ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్ : జిల్లా సమగ్ర అభివృద్ధికై జులై నెల 26 నుండి 31 వ తారీకు వరకు జరుగుతున్న సిపిఎం మహా పాదయాత్రలో కార్మిక వర్గం అగ్ర భాగాన ఉంది నడిపించాలి. సిఐటియు పిలుపు ఇచ్చింది. శుక్రవారం సిఐటియు న్యూ సిటీ కమిటీ సమావేశము కార్మిక కర్షక భవనం నందు ఆర్. నరసింహులు అధ్యక్షతన జరిగింది. సిపిఎం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి డి. గౌస్ దేశాయ్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పీ. నిర్మల, పి.ఎస్ రాధాకృష్ణ, సిపిఎం పార్టీ న్యూ సిటీ కార్యదర్శి టి.రాముడు, సిఐటియు న్యూ సిటీ నగర కార్యదర్శి సి.హెచ్ సాయిబాబా లు సమావేశానికి హాజరైనటువంటి కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ సిపిఎం పార్టీ కర్నూలు జిల్లా సమగ్ర అభివృద్ధికై మహా పాదయాత్రను చేపట్టింది. జూలై నెల 26 నుండి 31 వ తేదీ వరకు ఆదోని నుండి పాదయాత్ర ప్రారంభమై గ్రామాలలో, పట్టణాలలో ప్రజలను కలుసుకొని ప్రజలు ఎదుర్కొంటున్నసమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం కోసం, వెనకబడిన కర్నూలు జిల్లాలో ప్రాజెక్టుల నిర్మాణం తక్షణమే చేపట్టి సాగునీరు, త్రాగునీరు అందించాలని, ప్రతి మండలానికి ఒక డిగ్రీ కాలేజీ, ఇంటర్ కాలేజీలుఏర్పాటు చేయాలని, ప్రతి గ్రామంలో ప్రాథమిక మరియు హై స్కూలు ఏర్పాటు చేయాలని, ఉపాధి హామీ పథకం ద్వారా సంవత్సరానికి 200 రోజులు పని దినాలు కల్పించి, రోజు కూలి 600 రూపాయలు ఇవ్వాలని, జిల్లాలో చదువుకున్న యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం పరిశ్రమలు ఏర్పాటు చేయాలని, ఖాళీగా ఉన్న ప్రభుత్వఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, కర్నూలు జిల్లాకు తలమానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ను నిమ్స్ తరహాలో అభివృద్ధి చేయాలని, ప్రభుత్వ యూనివర్సిటీల్లో లెక్చరర్స్ ను స్టాఫ్ ను భర్తీ చేసి యూనివర్సిటీల అభివృద్ధికి నిధులు కేటాయించాలనన్నారు. జిల్లాలో రోడ్లన్నీ కూడా గుంతలమాయమై శిథిలావస్థకు చేరుకున్న రోడ్లన్నీ మరమ్మత్తులు చేసి కొత్త రోడ్లు నిర్మించి ప్రజలను ప్రమాదాల నుండి కాపాడాలని, రైతులు పండించిన పంటకు గిట్టుబాటుధర కల్పించాలని కర్నూలు జిల్లా సమగ్రఅభివృద్ధికొరకు పదివేలకోట్లనిధులనుకేటాయించాలని సిపిఎం పార్టీ మహాపాదయాత్రను చేపట్టింది. ఈ పాదయాత్రలో అన్ని రంగాలకు సంబంధించిన కార్మిక వర్గం అగ్రభాగాన ఉండిఈ మహాపాదయాత్రలను విజయవంతం చేయవలసిన అవసరం ఉన్నదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల సమస్యలను పక్కనపెట్టి రాజకీయ ఎజెండాను ముందుపెట్టుకుని ఓటు రాజకీయాలు చేస్తున్నాయి. విద్య, వైద్యము, ప్రాజెక్టులు, పరిశ్రమలు, ఉపాధి, రైతుల పంటకు గిట్టుబాటు ధర కల్పించడంవంటి ముఖ్యమైనటువంటి విషయాలను పక్కన పెట్టినిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం వహిస్తున్న ఈ పాలకులకు బుద్ధి చెప్పే విధంగా, ప్రజలను చైతన్యం చేసి పోరాటం వైపు నడిపించి ప్రభుత్వం మెడలు వంచి ఈ జిల్లా అభివృద్ధికీ పదివేల కోట్ల నిధులు కేటాయించే విధంగా చేయడం కోసం సిపిఎం పార్టీ పాదయాత్రను చేపట్టింది. దున్నపోతు వలె నిద్రమత్తులో ఉన్నటువంటి ఈ ప్రభుత్వానికి ముళ్ళ కర్రతో నిద్రలేపవలసిన అవసరం ఉన్నది. మన పాదయాత్రలో కార్మిక, కర్షక, అన్ని రకాల కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. జూలై 31వ తేదీన కలెక్టరేట్ ముందు కర్నూలు జిల్లా సమగ్రఅభివృద్ధికై జరిగే మహాధర్నాలో వేలాదిగా ప్రజలు తరలిరావాలని కోరారు.ఈ సమావేశంలో యూనియన్ నగరనాయకులు కె.సుధాకరప్ప, జి.గోపాల్, వెంకటేశ్వర్లు, విధేయుడు కే.ప్రభాకర్, ఎర్రమల, గోవిందు, భాష మొదలగు వారు పాల్గొన్నారు.










