ప్రజాశక్తి-ఆదోని : అన్ని రంగాలలో వెనుకబడ్డ ఆదోని అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి పురోగతి కి పాటుపడాలని సిపిఎం నాయకులు కోరారు సోమవారం ఆదోని పట్టణంలోని మున్సిపల్ హైస్కూల్లో జగనన్న విద్యా కానుక విద్యార్థులకు కిట్ల పంపిణీ హాజరైన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గానా రాజేంద్రనాథ్ రెడ్డికి పట్టణ, మండల కార్యదర్శిలు లక్ష్మన్న, లింగన్న, నాయకులు గోపాల్, తిప్పన్న, వీరేష్, వెంకటేష్ , శ్రీను,శేఖర్ వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడుతూ కర్నూలు కేంద్రానికి ఆదోని పట్టణానికి సుమారు 100 కిలోమీటర్లు దూరం ఉందని,ఇక్కడి నుండి అక్కడ హాస్పిటల్ కి వెళ్లాలంటే చాలా వ్యయంతో కూడుకున్నటువంటి పరిస్థితి ఉందన్నారు అందువల్ల ఆదోని చుట్టుపక్కల సుమారు నాలుగు నియోజకవర్గాలు సెంటర్ గా ఉందన్నారు. అందుకోసమే ఆదోని హాస్పిటల్ ను జిల్లా స్థాయి ఆసుపత్రిగా అప్ గ్రేడ్ చేసి సిటీ స్కాన్, ఎంఆర్ఐ, బెడ్ల సంఖ్య, డాక్టర్లు, నర్సులు సంఖ్య పెంచి ఇతర అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఆదోని పట్టణం రైల్వే ట్రాక్ మీద ఉన్న పాత బ్రిడ్జి పూర్తిగా పాడైపోయి పెద్ద వాహనాలు ఏవి తిరగకుండా, నిషేధించినప్పటికీ బ్రిడ్జి ఏ సమయమైనా కూలిపోయి ప్రమాదం పొంచి ఉందన్నారు. గ్రామాల నుండి వచ్చే పాదాచారులకు ఏదైనా నష్టం సంభవించే అవకాశం కూడా ఉందని మరమ్మత్తులు చేపట్టాలన్నారు. రేణుకాంబ హోటల్ దగ్గర మెట్లెక్కే ఫుట్ ఓవర్ బ్రిడ్జి కూడా పూర్తిగా శిథిలావస్థకు చేరిందని, అధికారులకు విన్నవించిన పట్టించుకోవడం లేదన్నారు ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితి ఉందన్నారు. ఆదోని పట్టణంలో కేవలం రెండు మాత్రమే హైస్కూళ్ళు ఉన్నాయని, సౌకర్యాలను పరిగణలోకి తీసుకొని మరిన్ని పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నా మన్నారు. పట్టణ జనాభా పెరుగుతున్నందున నీటి కొరత ఏర్పడకుండా ఉండడానికి అదనపు ఎస్ఎస్ ట్యాంక్ నిర్మించాలని అవినీతి పత్రంలో పేర్కొన్నారు. మండలంలో ఇప్పటికీ చాలా గ్రామాల్లో రక్షిత మంచినీరు అందే పరిస్థితి లేదని,తీవ్రమైన నీటి ఎద్దడి ఏర్పడిందన్నారు. తక్షణమే నీటి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. నియోజకవర్గానికి సాగునీరు సౌకర్యం తక్కువగా ఉందని ఆదోని శివారు కొండల పరిసర ప్రాంతాల్లో టిఎంసి సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణం చేసి సాగునీరు అందించాలని పేర్కొన్నారు. ఆదోని చుట్టుపక్కల ఉన్నటువంటి పట్టణ , గ్రామీణ భూముల యొక్క వ్యాల్యూ పెంచడం వలన రిజిస్ట్రేషన్ ఫీజులు భరించలేని పరిస్థితి ఉందన్నారు. యథాతరంగా భూములు వ్యాల్యూని కొనసాగించాలని కోరుతున్నామన్నారు.
పట్టణంలో ట్రాఫిక్కు రద్దీ దృష్ట్యా బైపాస్ రోడ్డు పనులు తక్షణమే పూర్తి చేయాలన్నారు. ట్రాఫిక్ రద్దీని నియంత్రించాలని, పోలీస్ ల ఖాళీలను భర్తీ చేయాలని తెలిపారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పట్టణ ప్రాంతాల్లో కూడా అమలు చేసి వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పించాలని వినతి పత్రంలో వివరించారు సమస్యలను పరిశీలిస్తామని మంత్రి బుగ్గన వారికి హామీ ఇచ్చారు










