ప్రజాశక్తి-రెడ్డిగూడెం : కొన్ని పనికిరాని నిబంధనల పేరుతో సామాజిక పెన్షన్ లు తొలగించే ప్రయత్నం విరమించుకోవాలని రెడ్డిగూడెం సిపిఎం మండల కమిటీ డిమాండ్ చేసింది. రెడ్డిగూడెం సిపిఎం మండల కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆ పార్టీ సీనియర్ నాయకులు యం మాధవరెడ్డి మాట్లాడుతూ గతంలోనే పలు రకాల కారణాలు చూపి పెన్షన్ లకు పెద్ద ఎత్తున కోత పెట్టారనీ మరలా కొన్ని తప్పులు కారణాలు చూపుతూ సామాజిక పెన్షన్లను తొలగించే కుట్ర జరిగిందని అన్నారు. పేద వృద్ధులు, వికలాంగులు, వితంతువులు మరియు వివిధ రకాల పింఛన్లుకు పెద్ద ఎత్తున కోతపెట్టే కుట్ర జరిగిందని ఆరోపించారు. ఇలా నెల నెలా పింఛన్లు తగ్గించుకుంటూ పోతే పేదలైన వారికి ఎవరు ఆసరాగా ఉంటారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే తన తప్పుడు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్. లేదంటే సిపిఎం పేదల పక్షాన నిలబడి పోరాటాలు చేస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో సిపిఎం పార్టీ నాయకులు ఉయ్యూరు కృష్ణారెడ్డి, మోహనరెడ్డి పాల్గొన్నారు.










