట్టింది. నిరాశ్రయుల్లో వారి భవిష్యత్తుకు భరోసా, ఆత్మవిశ్వాసం కల్పించింది. ఉద్యమ స్ఫూర్తిని రగిలించింది. పోలవరంలో ఇమిడిఉన్న చట్టాలను, నిర్వాసితుల హక్కులను, ప్రభుత్వాలు ఇచ్చిన హామీల సాధనకు పోరాటమే మార్గమని దిశా నిర్దేశం చేసింది. అందుకే ఈ పాదయాత్ర ఒక మైలురాయి కాగలిగింది.
డ్యామ్‌ నిర్మాణాన్ని మాత్రమే లెక్కించి నిర్వాసితుల ఆర్‌ అండ్‌ ఆర్‌ను ప్రభుత్వాలు పరిగణనలోకి తీసుకోవట్లేదు. మొత్తం ప్రాజెక్టు అంచనాల్లో ఇప్పటికి 22 శాతమే పూర్తయింది. అందులో ఆర్‌ అండ్‌ ఆర్‌ 11 శాతం మాత్రమే. జాతీయ ప్రాజెక్టు అంటున్న కేంద్ర బిజెపి ప్రభుత్వం ఆర్‌ అండ్‌ ఆర్‌ బాధ్యత తనది కాదని మెలికలు పెడుతోంది. రాష్ట్ర విభజన అనంతరం ఇప్పటి వరకు కేంద్రం ఇచ్చిన రూ.14 వేల కోట్లల్లో ఆర్‌ అండ్‌ ఆర్‌ లేదు. వైసిపి సర్కారొచ్చాక కేంద్రం నుంచి తెచ్చిన 7,600 కోట్లలో నిర్వాసితులకు ఖర్చు చేసిందేమీ లేదు. తాజాగా కేంద్రం నుంచి వస్తాయంటున్న 12 వేల కోట్లలో ఆర్‌ అండ్‌ ఆర్‌ భాగమెంతో తెలీదు. తొలిదశ, మలిదశ వివాదం ఉండనే ఉంది. గోదావరిపై అడ్డంగా కాఫర్‌డ్యాం కట్టడం వలన ఊహించని స్థాయిలో వరదనీరు వెనక్కి తన్ని కాంటూర్‌ లెక్కల్లో చూపని గ్రామాలు సైతం మునుగుతున్నాయి. పునరావాస కాలనీలూ మునుగుతున్నాయి. ప్రజలు కట్టుబట్టలతో ఇళ్లొదలాల్సిన దుస్థితి. ఇక్కడా సహాయ చర్యల్లో ప్రభుత్వానిది వైఫల్యమే. ముంపు గ్రామాల్లో అభివృద్ధి, సంక్షేమం, విద్య, వైద్య సౌకర్యాలు నిలిచిపోయాయి. నిర్వాసితుల సమస్యలను ప్రభుత్వాలు పరిష్కరించాలని సిపిఎం పాదయాత్ర డిమాండ్‌ చేసింది. పాదయాత్ర ప్రారంభం మాత్రమేనని స్పందించకుంటే అందరినీ కలుపుకొని ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించింది. నిర్వాసితుల సమస్యలపై చర్చిస్తామని బుధవారం హైలెవల్‌ సమావేశం ఏర్పాటు చేసిన ఇరిగేషన్‌ మంత్రి అంబటి రాంబాబు, రాజమండ్రిలో మరో భేటీ అంటున్నారు. ప్రజలను విస్మరించిన ప్రభుత్వాలు మనజాలవని, ప్రజలు బుద్ధి చెబుతారని చరిత్ర తరచు నిరూపిస్తూనే ఉంది. నిర్వాసితుల గుండె చప్పుడును ప్రపంచానికి వినిపించిన పాదయాత్రీకులకు జేజేలు. పార్టీలు, యావత్‌ పౌర సమాజం నిర్వాసితుల బతుకు పోరుకు మద్దతిచ్చి నాగరిక సమాజమని చాటాలి.

(పోలవరం పోరుకేక పూర్తి పాదయాత్ర విశేషాలు ఈ లింక్ లో చూడగలరు)