Apr 20,2023 12:04

ప్రజాశక్తి-మంగళగిరి రూరల్ : కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రచార బేరి కార్యక్రమాన్ని గురువారం నాడు రాజధాని గ్రామమైన నిడమర్రులో సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి పాశం రామారావు ప్రారంభించారు.  ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్న బిజెపిని ఇంటికి సాగనంపి, భారతదేశాన్ని కాపాడాలని  కోరారు. గ్యాస్ ,పెట్రోల్, డీజిల్ నిత్యవసర వస్తువులు, మందుల ధరలను రోజురోజుకు పెంచుతున్న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రైవేటీకరణ వైపు శరవేగంగా పరుగులు పెడుతుందని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు కారు చౌకగా దారాదత్తం  చేస్తున్నదని మండిపడ్డారు. ఆంధ్రుల త్యాగాల ఫలితంగా సాధించుకున్న విశాఖ ఉక్కును కారు చౌకగా ప్రైవేటు వ్యక్తులకు అమ్మబోతున్న బిజెపి సర్కార్ 8 బడ్జెట్లలో రాజధాని నిర్మాణానికి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని ఆగ్రహించారు. ప్రత్యేక హోదా, విభజన హామీ  చట్టాలను తుంగలో తొక్కిన కేంద్ర ప్రభుత్వంపై  వైసిపి, టిడిపి, జనసేన నోరు మెదపడం లేదన్నారు. కేంద్రంలోని బిజెపికి అధికార, ప్రతిపక్ష పార్టీలు వంత పాడుతున్నాయన్నారు. కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని వైసిపి తోడు దొంగల్లావ్యవహరిస్తూ సామాన్య ప్రజలపై పన్నుల భారాన్ని మోపుతున్నారు. బిజెపి ప్రజా వినాశకర, మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా వైకాపా, టిడిపి, జనసేన పార్టీ లు గళం విప్పా లి. సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి  ఎం రవి మాట్లాడుతూ
రాష్ట్రం అంతా మార్చి నెల పెన్షన్లు ఇచ్చిన ప్రభుత్వం, రాజధానిలో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు ఏం పాపం చేశారని వారికి పెన్షన్ నిలిపివేశారని  ప్రశ్నించారు. తక్షణం రాజధానిలో పెన్షన్లు ఇవ్వకపోతే పెన్షన్ దారులతో ఆందోళన చేపడతామని రవి హెచ్చరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా రాజధానిలోని 29 గ్రామాలతో పాటు పరిసర గ్రామాలను కలుపుకొని 32 గ్రామాలలో ఏప్రిల్ 30 వరకు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి వర్గ సభ్యులు ఎం భాగ్యరాజు, డివిజన్ నాయకులు కె వెంకటేశ్వర్లు, గైరబోయిన నాగేశ్వరరావు, ఎం ప్రసన్నకుమార్, కే నాగేశ్వరరావు, కే ప్రకాశరావు, కే స్టాలిన్ మరియు దాసు, రాజ ముని, కే నానయ్య, నాగరాజు, సిపిఐ నాయకులు కట్టే పోగు, విజయకుమార్, తదితరులు పాల్గొన్నారు